17 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్

  • Published By: madhu ,Published On : May 15, 2019 / 02:21 AM IST
17 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్

పాలిటెక్నిక్ డిప్లామా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి సవరించిన పూర్తిస్థాయి షెడ్యూల్‌ను ప్రవేశాల కమిటీ విడుదల చేసింది. ఇప్పటికే కౌన్సెలింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నా కాలేజీలకు అనుబంధ గుర్తింపు జారీ పూర్తి కాలేదు. మే 17వ తేదీ నుంచి కౌన్సెలింగ్ నిర్వహించేలా షెడ్యూల్‌ను సవరించింది. ఈ మేరకు మే 14వ తేదీ మంగళవారం షెడ్యూల్‌ను జారీ చేసింది. మే 17న ఆన్ లైన్‌లో విద్యార్థుల సమాచారం నమోదు చేయడం, ఫీజు చెల్లింపును ప్రారంభిస్తామని పేర్కొంది. 

మే 17న వెరిఫికేషన్ చేయించుకున్న విద్యార్థులు మే 18 నుంచి మే 24 వరకు వెబ్ ఆఫ్షన్లు ఉంటాయని వెల్లడించింది. మే 24వ తేదీ రాత్రి వరకు ఆప్షన్లు ముగియనుంది. ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు ఈనెల 27వ తేదీన సీట్లను కేటాయించనున్నట్లు అధికారులు వెల్లడించారు. సీట్లు లభించిన స్టూడెంట్స్ మే 28 నుంచి మే 31 వరకు ఆన్ లైన్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించాలని సూచించారు.

జూన్ 01వ తేదీన రిపోర్టు చేయాలని, అదే రోజు నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించింది. సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యే విద్యార్థులు వెబ్ సెట్‌లో పేర్కొన్న సర్టిఫికేట్లను వెంట తీసుకెళ్లాలని అధికారులు సూచించారు. పాలిసెట్ ర్యాంకు కార్డు, ఆధార్ కార్డు, టెన్త్ మెమో, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్, ఆదాయం సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రాలు, నివాస ధృవీకరణ పత్రం వెంట తీసుకెళ్లాలని సూచించారు.