OMG : పిల్లల చేతుల్లో పేలిన సెల్‌ఫోన్ బ్యాటరీ

  • Published By: veegamteam ,Published On : May 4, 2019 / 01:26 PM IST
OMG : పిల్లల చేతుల్లో పేలిన సెల్‌ఫోన్ బ్యాటరీ

చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలో విషాదం చోటు చేసుకుంది. పిల్లల చేతుల్లో సెల్ ఫోన్ బ్యాటరీ పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పిల్లలు పాడైపోయిన ఓ సెల్‌ఫోన్‌ తో ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా బ్యాటరీ పేలింది. కురబలకోట బీసీ కాలనీకి చెందిన ఇస్మాయిల్, అయేషా దంపతుల ఇద్దరు కుమారులు. షేక్‌ సయ్యద్‌ (10), మౌలాలి (8) స్థానికంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 5, 3వ తరగతి చదువుతున్నారు.

సమ్మర్ హాలిడేస్ కావడంతో పిల్లలు ఇంటి దగ్గరే ఉంటున్నారు. శుక్రవారం (మే 3,2019) ఇంటి బయట కూర్చుని మొబైల్ ఫోన్ తో ఆడుకుంటున్నారు. ఇంతలో బాగా ఉబ్బిపోయిన బ్యాటరీ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో అన్నదమ్ములిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారి అరుపులు విన్న స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే చిన్నారులను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో మౌలాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్యాటరీ పేలడానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఎండలు ఎక్కువగా ఉండటంతో అధిక ఉష్ణోగ్రత కారణంగా బ్యాటరీ పేలి ఉండొచ్చని చెబుతున్నారు.

సెల్ ఫోన్ బ్యాటరీ పేలిపోవడం, పిల్లలకు తీవ్రగాయాలు కావడం.. తల్లిదండ్రుల్లో భయాందోళనలు నింపింది. చాలామంది పిల్లలు సెల్ ఫోన్లు చేతిలో పట్టుకుని చూస్తుంటారు. అందులో గేమ్స్ ఆడుతుంటారు. కొందరు పిల్లలు సెల్ ఫోన్ లేనిదే అన్నం కూడా తినరు. అంతగా మొబైల్ కి అడిక్ట్ అయ్యారు. సెల్ ఫోన్ బ్యాటరీ పేలిపోవడం, పిల్లల ప్రాణాల మీదకు రావడం పేరెంట్స్ లో ఆందోళన నింపింది. ఈ ఘటన తర్వాత పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వాలంటే భయపడుతున్నారు. పిల్లల చేతికి సెల్ ఫోన్ ఇచ్చే విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉందని ఈ ఘటన స్పష్టం చేసింది.