Ruby E-Bike Showroom Fire Accident : సికింద్రాబాద్ రూబీ ఈ-బైక్ షోరూమ్ అగ్నిప్రమాదం.. రంగంలోకి కేంద్రం, విచారణకు ఆదేశం

సికింద్రాబాద్ లోని రూబీ హోటల్ లో విద్యుత్ బైక్ ల ప్రమాద ఘటనపై కేంద్రం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి వాస్తవాలు తెలుసుకునేందుకు కేంద్ర రవాణశాఖ ఇద్దరు అధికారులతో కమిటీని నియమించింది.

Ruby E-Bike Showroom Fire Accident : సికింద్రాబాద్ రూబీ ఈ-బైక్ షోరూమ్ అగ్నిప్రమాదం.. రంగంలోకి కేంద్రం, విచారణకు ఆదేశం

Ruby E-Bike Showroom Fire Accident : సికింద్రాబాద్ లోని రూబీ హోటల్ లో విద్యుత్ బైక్ ల ప్రమాద ఘటనపై కేంద్రం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి వాస్తవాలు తెలుసుకునేందుకు కేంద్ర రవాణశాఖ ఇద్దరు అధికారులతో కమిటీని నియమించింది. ఆ ఇద్దరు అధికారులు ఈ బైక్ ల పేలుళ్లపై విచారణ చేయనున్నారు. రూబీ ఈ-బైక్ షో రూమ్ ని వారు సందర్శించనున్నారు. బ్యాటరీలు ఎందుకు పేలాయి? సరైన జాగ్రత్తలు తీసుకోలేదా? అన్న కోణంలో విచారణ చేపట్టనున్నారు.

రూబీ లాడ్జిలో అగ్నిప్రమాదానికి ఈ-బైక్ బ్యాటరీ పేలుడే ప్రధాన కారణం అని తేలిపోయింది. ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ.. బాంబు కంటే ఎంత ప్రమాదకరమో బిల్డింగ్ సెల్లార్ లోని సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు చెబుతున్నాయి. ఈ నెల 12న(సోమవారం) రాత్రి 9గంటల 16 నిమిషాల వరకు ప్రశాంతంగా ఉన్న రూబీ లాడ్జి భనవం.. 9గంటల 18 నిమిషాలకు హాహాకారాలతో దద్దరిల్లింది.

రాత్రి 9గంటల 17 నిమిషాలకు సెల్లార్ లో స్టోర్ చేసిన ఎలక్ట్రిక్ బైక్ నుంచి పొగలు మొదలయ్యాయి. క్షణాల్లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మంటలు పక్కనే ఉన్న బైక్ లకు, జనరేటర్ కు అంటుకుని మొదటి అంతస్తుకు వ్యాపించాయి. ఆ తర్వాత సెకన్ల వ్యవధిలో భవనం అంతా మంటలు అంటుకున్నాయి. 15 సెకన్ల వ్యవధిలోనే 5 అంతస్తుల భవనం అంతా పొగతో నిండిపోయింది. లాడ్జిలోని ఫస్ట్, సెకండ్ ఫ్లోర్ లో ఉంటున్న వారిలో ఊపిరాడక 8మంది చనిపోయారు.

ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఈ-బైక్ బ్యాటరీలు పేలిన ఘటనపై కేంద్ర రవాణశాఖ అప్రమత్తం అయ్యింది. ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాలు వరుస అగ్ని ప్రమాదాలకు గురవుతుండటంతో బ్యాటరీ భద్రత ప్రమాణాలను కేంద్రం మార్చింది. రోడ్డు రవాణ మంత్రిత్వ శాఖ అదనపు భద్రత నిబంధనలను జోడించింది. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

సికింద్రాబాద్ లోని రూబీ లాడ్జి అగ్నిప్రమాద ఘటనలో 8మంది మరణించారు. దీంతో అప్రమత్తమైన కేంద్రం.. మరోసారి లిథియం బ్యాటరీలు, ఈ-బైక్ ల తయారీ విధానం, అగ్నికి దారితీసే అంతర్గత సెల్ఫ్ షార్ట్ సర్క్యూట్ పై దృష్టి సారించింది. లోపభూయిష్టంగా ఉన్న విద్యుత్ వాహనాలను రీకాల్ చేయాలని ఇప్పటికే ఈ-బైక్ తయారీ కంపెనీలను ఆదేశించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.

కాగా, ఇంధనం అవసరం లేని, కాలుష్యం అసలే లేని ఎలక్ట్రిక్ వాహనాలను విరివిగా వినియోగంలోకి తేవాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం కార్యాచరణ కూడా సిద్ధం చేస్తోంది. ఇంతలో.. ఈ-బైక్స్ లో చోటు చేసుకుంటున్న వరుస ప్రమాదాలు ఆలోచనలో పడేశాయి. బాంబుల్లా పేలుతున్న ఈ-బైక్ లు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ బైక్ అంటేనే బాబోయ్ అనే పరిస్థితి వచ్చింది.