బయటపడుతున్న మెట్రో నిర్మాణ లోపాలు

  • Published By: veegamteam ,Published On : September 23, 2019 / 03:53 AM IST
బయటపడుతున్న మెట్రో నిర్మాణ లోపాలు

హైదరాబాద్ మెట్రో దేశానికి ఆదర్శం.. పూర్తి భద్రతా ప్రమాణాలతో తక్కువ వ్యవధిలో నిర్మించామని పలు సందర్భాల్లో నేతలు, మెట్రో అధికారులు ఘనంగా చెప్పుకొచ్చారు. దశాబ్ధాల పాటు ఢోకా లేకుండా ఉంటుందని, వందేళ్లు సేవలందిస్తుందని గొప్పగా చెప్పారు. కానీ అమీర్ పేటలో మహిళ మృతి చెందిన ఘటనతో నగరమంతా ఉలిక్కిపడింది. మెట్రో ఇన్నాళ్లూ సాంకేతిక లోపాలతో ఇబ్బంది పెట్టగా.. ఇప్పుడు నిర్మాణ లోపాలతో భయపెడుతోంది. పలు చోట్ల వయాడక్ట్ నుంచి సిమెంట్ పెచ్చులు ఊడిపతున్నాయి.

నిర్మాణ సమయంలో పర్యవేక్షణ కొరవడడంతో ఏ స్టేషన్ లో చూసినా బీటలు వారిన గోడలు దర్శనమిస్తున్నాయి. ప్రతి స్టేషన్ లోనూ సివిల్ పనుల్లో లోపాలు రోజులు గడిచేకొద్దీ బయటపడుతున్నాయి. వయాడక్ట్ పైన శబ్ద నియంత్రణకు దోహదపడేలా అటు ఇటు నిర్మించిన ప్రహరీ నుంచి కొన్ని వస్తువులు వేలాడుతూ కింద ఉన్నవారిని భయపెడుతున్నాయి. సెంట్రల్ మీడియన్ నిర్వహణ నాసిరకంగా ఉంది. సెంట్రల్ మీడియంలోని మొక్కలు చచ్చిపోయినా పట్టించుకోవడం లేదు.

మెట్రో స్టేషన్లలో గోడలకు బీటలు రాగా, మరుగుదొడ్ల మురుగు రోడ్లపైకి వస్తోంది. స్టేషన్ లోని మరుగుదొడ్ల నుంచి నీరు లీకేజీపై ఫిర్యాదులు ఉన్నాయి. ఇటీవల వినాయక చవితి నవరాత్రుల్లో ఖైరతాబాద్ స్టేషన్ దగ్గర ఎస్ బీఐ బ్యాంకు మార్గంలో వరద లీకై భక్తులపై పడింది. స్టేషన్ల కింద సుందరంగా తీర్చిదిద్దే పనుల కోసం ఇప్పటికే వేలాది రూపాయలు ఖర్చు చేశారు. చాలా స్టేషన్లలో ఆ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. అసెంబ్లీ, నాంపల్లి, గాంధీ భవన్, ఉస్మానియా ఆస్పత్రి స్టేషన్ పరికరాలు అస్తవ్యవస్తంగా ఉన్నాయి. పాదబాటలు వదిలేశారు. 

మెట్రో రైలులో సాంకేతిక లోపాలు ప్రయాణికులు చికాకు పెడుతున్నాయి. ఆదివారం గాంధీభవన్ దగ్గర మెట్ర్ రైలు సడన్ బ్రేకులతో ఎగిరికింద పడ్డారు. ప్రయాణికులు ఆందోళన చెందారు. ఇదే చివరి స్టేషన్ అంటూ ప్రకటన విన్పించిందని ప్రయాణికులు చెప్పారు. మెట్రో రైలు నిర్మాణంలో ఉండగా పలు ప్రమాదాలు జరిగాయి. రద్దీ మార్గాల్లో మెట్రో నిర్మాణం చేపట్టడంతో నిర్మాణ సామాగ్రి పడి కొందరు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. పనులు చేపట్టిన చోట్ల రక్షణ చర్యలు తీసుకోకపోవడం ప్రమాదాలకు కారణం.