కరోనాకు మందులేదు.. అవసరమూ లేదు.. అదే తగ్గిపోతుంది : డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి

  • Published By: sreehari ,Published On : March 28, 2020 / 02:52 PM IST
కరోనాకు మందులేదు.. అవసరమూ లేదు.. అదే తగ్గిపోతుంది : డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి

ప్రస్తుతానికి కరోనా వైరస్‌కు ఎలాంటి మందు లేదు.. అవసరమూ లేదన్నారు. సీరియస్ ప్రాబ్లమ్ కాదన్నారు. గాంధీ ఆస్పత్రిలో 46 మంది కరోనా పాజిటివ్ పేషెంట్లు ఉన్నారు. అందరి ఆరోగ్యం బాగానే ఉంది.. ఎలాంటి సమస్యలు లేవు. అంత ఎక్కువ మేజర్ ప్రాబ్లమ్ లేదు.. భయాపడాల్సిన పనిలేదని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కరోనా వ్యాప్తిపై వివరణ ఇచ్చారు. మరో రెండు వారాలు ఇలానే సామాజిక దూరం పాటిస్తే.. చాలావరకు ఈ వైరస్ కర్వ్ అనేది ప్లాట్ అయిపోయి వైరస్ దానింతట అదే అంతమైపోతుందని చెప్పారు.

కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని అన్నారు. కరోనా వైరస్ ద్వారా వచ్చే వ్యాధికి సాధారణంగా ఎలాంటి మందులు అవసరం లేదని, కొంతమందిలో దీర్ఘకాలిక వ్యాధులు ఇదివరకే ఉండి.. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ వైరస్ ప్రభావం కాస్తా ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు. ICMR, WHO హైడ్రాక్సి క్లోరోక్విన్ తీసుకుంటే ప్రోటక్షన్ ఉండొచ్చునని రికమండ్ చేస్తున్నాయని, అది కచ్చితం కాదన్నారు.

దీనిపై అధ్యయనాలు కూడా జరుగబోతున్నాయన్నారు. జలుబు, దగ్గు ఉంటే మెడిసిన్స్ అవసరం లేదన్నారు. ఇవి అధికంగా ఉంటే యాంటిబయెటిక్స్  తీసుకుంటే ఉపశమనంగా ఉంటుందని చెప్పారు. వైరస్ సోకిన వారిలో ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటే మాత్రం వారు తప్పనిసరిగా వైద్యున్ని సంప్రదించాలని తెలిపారు. 2 శాతం మంది రిస్కీగా ఉంటుందని, 5 శాతం మంది ఇంటెన్సీవ్ కేర్ లో ఉండాల్సి వస్తుందని చెప్పారు.

యాంటీబయెటిక్స్, వెంటిలేటర్ ద్వారా వారికి చికిత్స అందించాల్సి వస్తుందని నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. నేరుగా వైరస్ చంపే మందు, వ్యాక్సీన్ అంటూ ఏది లేదన్నారు. దీనిపై చైనాతో సహా పలు దేశాల్లో ట్రయల్స్ జరుగుతున్నాయని చెప్పారు. ట్రయల్స్ కు సంబంధించి ఫలితాలు రావడానికి మరో రెండు నెలల సమయం పడుతుందని అన్నారు.