వైద్య రంగంలో సంచలనం: ఎయిడ్స్ రోగం నయం, ప్రపంచంలో రెండో వ్యక్తి

  • Published By: veegamteam ,Published On : March 6, 2019 / 02:59 AM IST
వైద్య రంగంలో సంచలనం: ఎయిడ్స్ రోగం నయం, ప్రపంచంలో రెండో వ్యక్తి

HIV.. ప్రాణాంతక వ్యాధి. మెడిసిన్ లేని భయంకరమైన జబ్బు. ఒకసారి సోకితే చనిపోయే వరకు నయం కాని రోగం. ఎయిడ్స్ సోకితే చావు తప్ప మరో మార్గం లేదు. ఇప్పటివరకు ఇదే తెలుసు.  కానీ లండన్‌లో మిరాకిల్ జరిగింది. వైద్య రంగంలో సంచలనం నమోదైంది. హెచ్‌ఐవీ ఎయిడ్స్ సోకిన వ్యక్తి.. ఆ వ్యాధి నుంచి విముక్తి పొందాడు. అతనికి వ్యాధి పూర్తిగా నయం కావడం  వైద్యరంగంలో సంచలనంగా మారింది. గతంలో ఒకే ఒక్క వ్యక్తి ఎయిడ్స్ నుంచి బతికి బయటపడ్డాడు. ఆ తర్వాత ఎయిడ్స్ వ్యాధి నుంచి విముక్తి పొందిన రెండో వ్యక్తి ఇతడే కావడం విశేషం.

లండన్‌కు చెందిన ఒక హెచ్‌ఐవీ రోగికి మూలకణ మార్పిడి చికిత్సను అందించడం వల్ల ఇప్పుడు అతనిలో ఆ వ్యాధి లక్షణాలేమీ లేవని భారత సంతతికి చెందిన పరిశోధకుడు రవీంద్రగుప్తా  నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం తెలిపింది. ప్రపంచంలో ఇలా హెచ్‌ఐవీ నుంచి విముక్తి పొందిన వారిలో ఈయన రెండో వ్యక్తి అని వారు తెలిపారు. డాక్టర్లు ఆ రోగి పేరును వెల్లడించ లేదు. ఈ  లండన్ రోగికి హెచ్‌ఐవీ సోకినట్టు 2003లో నిర్ధారణైంది అతనికి 2012లో హాడ్కిన్స్ లింఫోమా అనే బ్లడ్ క్యాన్సర్ సోకింది. వ్యాధి నివారణ చికిత్సలో భాగంగా జన్యు పోలికలు ఉన్న వ్యక్తి నుంచి  మూలకణాలను రోగికి మార్పిడి చేశారు. ఆ తర్వాత అతనికి 18 నెలలపాటు యాంటీ రెట్రో వైరల్ మందులు ఇవ్వటం ప్రారంభించామని ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా చెప్పారు.

సర్జీ జరిగిన మూడేళ్లకు వైద్య పరీక్షలు నిర్వహిస్తే అతనిలో హెచ్‌ఐవీ జాడ కనిపించలేదని తెలిపారు. ప్రస్తుతం ఉన్న చికిత్సా విధానంలో హెచ్‌ఐవీ వైరస్ శరీరంలో విస్తరించకుండా మందులు  ఇవ్వటమేనని, రోగులు వాటిని తమ జీవితాంతం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. వ్యాధి సోకిన వారందరికీ మూలకణ మార్పిడి చేయటం సాధ్యం కాదని, అది ఎంతో వ్యయ ప్రయాసలతో  కూడిదని అన్నారు. జన్యు పోలికలున్న వ్యక్తులు కూడా దొరకడం సాధారణమైన విషయం కాదని చెప్పారు.

ఇంతకుముందు అమెరికాకు చెందిన తిమోతీ రే బ్రౌన్ అనే వ్యక్తి 2007లో ఇలాగే మూలకణ మార్పిడి చికిత్స ద్వారా హెచ్‌ఐవీ నుంచి విముక్తి పొందారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో రే బ్రౌన్‌కు సర్జరీ చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు అతడి శరీరం నుంచి హెచ్‌వీవీ వైరస్ శాశ్వతంగా పోయింది. ఇప్పటి వరకు అలాంటి లక్షణాలేవీ కననబడలేదు. ఆ తర్వాత చాలా మందికి ఇలాంటి చికిత్స చేసినా వ్యాధి నయం కాలేదు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత లండన్‌కు చెందిన వ్యక్తి ఎయిడ్స్ నుంచి బయటపడ్డాడు. ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్య 37 మిలియన్లుగా ఉంది.