Bike Theft : పోలీసు స్టేషన్ ముందే కానిస్టేబుల్ బైక్ కొట్టేసిన దొంగ
పోలీసు స్టేషన్ ముందు పార్క్ చేసిన కానిస్టేబుల్ బైక్ ను ఒక దొంగ రెండు నిమిషాల వ్యవధిలో చోరీ చేసి పారిపోయిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది.

ibrahimpatnam bike theft
Bike Theft : పోలీసు స్టేషన్ ముందు పార్క్ చేసిన కానిస్టేబుల్ బైక్ ను ఒక దొంగ రెండు నిమిషాల వ్యవధిలో చోరీ చేసి పారిపోయిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది.
విజయవాడ పోలీసు కమీషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వెంకటేష్ సోమవారం మధ్యాహ్నం స్టేషన్‌కు వచ్చి బండి బయట పార్క్ చేసి లోపలకు వెళ్లాడు. ఆ సమయంలో అటుగా కుంటు కుంటూ వచ్చిన ఒక వ్యక్తి బైక్‌ను మారు తాళం చెవితో తీసి వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు.
కొద్ది నిమిషాల్లో బయటకు వచ్చిన కానిస్టేబుల్ వెంకటేష్ తన బైక్ కనిపించకపోయే సరికి వెంటనే సీసీ టీవీల్లో తనిఖీ చేసాడు. తాను స్టాండ్ వేసిన కొద్ది సేపటికే మాసిన బట్టలతో కుంటు కుంటూ వచ్చిన ఒక వ్యక్తి ఆ బైక్ చోరీ చేసినట్లు గుర్తించారు. ఇబ్రహీంపట్నం నుంచి ఆ వ్యక్తి బైక్ పై గుంటూరు వైపు వెళుతున్నట్లు గుర్తించారు.
వెంటనే అలర్టైన వెంకటేష్ తన సహచర ఉద్యోగిని వెంటపెట్టుకుని దొంగను పట్టుకోటానికి బయలు దేరారు. బైక్ పై బయలు దేరిన వెంకటేష్ గుంటూరు అర్బన్ పోలీసులను అలర్ట్ చేశాడు. వెంటనే వారు మంగళగిరి జాతీయ రహదారిపై పెదకాకాని సమీపంలోకి వచ్చిన దొంగను బైక్ తో సహా పట్టుకున్నారు.
నిందితుడిని పాత నేరస్ధుడు… కంచికచర్ల అరుంధతీ నగర్ కు చెందిన నండ్రు మాణిక్యాల రావుగా గుర్తించారు.కొద్దిగా ఆలస్యం అయితే ఆ బైక్ విడి భాగాలు గుంటూరులోని పాత సామాన్ల మార్కెట్ లో విక్రయించే వాడే.