JNU దాడి కేసులో సంచలన ట్విస్ట్…ఫొటోలు రిలీజ్

  • Published By: venkaiahnaidu ,Published On : January 10, 2020 / 12:40 PM IST
JNU దాడి కేసులో సంచలన ట్విస్ట్…ఫొటోలు రిలీజ్

దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన ఢిల్లీ జేఎన్ యూలో విద్యార్థులపై, టీచర్లపై దాడి కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. జేఎన్ యూ స్టూడెంట్ లీడర్ అయిషీ ఘోష్ ఉద్దేశ్యపూర్వకంగా పెరియార్ హాస్టల్ పై మరికొంతమందితో కలిసి దాడి చేశారని పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడినవారిలో జేఎన్‌యూ విద్యార్థి నేత ఆయిషీ ఘోష్‌ పేరుతో పాటు తొమ్మిది మంది విద్యార్థి సంఘాలకు చెందినవాళ్లు ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరిలో ఏడుగురు వామపక్ష విద్యార్థి సంఘాలకు చెందిన వాళ్లు,ఇద్దరు ఏబీవీపీకి చెందినవాళ్లు ఉన్నారని పోలీసులు తెలిపారు.

ఈ నెల 5న వర్సిటీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనకు సంబంధించిన పలు కీలక ఆధారాలను ఇవాళ(జనవరి-10,2020)ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. వర్సిటీ పరిధిలోని సీసీ కెమెరాలను పరిశీలించిన అనంతరం దాడిలో పాల్గొన్న విద్యార్థుల ఫోటోలను విడుదల చేశారు. దీనిలో జేఎన్‌యూ స్టూడెంట్ లీడర్ ఆయిషీ ఘోష్‌తో పాటు చుంన్‌చున్ కుమార్‌, పంక‌జ్ మిశ్రా, అయిషా ఘోష్‌, వాస్క‌ర్ విజ‌య్‌, సుచెతా త‌లుక్‌రాజ్‌, ప్రియా రంజ‌న్‌, డోల‌న్ సావంత్‌, యోగేంద్ర భ‌ర‌ద్వాజ్‌, వికాస్ ప‌టేల్ ఉన్నారు. వీరంతా ఈనెల 5న యూవర్సిటీలోని పెరియర్‌ హాస్టల్‌పై దాడికి పాల్పడినట్లు తెలిపారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు హాస్ట‌ల్‌పై దాడి చేసిన ఘ‌ట‌న‌లో ఎవ‌ర్నీ అరెస్టు చేయ‌లేద‌న్నారు. ఈ కేసుకు లింకున్న అనుమానితుల‌ను త్వ‌ర‌లోనే విచారిస్తామ‌ని డీసీపీ తెలిపారు.

జ‌న‌వ‌రి 1 నుంచి 5వ తేదీ వ‌ర‌కు విద్యార్థుల ఆన్‌లైన్ రిజిష్ట్రేష‌న్ కోసం జేఎన్‌యూ అడ్మినిస్ట్రేష‌న్ నిర్ణ‌యించింద‌ని, అయితే వ‌ర్సిటీలోని జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియ‌న్‌, స్టూడెంట్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడ‌రేష‌న్‌, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసొసియేష‌న్‌, డెమోక్ర‌టిక్ స్టూడెంట్స్ ఫెడ‌రేష‌న్‌.. విద్యార్థుల‌ ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్‌ను వ్య‌తిరేకించాయ‌న్నారు. ఈ క్రమంలో అయిషీ ఘోష్ మరియు ఇతర వామపక్ష సభ్యులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లను ఆపడానికి మరియు పెరిగిన ఫీజులకు వ్యతిరేకంగా వారి నిరసనపై సమ్మెను అమలు చేయడానికి జెఎన్‌యులోని సర్వర్ గదిపై దాడి చేశారన్నారు. 

విద్యార్థి నాయకురాలు మరికొందరితో కలిసి పెరియార్ హాస్టల్ పై దాడి చేశారని పోలీసులు తెలిపారు. అయిషీ ఘోష్ గ్యాంగ్ హాస్ట‌ల్ దాడి చేసిన ఘ‌ట‌న త‌ర్వాత గుర్తు తెలియ‌ని కొంద‌రు ముసుగుల‌తో వ‌చ్చి వారిని అటాక్ చేశారన్నారు. అయితే దీనిపై  జేఎన్ యూ స్టూడెంట్ లీడర్ అయిషీ ఘోష్ స్పందిస్తూ…పోలీసులు ఎంక్వైరీ చేసుకోవచ్చన్నారు. తను ఏ విధంగా ఎటాక్ చేయబడ్డానో దానికి సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయని అయిషీ తెలిపింది.