Drugs Case : డ్రగ్స్ కేసులో ఈడీ ముందుకు హీరో రవితేజ

టాలీవుడ్ డ్రగ్స్ కొనుగోళ్లు-మనీ లాండరింగ్‌ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళ ఈడీ విచారణకు హీరో రవితేజ హాజరుకానున్నారు. ఆయన డ్రైవర్ శ్రీనివాస్ కూడా విచారణకు హాజరవ్వనున్నారు.

Drugs Case : డ్రగ్స్ కేసులో ఈడీ ముందుకు హీరో రవితేజ

Raviteja

Ravi Teja ED trial : టాలీవుడ్ డ్రగ్స్ కొనుగోళ్లు- మనీ లాండరింగ్‌ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళ ఈడీ ఎదుట విచారణకు హీరో రవితేజ హాజరుకానున్నారు. రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ కూడా ఈడీ విచారణకు హాజరుకానున్నారు. టాలీవుడ్ డ్రగ్స్ గతంలోనే ఎక్సైజ్ సిట్‌ రవితేజను, ఆయన డ్రైవర్‌ను విచారించింది. ఎక్సైజ్ సిట్ విచారణతో పాటు కెల్విన్ ఇచ్చిన సమాచారంపైనా ఇవాళ రవితేజను ఈడీ అధికారులు విచారించే అవకాశముంది.

కెల్విన్‌కు రవితేజకు మధ్య సంబంధాలపై ప్రశ్నించనున్నారు. డ్రగ్స్ కొనుగోలుకు లావాదేవీలు జరిపారా? కెల్విన్‌కు ఎప్పుడైనా మనీ ట్రాన్స్‌ఫర్‌ చేశారా? ఎఫ్‌ క్లబ్‌తో ఏమైనా సంబంధం ఉందా? మీ డ్రైవర్‌ ఎప్పుడైనా డ్రగ్స్‌ కోనుగోలు డీల్ చేశారా?… అంటూ రవితేజను ప్రశ్నించే అవకాశం ఉంది. రవితేజ బ్యాంకు అకౌంట్లను పరిశీలించి..అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీసే అవకాశం ఉంది.

ఇప్పటివరకు పూరీ నుంచి రానా వరకు విచారించిన అధికారులు.. పలు కీలక వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. అయితే నందు, రానాను ప్రశ్నించిన సమయంలో డ్రగ్స్‌ సప్లయిర్‌ కెల్విన్‌ను కూడా పిలిపించి ఇంటరాగేషన్‌ చేసిన ఈడీ…ఇవాళ ఏం చేస్తుందనేది మరింత ఉత్కంఠగా మారింది.

టాలీవుడ్ డ్రగ్స్ కొనుగోళ్లు- మనీ లాండరింగ్‌ కేసులో హీరో రానాను దాదాపు 7 గంటలకు పైగా ఈడీ అధికారులు ప్రశ్నించారు. రానాతో పాటు డ్రగ్ పెడలర్ కెల్విన్‌ను కూడా ఈడీ అధికారులు విచారించారు. ముఖ్యంగా రానా-కెల్విన్ మధ్య సంబంధాలపై అధికారులు కూపీ లాగినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కొనుగోలు కోసం వీళ్లిద్దరి మధ్య ఏమైనా మనీ ట్రాన్సాక్షన్స్ జరిగాయా? అన్న విషయంపై ఆరా తీశారు. రానా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి 2015 నుంచి 2017 వరకు బ్యాంకు స్టేట్‌మెంట్స్‌ను అధికారులు సేకరించారు.

దుబాయ్‌లో జరిగిన ఓ ఈవెంట్‌పైన ఈడీ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందులో రానా, కెల్విన్ మధ్య నగదు లావాదేవీలపైనా ఆరా తీసింది. డ్రగ్స్ కొనుగోలు కోసం రానా ఎవరికైనా డబ్బు పంపించారా? అన్న కోణంలో ఈడీ విచారణ జరిపింది. అలాగే మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనపైనా రానాను ప్రశ్నించారు. ఎఫ్ క్లబ్ వ్యవహారాల్లో నవదీప్, రకుల్‌తో ఉన్న సంబంధాలపైనా రానా నుంచి వివరాలు సేకరించారు అధికారులు.

ఇప్పటివరకు ఈడీ విచారణకు టాలీవుడ్ నుంచి ఐదుగురు వ్యక్తులు హాజరవ్వగా.. పూరీ, ఛార్మి, రకుల్‌లను అధికారులు ఒంటరిగా విచారించారు. అయితే కెల్విన్ ఇచ్చిన సమాచారంలో నందు, రానా పేర్లు ఉన్నాయా? అందుకే వాళ్లను కెల్విన్‌తో కలిపే విచారించారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఇంకెంతమంది పేర్లు బయటికొస్తాయో చూడాలి మరి.