అమెరికా ఘటన రాజస్థాన్ లో రిపీట్…మాస్క్ పెట్టుకోలేదని దారుణంగా

  • Published By: venkaiahnaidu ,Published On : June 5, 2020 / 03:20 PM IST
అమెరికా ఘటన రాజస్థాన్ లో రిపీట్…మాస్క్ పెట్టుకోలేదని దారుణంగా

ఫేస్ మాస్క్ ధరించలేదన్న కారణంతో ఓ వ్యక్తిని రాజస్థాన్‌ పోలీసులు చితకబాదారు. రాజస్థాన్ లోని జోధ్‌పూర్ లో గరువారం(జూన్-5,2020)ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మాస్క్ ధరించలేదని ఆరోపిస్తూ ముకేష్ కుమార్ ప్రజాపత్ అనే వ్యక్తి చేతులను  ఓ పోలీస్ వెనక్కి విరిచి పట్టుకోగా, మరో కానిస్టేబుల్ తన మోకాలిని ఆ వ్యక్తి మొడపై పెట్టి తన ప్రతాపం చూపించినట్లుగా ఉన్న ఈ వీడియోను ఇటీవల అమెరికాలోని మిన్నియాపొలిస్ సిటీ పోలీసుల పోలీసు చేతిలో ప్రాణాలు కోల్పోయిన నల్ల జాతీయుడు “జార్జ్‌ ఫ్లాయిడ్‌” కేసుతో పోల్చుతున్నారు నెటిజన్లు. 

అయితే పోలీసుల కథనం మరోలా ఉంది. మాస్క్ ఎందుకు ధరించలేదని తాము ప్రశ్నించామని, ఆ వ్యక్తే తమపై దాడి చేశారని పోలీసులు తెలిపారు. అందుకే తాము అలా ప్రవర్తించాల్సి వచ్చిందని తెలిపారు. ఈ సంఘటన గురువారం సిటీలోని ఓ థియేటర్ ముందు జరిగింది. ముకేష్ కుమార్ ప్రజాపత్ దాడి చేసిన తర్వాతే కానిస్టేబుళ్లు స్పందించారని, అతడే దూకుడుగా ప్రవర్తించాడని పోలీసులు తెలిపారు. పోలీసులను తమ విధిని చేయకుండా అడ్డుకున్నారనే ఆరోపణలతో అతన్ని ఈ రోజు కోర్టులో హాజరుపరిచి కస్టడీకి పంపారు. 

ముకేష్ కుమార్ మాస్క్ ధరించలేదని, పైగా పోలీసులతో గొడవకు దిగి వాళ్లని బెదిరించాడని, ఆ తర్వాత పోలీసుల యూనిఫామ్ ను కూడా చించివేసాడని ఒక పోలీసు అధికారి తెలిపారు. కేసు నమోదు చేయబడిందన్నారు. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఫేస్ మాస్క్ లును వివిధ రాష్ట్రాలు తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. మాస్క్ లేకుండా బయటికొచ్చినవాళ్లకు ఫైన్ లు కూడా విధిస్తున్నారు.