Bhavya Sri: సంచలనం రేపిన ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. అసలేం జరిగింది?

ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ అనుమానాస్పద మృతిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భవ్యశ్రీకి న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో #JusticeForBhavyaSri హాష్ టాగ్ తో నెటిజనులు డిమాండ్ చేస్తున్నారు.

Bhavya Sri: సంచలనం రేపిన ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. అసలేం జరిగింది?

Justice For Bhavya Sri

Justice For Bhavya Sri: చిత్తూరు జిల్లాలో ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ అనుమానాస్పద మృతి సంచలనం రేపింది. ఆమెను చిత్రహింసలకు గురిచేసి దారుణంగా హత్య చేశారని భవ్యశ్రీ తల్లిదండ్రులు ఆరోపిస్తుండగా.. అలాంటి ఆధారాలేవి లభించలేదని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు భవ్యశ్రీకి న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో #JusticeForBhavyaSri హాష్ టాగ్ తో నెటిజనులు డిమాండ్ చేస్తున్నారు.

అసలేం జరిగింది?
చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం ఠాణా వేణుగోపాలపురం గ్రామానికి చెందిన భవ్యశ్రీ(16) ఈ నెల 17 నుంచి కనిపించకుండా పోయింది. తర్వాతి రోజు ఆమె తండ్రి మునికృష్ణ.. పెనుమూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 20న తేదీన వేణుగోపాలపురం సమీపంలోని ఎగువ చెరువు వద్ద బావిలో భవ్యశ్రీ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె జట్టు పూర్తిగా ఊడిపోయి, కళ్లు బయటకు రావవడంతో హత్య చేసివుంటారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముగ్గురు యువకులు ప్రేమ పేరుతో కొంత కాలంగా తమ కూతురిని వేధిస్తున్నారని, వారే ఈ ఘాతుకానికి పాల్పడివుంటారని భవ్యశ్రీ తల్లిదండ్రులు ఆరోపించారు. తమ ఫిర్యాదుపై పోలీసులు సకాలంలో స్పందించలేదని, దర్యాప్తు సరిగా చేయడం లేదని వాపోయారు.

పోలీసులు ఏమన్నారంటే..?
భవ్యశ్రీ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని స్థానిక ఏఎస్పీ శ్రీలక్ష్మి తెలిపారు. మిస్సింగ్ కేసును అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి విచారణ జరుపుతున్నామన్నారు. ”21వ తేదీన పోస్టుమార్టం పూర్తయింది. మృతురాలి శరీరం నుంచి వివిధ నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు తదుపరి పరీక్షల కోసం పంపించాం. బాలిక మృతి పై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవం. గుండు చేసి చంపారన్నది నిరాధార ఆరోపణ. మూడు రోజులకు మించి మృతదేహం నీళ్లలో ఉంటే వెంట్రుకలు ఊడిపోతాయి. వైద్యులు కూడా ఇదే ధ్రువీకరించారు. బావిలోనే నిన్న బాలిక జుట్టును సేకరించాము. ఫోరెన్సిక్ నివేదిక రాగానే బాలిక మృతికి కారణాలు తెలిసే అవకాశం ఉంది. అనుమానితులను విచారించాం. ఈ కేసు విషయంలో మాపై ఎలాంటి రాజకీయ ఒత్తిడిలు లేవ”ని చెప్పారు.

Also Read: సుప్రీంకోర్టులో సైగలతోనే మహిళా న్యాయవాది వాదనలు

కాగా, అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారి ఫోన్లలో కాల్ డేటాను కూడా చెక్ చేశారు. బాలిక ఒంటి గాయాలు లేవని పోస్టుమార్టంలో ప్రాథమికంగా నిర్ధారణ అయిందని పెనుమూరు ఎస్ఐ అనిల్ కుమార్ వెల్లడించారు. భవ్యశ్రీ మరణానికి గల కారణాలను తెలుసుకునేందుకు మృతదేహం నుంచి నామూనాలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపించామని తెలిపారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.