Telangana : భువనగిరి ఆస్పత్రిలో దారుణం .. మృతదేహాన్ని కొరికి తినేసిన ఎలుకలు
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మృతదేహాన్ని ఎలుకలు కొరికి తినేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

Rats bit man dead body
Rats bit man dead body : ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్లక్ష్యం గురించి పదే పదే కనిపిస్తోంది. జీవించిన మనుషుల విషయంలోనే కాదు చనిపోయిన తరువాత మృతదేహాలను భద్రపరిచే విషయంలో కూడా తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది.యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మృతదేహాన్ని ఎలుకలు కొరికి తినేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన 38 ఏళ్ల పెరికల రవికుమార్ కుటుంబం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భువనగిరికి వలస వచ్చింది. రవికుమార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతనికి మద్యం తాగే అలవాటుంది. దీంతో రవికుమార్ మద్యం తాగి రావటం సర్వసాధారనంగా మారిపోయింది. అలా మద్యానికి బానిసగా మారిన రవి కుమార్ కుటుంబంతో గొడవలు పడుతుండేవాడు. దీంట్లో భాగంగానే గత ఆదివారం అదేమాదిరిగా ఇంట్లో గొడవలయ్యాయి. దీంతో అతని తల్లిదండ్రులు రవికుమార్ పిల్లలను తీసుకుని సమీపంలో ఉంటున్న వారి బంధువుల ఇంటికెళ్లారు. తిరిగి వారు రాత్రి ఇంటికి వచ్చేసరికి రవికుమార్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి రవి కుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అనంతరం మార్చురీ గదిలోని ఫ్రీజర్లో కాకుండా బయటే ఉంచారు. ఆస్పత్రిలో ఎలుకలు ఎక్కువగా ఉండటంతో రవికుమార్ మృతదేహాన్ని కొరికి చాలా భాగం తినేశాయి. ఈ క్రమంలో రవికుమార్ మృతదేహం కోసం వచ్చిన కుటుంబసభ్యులు షాక్ అయ్యారు. ఓ పక్క బాధ మరోపక్క మృతదేహం ముఖంలో కొన్ని భాగాలను ఎలుకలు తినేసినట్లుగా కనిపించటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటూ మండిపడ్డారు. కానీ ఎలుకలు కొరికినట్టు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదని ఆస్పత్రి వర్గాలు అంటున్నాయి.