మరీ టూ మచ్ : క్రికెట్ ఆడుతున్న ముస్లిం యువకులపై దాడి  

  • Published By: chvmurthy ,Published On : March 23, 2019 / 06:41 AM IST
మరీ టూ మచ్ : క్రికెట్ ఆడుతున్న ముస్లిం యువకులపై దాడి  

హర్యానాలోని గురుగ్రామ్ లో దారుణం జరిగింది. వీధిలో క్రికెట్ ఆడిన పాపానికి ఒక ముస్లిం కుటుంబంపై అల్లరి మూకలు దాడిచేసి.. విచక్షణరహితంగా కొట్టాయి. గురుగ్రామ్ లోని  భోండ్సిలో ఉన్న భూప్ సింగ్ నగర్ లో ఈ ఘటన జరిగింది. 35, 40 మంది ఉన్న అల్లరి మూక.. ఇనుప రాడ్లు, హాకీ బ్యాట్లతో విరుచుకుపడింది. కొట్టొద్దని బాధిత కుటుంబంలోని మహిళ వేడుకున్నా వినలేదు. గాయపడి వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 10 మంది వరకు ఉన్న గుంపు.. దాడి చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. మిగిలిన వారు ఇంటి కింద నిలబడి హంగామా చేశారు. 2019, మార్చి 21వ తేదీ గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.

వీధిలో క్రికెట్ ఆడుకునే విషయమై వివాదం మొదలైందని బాధిత కుటుంబం చెబుతోంది. ముస్లిం కుటుంబానికి చెందిన పిల్లలు గతంలో వీధిలో క్రికెట్ ఆడుకుంటుండగా కొందరు యువకులు అడ్డుకున్నారని చెబుతున్నారు. అయితే హోలీ రోజు, గురువారం సాయంత్రం ముస్లిం కుటుంబంలోని కొందరు పిల్లలు  క్రికెట్ ఆడటానికి వీధిలోకి రావటంతో.. ఆగ్రహించిన 40 మంది యువకులు దాడి చేసినట్లు పోలీసులకు కంప్లయింట్ చేశాయి బాధిత కుటుంబాలు. 

దాడి చేయటమేకాక ముస్లిం కుటుంబాన్ని పాకిస్తాన్ వెళ్లిపొమ్మని కూడా బెదిరించారు. బాధితులు భోండ్సి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు ఫైల్ చేసిన పోలీసులు.. ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా ఈ ఘటన కలకలం రేపుతోంది. రాజకీయ దుమారం అయ్యింది. సోషల్ మీడియాలోని వీడియో ఆధారంగా.. నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నట్లు ఏసీపీ షంషేర్ సింగ్ ప్రకటించారు.