మీ మనవళ్లు తెలుగులోనే మాట్లాడతారా?

  • Published By: chvmurthy ,Published On : February 21, 2020 / 12:27 PM IST
మీ మనవళ్లు తెలుగులోనే మాట్లాడతారా?

ఫిబ్రవరి 21ని  UNESCO అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవంగా ప్రకటించింది. ఈరోజు ప్రభుత్వమూ, ప్రజలూ అందరూ మాతృభాషగురించి తెగమాట్లాడేసుకొంటారు. యునెస్కో లెక్కల ప్రకారం ప్రతి రెండువారాలకు ఓ భాష అంతరించిపోతుందంటే భయపడాల్సిందే. భాష అన్నది మన వారసత్వం కదా! అంతెందుకు భారతదేశం ఒకప్పుడు ఎక్కువ మాట్లాడే భాషలున్న దేశం. ఈ లెక్కలోంచి చాలా భాషలు తెరమరుగైపోయ్యాయి.

మొత్తం మాట్లాడే 780 భాషల్లో కనీసం వందమందైనా మాట్లాడే భాషలు 500కన్నా తక్కువ. పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా 2010లో చేసిన సర్వే ప్రకారం మొత్తం 780 భాషల్లో 600 భాషలకు కష్టకాలం దాపురించింది. స్థానిక భాషలను వదిలేసి పొరుగు భాషల్లోనే మాట్లాడే ధోరణి పెరిగింది. అంతెందుకు పిల్లలూ మాతృభాషను నేర్చుకోవడంలేదు. ఇది ఒక్క ఇండియా పరిస్థితే కాదు. ప్రపంచవ్యాప్తంగా 4,000 అంతరించిపోయే దశలో ఉన్నాయి. అందులో మన వాటా పదిశాతం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశంలో 250 భాషలు వినిపించడంలేదు. వాటిని మనం కోల్పోయినట్లే.

మనది తప్ప పక్క భాషల్లో మాట్లాడేస్తున్నారు
వందలాది భాషలు అంతరించిపోయేలా ఉన్నాయన్న సంగతి ప్రభుత్వానికీ తెలుసు. 2014లో పార్లమెంట్ కు ఇచ్చిన సమాధానం ప్రకారం 42 భాషలు దాదాపు అంతరించిపోయేలా ఉన్నాయి. పెద్దవాళ్లు మాట్లాడతున్నారు తప్ప కొత్త తరం వాటిని నేర్చుకోవడంలేదు. ఒకసారి పాత తరం కనుక వెళ్లిపోతే ఆయా భాషలు గతించిపోయినట్లే. కొన్ని భాషలను మాట్లాడేవాళ్లే లేరు. అక్కడున్న వాళ్లు తమ మాతృభాషగా పరాయి భాషను ఎంచుకొంటున్నారు. కొన్నింటికి ఇంకో సమస్య. వాళ్లకు మాట్లాడటం వచ్చు. అదీ ఇంటిదగ్గరే పేరెంట్స్ తో మాట్లాడతారు. రాయడం, చదవడం రాదు. అరుణాచల్ ప్రదేశ్ సమస్య ఇదే. ఇక్కడున్న 29 భాషలను ఇంటిలోతప్ప బైట మాట్లాడరు. అక్కడున్న స్థానికతెగల్లో కొన్ని కుటుంబాలకే ఈ బాషలను పరిమితవుతున్నాయి.

లెక్కతీస్తే….!
భాష అంతరించిపోవడం ఏంటి? ఆయా జాతులు, స్థానిక తెగలు మాట్లాడుతుంటాయికదా? ఈ అనుమానం నిజమే. కాకపోతే కనీసం పదివేల మందైనా మాట్లాడని భాషలను 1971 సెన్సెస్ తర్వాత అఫిషియల్ లాంగ్వీజెస్ జాబితా నుంచి తొలగించారు. అందులో 22 భాషలను ఎనిమిదో షెడ్యూల్డ్ లో చేర్చారు. ఏ దేశానికి ఇన్ని అధికారిక భాషల్లేవు. 2021లో తర్వాత సెన్సెస్ ఉంది. ఎన్ని భాషలు అధికారిక భాషల జాబితాలో ఉంటాయో చూడాలి. 2001 నుంచి 2011 మధ్య అంటే రెండు సెన్సెస్ ల మధ్య అధికారిక భాషల జాబితాలోంచి ఒకటి ఎగిరిపోయింది. ప్రస్తుతం ఈ జాబితాలో 121 ఉన్నాయి.