మంటగలుస్తున్న మానవత్వం : భార్యను, పండంటి బాబును చంపేశాడు

  • Published By: madhu ,Published On : February 11, 2019 / 01:37 AM IST
మంటగలుస్తున్న మానవత్వం : భార్యను, పండంటి బాబును చంపేశాడు

మేడ్చల్ : జిల్లా ఘట్‌కేసర్‌లో దారుణం జరిగింది. ప్రేమ పెళ్లికి ప్రతిరూపంగా పుట్టిన పండంటి బాబుతోపాటు భార్యను కడతేర్చాడో కసాయి. కర్రతో కట్టిచంపి ఆపై పెట్రోల్‌పోసి తగులబెట్టాడు.  అనంతరం  పాలకుర్తిలో పోలీసుల దగ్గర లొంగిపోయాడు. మంటగలుస్తున్న మానవ సంబంధాలను ఈఘటన తెలియజేస్తోంది. మనుషుల్లో మానవత్వం మంట గలుస్తోంది. మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. చిన్నచిన్న మనస్పర్ధలకే మనుషులను చంపేసే రాక్షస సంస్కృతి రాజ్యమేలుతోంది. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లో జరిగిన తల్లీ , కొడుకు మర్డర్‌ దీన్నే తెలియజేస్తోంది..

ప్రేమించి పెళ్లి చేసుకున్న రమేష్‌, సుశ్రిత
ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస
వీరి ప్రేమకు ప్రతిరూపంగా నాలుగు నెలల బాబు

వరంగల్‌ జిల్లా పాలకుర్తి మండలం గూడూరుకి చెందిన మచ్చల రమేష్‌.. జనగామ జిల్లా బొల్లికుంటకు చెందిన సుశ్రిత ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో 2015లో పెళ్లి చేసుకున్నారు. జీవనోపాధి కోసం హైదరాబాద్‌ నగరానికి వలస వచ్చారు. వీరికి నాలుగు నెలల బాబు ఉన్నాడు.  కొంతకాలంగా రమేష్‌, సుశ్రిత మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో సుశ్రిత తన తల్లిదండ్రుల దగ్గరే ఉంటోంది. 

ఫిబ్రవరి 10వ తేదీ ఆదివారం సాయంత్రం మాట్లాడుదామని రమేష్‌… తన భార్య సుశ్రితను ఉప్పల్‌కు రప్పించాడు. ఆమె తన వెంట నాలుగు నెలల బాబును కూడా తీసుకొచ్చింది. ఇద్దరినీ బైక్‌పై ఘట్‌కేసర్‌ రింగ్‌రోడ్‌ దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. దీంతో మనస్తాపం చెందిన సుశ్రిత తన వెంట తెచ్చుకున్న నిద్రమాత్రలు మిగినట్టు సమాచారం. ఓ మాత్రను పాలలో కలిపి బాబుకు తాగించినట్టు తెలుస్తోంది.

తల్లి, కొడుకు నిద్రలోకి జారుకుంటున్న సమయంలో వారిని ఘట్‌కేసర్‌ ఠాణా పరిధిలోని ప్రభాకర్‌ ఎన్‌క్లేవ్‌ దగ్గరికి రమేష్‌ రాత్రి 9 గంటల సమయంలో తీసుకొచ్చాడు. నిర్మానుష్య ప్రదేశంలో ఇద్దరినీ కిందపడేసి కర్రలతో కొట్టి చంపాడు. అనంతరం పెట్రోల్‌పోసి తగలబెట్టాడు.  ఆ తర్వాత పాలకుర్తి వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. జరిగిందంతా పోలీసులకు వివరించాడు. దీంతో ఘట్‌కేసర్‌ పోలీసులకు పాలకుర్తి పోలీసులు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. పాక్షికంగా కాలిపోయిన తల్లి, బిడ్డ మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.   విషయం తెలుసుకున్న బాధితురాలి బంధువులు ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆందోళన చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు.