రష్యా నుంచి రెండో వ్యాక్సిన్ వస్తోంది.. రిజిస్టర్ ఎప్పుడంటే?

  • Published By: sreehari ,Published On : September 22, 2020 / 06:35 PM IST
రష్యా నుంచి రెండో వ్యాక్సిన్ వస్తోంది.. రిజిస్టర్ ఎప్పుడంటే?

కరోనా వైరస్ నిర్మూలనకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ కనిపెట్టే దిశగా ప్రయోగాలు కొనసాగుతున్నాయి.

ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిన రష్యా.. ఇప్పుడు రెండో వ్యాక్సిన్‌తో ముందుకు వస్తోంది.



సైబీరియాకు చెందిన వెక్టార్ ఇనిస్టిట్యూట్ రూపొందించిన EpiVacCorona వ్యాక్సిన్ అక్టోబర్ 15నాటికి రిజిస్టర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయని రష్యా మీడియా సంస్థ TASS వెల్లడించింది.

ఇప్పటికే ఈ వ్యాక్సిన్ తొలి దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి అయ్యాయి.

దీని ప్రయోగాల కోసం రష్యా ఆరోగ్యశాఖ నుంచి వెక్టార్ ఇనిస్టిట్యూట్ జూలై నెలలోనే అనుమతి పొందింది.

ఇప్పటికే రష్యాలోని గమలేయ ఇనిస్టిట్యూట్ (EpiVacCorona) రూపొందించిన స్పుత్నిక్-V వ్యాక్సిన్ ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.



ఈ వ్యాక్సిన్ కోసం 20దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటివరకు దాదాపు వంద కోట్ల డోసుల వినతులు వచ్చినట్లు వెల్లడించింది. ప్రస్తుతం తుది దశ ప్రయోగాల్లో ఉన్న స్పుత్నిక్-V వ్యాక్సిన్ దాదాపు 40వేల మందిపై ప్రయోగాలు చేస్తోంది.

ఇండియాలోనూ స్పుత్నిక్-V టెస్టింగ్ :
భారతదేశంలో స్పుత్నిక్ వ్యాక్సిన్ ట్రయల్స్, వ్యాక్సిన్ సరఫరా కోసం రష్యా సంస్థతో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

అయితే రష్యా రూపొందించిన స్పుత్నిక్-V వ్యాక్సిన్‌ను భారత్‌లోనూ ప్రయోగించే దిశగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.



మరికొన్ని వారాల్లోనే ఇండియాలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తామని డాక్టర్ రెడ్డీస్ సంస్థ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు.

తుదిదశ ప్రయోగాల్లో భాగంగా భారతదేశంలో వెయ్యి నుంచి 2వేల మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే అవకాశం ఉంది.