luxury Car Thief : దమ్ముంటే పట్టుకోండి…పోలీసులకే సవాల్ విసురుతున్న గజదొంగ సత్తెన్న

ఖరీదైన కార్లు దొంగతనం చేస్తూ... కొన్నాళ్లుగా తప్పించుకు తిరుగుతున్న గజదొంగ సత్యేంద్ర సింగ్ షెకావత్ ను పట్టుకోవటంలో పోలీసులు చేతులెత్తేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

luxury Car Thief : దమ్ముంటే పట్టుకోండి…పోలీసులకే సవాల్ విసురుతున్న గజదొంగ సత్తెన్న

Luxury Car Thief

luxury Car Thief : పాతకాలం నాటి తెలుగు సినిమాల్లో హీరోలాగా పోలీసులకే సవాల్ విసురుతూ, ఖరీదైన కార్లు దొంగతనం చేస్తూ… కొన్నాళ్లుగా తప్పించుకు తిరుగుతున్న గజదొంగ సత్యేంద్ర సింగ్ షెకావత్ ను పట్టుకోవటంలో పోలీసులు చేతులెత్తేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

హైదరాబాద్, బంజారా హిల్స్ రోడ్‌ నెం. 2లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో గత జనవరి 26న రాత్రి కన్నడ నిర్మాత వి.మంజునాథకు చెందిన ఫార్చునర్‌ కారు (కేఏ 04 ఎంఎక్స్‌ 1000)ను దొంగిలించి పరారైన ఈ దొంగను పట్టుకోటానికి పోలీసులు ప్రయత్నిస్తుండగానే మళ్లీ గత మే నెలలో నాచారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో, ఆగస్టు 5వ తేదీన బౌరంపేటలో రెండు కార్లను అపహరించి పోలీసులకు సవాల్ విసిరాడు.

జనవరి 26న పార్క్ హయత్ హోటల్ లో కారు చోరీ కేసు విచారణ చేపట్టిన పోలీసులు..దొంగతనం చేసింది ఇంటర్ స్టేట్ కార్ల దొంగ సత్యంద్ర సింగ్ షెకావత్‌గా గుర్తించారు. గతంలో ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌ పోలీసులు ఇతడ్ని అరెస్ట్‌ చేయగా, బెయిల్‌పై విడుదలైనట్లు తెలుసుకున్నారు. ప్రస్తుతం షెకావత్‌ కన్ను హైదరాబాద్‌పై పడింది.

పార్క్ హయత్ కారు చోరీ సత్యేంద్రషెకావత్ చేశాడని నిర్ధారించుకుని అతడ్ని పట్టుకోటానికి ఒక ప్రత్యేక బృందం రాజస్ధాన్‌కు వెళ్లింది. “నేను ఇక్కడే ఉన్నాను. నన్ను పట్టుకునే దమ్ముందా…పట్టుకోండి చూద్దాం” అని పోలీసులకు ఇంటర్నెట్ వాట్సప్ కాల్ చేసి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. పోలీసులు వారం రోజుల పాటు అక్కడే ఉండి సత్యేంద్ర సింగ్ ను పట్టుకోవాలనుకున్నా వాళ్ల వల్ల కాలేదు.

షెకావత్ తండ్రిని, భార్యను ప్రశ్నించి వెనక్కి తిరిగి వచ్చారు. ఆసమయంలో.. నన్ను పట్టుకోవటం మీ వల్ల కాదు… మీరు వాడుతున్న టెక్నాలజీ చాలా పాతది… అప్ డేట్ అవ్వండని సలహాకూడా ఇచ్చాడు షెకావత్. దీంతో ఊసురోమంటూ హైదరాబాద్ పోలీసులు వెనక్కి వచ్చారు. అయినా పోలీసులు నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగానే హైదరాబాద్ లోనే మరో రెండు చోట్ల కార్లు చోరీ చేసి పోలీసులు ఉలిక్కి పడేలా చేశాడు.

నాచారం పరిధిలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు చెందిన ఇసుజు వాహనాన్ని చోరీ చేసిన షెకావత్‌ కోసం నాచారం పోలీసులు ఇటీవల మరోసారి జైపూర్‌ వెళ్లారు. భర్తకు సహకరిస్తున్న షెకావత్‌ భార్యను అరెస్ట్‌ చేసి హైదరాబాద్ తీసుకు వచ్చేందుకు ప్రయత్నించగా వారి ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. స్థానిక కోర్టు ఆమెకు బెయిల్‌ మంజూరు చేయడంతో వారి ప్రయత్నాలకు బ్రేక్‌ పడింది.

ఆగస్టు 5న దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బౌరంపేటలో ఓ గేటెడ్‌ కమ్యూనిటీలో నివాసం ఉంటున్న గ్లాండ్‌ ఫార్మా సంస్థకు చెందిన డీజీఎం రవీంద్రవర్మ కారును కూడా టెక్నాలజీ సహాయంతో షెకావత్‌ దొంగతనం చేశాడు. ఈ కేసులో కూడా సైబరాబాద్‌ పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయినా కానీ పట్టుకోలేక పోయారు.

ఓవరాల్‌గా చూస్తే దేశవ్యాప్తంగా పలునగరాల్లో ఇప్పటి వరకు షెకావత్ 100 కార్లు దొంగతనం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. కార్లను దొంగతన చేసి దర్జాగా నడుపుకుంటూ వెళ్లి గుర్తు తెలియని ప్రాంతంలో కొన్నాళ్లు ఉంచి ఆ తర్వాత వాటిని.. డ్రగ్ స్మగ్లర్లకు, ఉమెన్ ట్రాఫికింగ్ కోసం పనిచేస్తున్న వారికి విక్రయిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కేసులున్న షెకావత్ ఏ రాష్ట్ర పోలీసులకు చిక్కుతాడో వేచి చూడాలి.