Dead Body In Water Tank : మిస్టరీగా మారిన వాటర్ ట్యాంక్ మృతదేహం-ఆందోళనలో బస్తీ వాసులు

సికింద్రాబాద్ ముషీరాబాద్ లోని రిసాలగడ్డ వాటర్ ట్యాంక్ లో మంగళవారం బయటపడ్డ  మృతదేహం ఎవరిది అన్న చిక్కుముడి ఇంకా వీడలేదు.

Dead Body In Water Tank : మిస్టరీగా మారిన వాటర్ ట్యాంక్ మృతదేహం-ఆందోళనలో బస్తీ వాసులు

Water Tank Dead Body

Dead Body In Water Tank : సికింద్రాబాద్ ముషీరాబాద్ లోని రిసాలగడ్డ వాటర్ ట్యాంక్ లో మంగళవారం బయటపడ్డ  మృతదేహం ఎవరిది అన్న చిక్కుముడి ఇంకా వీడలేదు. వాటర్‌ ట్యాంక్‌లో శవం దొరకటంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. దాదాపు కుళ్లిపోయిన స్ధితిలో ఉన్నశవం వాటర్‌ ట్యాంక్‌లో  ఐదు రోజుల క్రితం  నుంచి ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు. దీంతో ఈ వాటర్‌ ట్యాంక్ నుంచి వచ్చిన మంచినీరు తాగిన వారంతా ఆందోళనలో పడ్డారు. మరోవైపు పోలీసులు తమ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మృతదేహం ఎవరిది? ఎవరైనా హత్య చేసి వాటర్ ట్యాంక్ లో పడేశారా?  లేక ప్రమాదవశాత్తూ వాటర్ ట్యాంక్‌లో పడి వ్యక్తి మృతి చెందాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 50 అడుగుల ఎత్తున ఉన్న వాటర్ ట్యాంక్ కి రెండు గేట్లు ఉన్నాయి. మృతుడితో పాటు మరో వ్యక్తి కూడా అక్కడకు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  వాటర్ ట్యాంక్ వద్ద లభించిన ఓ జత చెప్పుల వల్ల  ఈఅనుమానం కలుగుతోంది.

కాగా…. వాటర్ ట్యాంక్ పై వున్న రెండు మూతలు వేసినవి వేసినట్లే ఉన్నాయి. అందులో మృతదేహాన్ని చూస్తే ఎవరైనా హత్య చేసి నీటిలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.  ఇక్కడ సరైన నిర్వహణ   లేకపోవటంతో ఇది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా  మారిందని స్ధానికులు చెపుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం వాటర్ ట్యాంక్ శుభ్రం చేయటానికి పైకి వెళ్లిన కార్మికులు మూత తీసే సరికి వారికి మృతదేహం కనపడింది.
Also Read : Tiruchanur Brahmotsavam 2021 : శ్రీ‌వారి ఆల‌యం నుండి శ్రీ పద్మావతి అమ్మవారికి సారె
గత ఐదురోజులుగా ఆ నీళ్ళు తాగిన స్ధానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే   కరోనా వైరస్ బాధతో వణికిపోతున్న ప్రజలకు ఇదొక కొత్త సమస్య వచ్చి పడింది.  తమ ఆరోగ్యంలో ఏమైనా తేడాలు జరుగుతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈ వాటర్ ట్యాంక్ చాలా పురాతనమైనది. ఈ వాటర్ ట్యాంక్ ను 1985-90 మధ్య కాలంలో నిర్నించారు. నాలుగు బస్తీల ప్రజలకు ఇక్కడి నుంచి మంచినీరు అందిస్తారు. పోలీసులు వాటర్ ట్యాంక్ సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషిస్తున్నారు.

నిన్నటి నుంచి ప్రజలు ఆందోళనలో ఉండి… పోలీసులు విచారణ జరుపుతున్నప్పటికీ స్ధానిక జలమండలి అధికారులు నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిసాలగడ్డ వాటర్ ట్యాంక్ నుంచి మంచినీరు సరఫరా అయ్యే ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని స్ధానికులు కోరుతున్నారు.