ఢిల్లీ అల్లర్లు : వెలుగులోకి వస్తున్న దారుణాలు…నామరూపాల్లేకుండా పోయిన డీపీఆర్‌ స్కూల్‌

ఢిల్లీ అల్లర్లలో కనీవిని ఎరుగని స్థాయిలో విధ్వంసం అయింది. జరిగిన విధ్వంసం చూస్తుంటే ఒంట్లో వణుకు పుడుతోంది.

  • Published By: veegamteam ,Published On : March 1, 2020 / 03:11 AM IST
ఢిల్లీ అల్లర్లు : వెలుగులోకి వస్తున్న దారుణాలు…నామరూపాల్లేకుండా పోయిన డీపీఆర్‌ స్కూల్‌

ఢిల్లీ అల్లర్లలో కనీవిని ఎరుగని స్థాయిలో విధ్వంసం అయింది. జరిగిన విధ్వంసం చూస్తుంటే ఒంట్లో వణుకు పుడుతోంది.

ఢిల్లీ అల్లర్లలో కనీవిని ఎరుగని స్థాయిలో విధ్వంసం అయింది. జరిగిన విధ్వంసం చూస్తుంటే ఒంట్లో వణుకు పుడుతోంది. ఆందోళనకారులు సాగించిన ఉన్మాద చర్యలు అందర్నీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి. ఇళ్లను, షాపుల్నే కాదు ఆఖరికి అందమైన స్కూళ్లను అంధవికారంగా మార్చేశారు. రాళ్లు, ఇటుకలు, పగిలిన అద్దాలు, కాలిపోయిన వాహనాలు.. విధ్వంసం జరిగిన తీరును కళ్లకు కడుతున్నాయి. ఢిల్లీలో క్రమంగా పరిస్థితి మెరుగుపడుతోంది. పోలీసు బలగాల పహారాతో జనం రోడ్ల మీదకు వస్తున్నారు. 

పదుల సంఖ్యలో స్కూళ్లు ధ్వంసం
ఆందోళనకారుల దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పరిస్థితులు మెరుగవుతున్న కొద్దీ విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోంది. మూకల దాడిలో ముస్తఫాబాద్‌, బ్రిజ్‌పురి, శివవిహార్‌లో పదుల సంఖ్యలో స్కూళ్లు ధ్వంసమయ్యాయి. చదువు నేర్పిన సంస్కారాన్ని మరిచారు.. ఇంగీతం లేకుండా అఙ్ఞానంతో వ్యవహరించారు. సరస్వతి నిలయాన్ని నామరూపాల్లేకుండా చేశారు. స్టూడెంట్స్‌తో ఎప్పుడూ సందడిగా ఉండే డీఆర్‌పీ స్కూల్‌.. ఇప్పుడు దారుణమైన స్థితిలో ఉంది. రెచ్చిపోయిన సో కాల్డ్‌ సొల్లుగాళ్లు పాఠశాల అన్న సోయి కూడా లేకుండా ప్రవర్తించారు. ఫర్నీచర్‌ను తగలబెట్టారు. బ్లాక్‌ బోర్డులు ధ్వంసం చేశారు. బెంచీలను క్లాస్‌రూమ్‌ నుంచి బయటకు విసిరేశారు. కుర్చీలతో పాటు ఇతర సామాగ్రిని పగులగొట్టారు. విద్యార్థుల సర్టిఫికెట్లు, ఎగ్జామ్‌ పేపర్లను మొత్తం కాలిబూడిద చేశారు. భావి పౌరులను తీర్చిదిద్దే పాఠశాలలో బరితెగించిన వాళ్లను ఏమనాలి..? ఏ పేరుతో పిలవాలి..? 

అల్లర్లలో కోట్లాది రూపాయల నష్టం
సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల విధ్వంసం భారీ నష్టాన్నే మిగిల్చింది. శివవిహార్‌ ప్రాంతంలోని ఓ పార్కింగ్‌లో 70 వాహనాలు దగ్ధమయ్యాయి. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. మరోవైపు ఈశాన్య ఢిల్లీలో పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి. భద్రతకు భరోసా కల్పిస్తూ పారా మిలటరీ బలగాలు, ఢిల్లీ పోలీసులు భారీగా మోహరించడంతో.. పలు ప్రాంతాల్లో షాపులు ఓపెన్ అయ్యాయి. ప్రజలు నిత్యావసరాల కోసం వీధుల్లోకి వచ్చారు. రోడ్లపై వాహనాల రాకపోకలు పెరిగాయి. అయితే స్కూళ్లకు మాత్రం మరో వారం రోజుల పాటు సెలవు ప్రకటించారు. 

42కు చేరిన మృతుల సంఖ్య
రాళ్లు, ఇటుకలు, పగిలిన అద్దాలు, కాలిపోయిన వాహనాలతో విధ్వంస కాండకు మౌనసాక్ష్యాలుగా ఉన్న రోడ్లను పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేశారు. అల్లర్లతో కుదేలైన మౌజ్‌పుర్‌, జఫ్రాబాద్‌, గోకుల్‌పురి ప్రాంతాలను ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ సందర్శించారు. పరిస్థితులపై సమీక్షించారు. మరోవైపు, అల్లర్లకు సంబంధించిన మృతుల సంఖ్య 42కు పెరిగింది. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిలువరించేందుకు భద్రతా బలగాలు ఈశాన్య ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించాయి. శాంతి, సామరస్యాలను పాటించాలంటూ మతపెద్దలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అల్లర్లకు సంబంధించి 630 మందిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు పోలీసు ఉన్నతాధికారులు. హింసలో 250మంది గాయపడ్డారని.. 148 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామన్నారు.

కొన్ని చోట్ల వెల్లివిరుస్తోన్న మానవత్వం 
కొన్ని చోట్ల మానవత్వం వెల్లివిరుస్తోంది. సర్వం కోల్పోయిన వాళ్లకి మేమున్నామంటూ పరిసర ప్రాంతాల ప్రజలు భరోసానిస్తున్నారు. అహారాన్ని, నిత్యావసరాలు అందిస్తూ సహృదయాన్ని చాటుకుంటున్నారు. ప్రస్తుతానికి హస్తిన ప్రశాంతంగానే ఉంది. ఎప్పట్లాగే ఆటోలు, రిక్షాలూ తిరుగుతున్నాయి. రోడ్లపై చిన్నారులు క్రికెట్‌ ఆడుతున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి.