పరువు హత్య – ప్రియుడితో పారిపోయిన పెళ్లయిన కూతుర్ని హత్య చేసిన తండ్రి

పరువు హత్య – ప్రియుడితో పారిపోయిన పెళ్లయిన కూతుర్ని హత్య చేసిన తండ్రి

Honour killing in Rajasthan, father assassinated married daughter, who eloped with lover :
రాజస్ధాన్ లో దారుణం జరిగింది. ఇష్టం లేని పెళ్లి చేసారని ప్రేమించిన ప్రియుడితో పారిపోయిన యువతిని ఆమె తండ్రి హత్యచేసి పోలీసులకు లొంగిపోయాడు. పారిపోయిన ప్రేమికులిద్దరూ హైకోర్టును ఆశ్రయించి, పోలీసు రక్షణ పొందినా ఆమె తండ్రి కూతుర్ని హత్య చేయటం రాజస్ధాన్ లో కలకలం రేపింది.

రాజస్ధాన్ లోని దౌసా జిల్లాకు చెందిన శంకర్ లాల్ సైనీ అనే వ్యక్తి కి పింకీ(18)అనే కుమార్తె ఉంది. ఆమె స్ధానికంగా ఉన్న రోషన్ మహావర్(24) అనే యువకుడ్ని ప్రేమించింది. ఈ సంగతి ఇంట్లో వాళ్లకు తెలియటంతో వారు ఆమె ప్రేమను తిరస్కరించి…. ఫిబ్రవరి 16న వేరొక వ్యక్తితో వివాహం జరిపించారు. ఇష్టంలేని పెళ్లి చేశారంటూ మూడు రోజులపాటు భర్తతో ముభావంగా ఉన్న పింకీ, ఫిబ్రవరి 21న తన ప్రియుడు రోషన్ మహావర్ తో పారిపోయింది.

తమ కుమార్తె కనపించటంలేదని శంకర్ లాల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పారిపోయిన ప్రేమజంట తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఫిబ్రవరి 26న రాజస్ధాన్ హైకోర్టును ఆశ్రయించారు. వారు ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉంచి వారికి స్ధానిక పోలీసులతో రక్షణ కల్పించాలని హై కోర్టు పోలీసులను ఆదేశించింది.

వారిద్దరూ జైపూర్ లో ఉంటామని హై కోర్టుకు విన్నవించగా వారికి రక్షణ ఇచ్చినట్లు జైపూర్ ఎస్పీ కుమార్ తెలిపారు. కాగా వారివద్ద ఉన్న డబ్బులు అయిపోవటంతో మార్చి 1న దౌసాలోని రోషన్ ఇంటికి వెళ్లారు. కూతురు ఊళ్లోకి వచ్చిందని తెలుసుకున్న శంకర్ లాల్ సైనీ బుధవారం, మార్చి 3న తేదీన తన బంధువులతో వచ్చి కూతురు పింకీని తన ఇంటికి బలవంతంగా తీసుకువెళ్లాడు.

పింకీని ఇంటికి తీసుకు వచ్చిన తర్వాత ఇంట్లో ఘర్షణ జరిగింది. ఆ కోపంలో శంకర్ లాల్ తన కుమార్తెను గొంతు పిసికి హత్యచేశాడు. అనంతరం అతను స్దానిక పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నపోలీసులు శంకర్ లాల్ ఇంటికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శంకర్ లాల్ అతని బంధువులపై పోలీసులు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. కాగా ఈ కేసులో… పోలీసులు ప్రేమికులకు రక్షణ కల్పించలేకపోవటం….. శంకర్ లాల్ తన కుమార్తెను ఇంటికి తీసుకు వెళ్లటం పట్ల పలు విమర్శలు ఎదుర్కోంటున్నారు.