Bangladesh Crisis : బంగ్లాదేశ్ లో శ్రీలంక పరిస్థితులు..52 శాతం పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..ఆందోళనలతో దద్దరిల్లిన ఢాకా..

 భారత్ మరో పొరుగుదేశం బంగ్లాదేశ్..ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదంలో పడింది. శ్రీలంక తరహాలో బంగ్లాదేశ్ లో కూడా ఆందోళనలు భారీగా జరుగుతున్నాయి. పెరిగిన ఇంధన ధరలకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు. ఆందోళనలతో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా దద్దరిల్లిపోయింది. పెట్రోల్ బంక్‌లు ధ్వంసం చేశారు. ఈ పరిస్థితుల మధ్యే బంగ్లాదేశ్, చైనాతో నాలుగు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది.

Bangladesh Crisis : బంగ్లాదేశ్ లో శ్రీలంక పరిస్థితులు..52 శాతం పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..ఆందోళనలతో దద్దరిల్లిన ఢాకా..
ad

Bangladesh Economic Crisis: భారత్ మరో పొరుగుదేశం బంగ్లాదేశ్..ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదంలో పడింది. శ్రీలంక తరహాలో బంగ్లాదేశ్ లో కూడా ఆందోళనలు భారీగా జరుగుతున్నాయి. పెరిగిన ఇంధన ధరలకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు. పెట్రోల్ బంక్‌లు ధ్వంసం చేశారు. ఈ పరిస్థితుల మధ్యే బంగ్లాదేశ్, చైనాతో నాలుగు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది.

రష్యా, యుక్రెయిన్ యుద్ధ ప్రభావం ప్రపంచంలోని అన్నిదేశాలపైనా పడింది. దీంతో అన్ని దేశాలూ ఇంధన ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇదే ఆయా దేశాల్లో ప్రజల ఆగ్రహానికి, రాజకీయ అనిశ్చితికి దారితీస్తోంది. లీటర్ పెట్రోల్ కోసం రోజుల తరబడి క్యూలైన్లలో ఎదురుచూసీ చూసీ..విసుగుపోయి…శ్రీలంక ప్రజలు తిరగబడ్డారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సహా పెరిగిన నిత్యావసరాల ధరలకు, ఆర్థికసంక్షోభానికి వ్యతిరేకంగా కనీవినీ ఎరుగని ఆందోళనలతో ప్రభుత్వాన్ని కూలదోశారు. ఇదే తరహా తిరుగుబాటు ఇప్పుడు మన మరో పొరుగుదేశం బంగ్లాదేశ్‌లోనూ కనిపిస్తోంది. ఇటీవల ఆ దేశ ప్రభుత్వం ప్రజలపై భారీగా ధరలభారం వేసింది. పెట్రోల్, డీజిల్ రేట్లను దాదాపు 52శాతం పెంచింది. దీనిపై బంగ్లాదేశ్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశమంతా ఆందోళనలతో హోరెత్తించారు. బంగ్లాదేశ్ ఆవిర్భావం తర్వాత ఈ స్థాయిలో చమురు ఉత్పత్తుల ధరలు పెరగడం ఇదే మొదటిసారి. దేశ రాజధాని ఢాకా సహా అనేక నగరాల్లో వేల సంఖ్యలో ప్రజలు వీధుల్లోకొచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. పెట్రోల్ బంకులు ధ్వంసం చేశారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

Also read : China-Taiwan War : హోటల్ రూమ్ లో తైవాన్ రక్షణా అధికారి అనుమానాస్పద మృతి..చైనా పనేనా..?

అన్ని దేశాల ప్రజలు బంగ్లాదేశ్ ప్రజలు కూడా ఇప్పటికే నిత్యావసరాల ధరల పెరుగుదలతో అల్లాడుతున్నారు. ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరుగుతోంది. తొమ్మిది నెలలుగా 6శాతం పైనే నమోదవుతోంది. గత నెలలో 7.48శాతానికి చేరింది. మధ్యతరగతి, పేద ప్రజలకు పూటగడడం కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో యుద్ధం పేరుతో మళ్లీ ఇంధన ధరల భారం మోపడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. 51.2 శాతం పెరుగుదలతో ప్రస్తుతం భారత కరెన్సీ ప్రకారం లీటర్ పెట్రోల్ ధర 108రూపాయలకు చేరింది. డీజిల్, కిరోసిన్, గ్యాస్ ధరలు కూడా భారీగా పెరిగాయి.

పెరిగిన ధరలతో ప్రజలపై మోయలేని భారం పడుతోందన్నది నిజమేనని..కానీ తమకు మరో ప్రత్యామ్నాయం లేదని బంగ్లాదేశ్ మంత్రి ఒకరు చెప్పారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని, పరిస్థితిని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాలని కోరారు. ఆరు నెలలుగా బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ ఆయిల్ అమ్మకాల్లో 85 మిలియన్ డాలర్ల నష్టాలు చవిచూసిందని వివరించారు.

416 బిలియన్ డాలర్లతో కొన్నాళ్లగా బంగ్లాదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థల్లో ఒకటిగా ఉంది. అయితే అంతర్జాతీయ పరిణామాలు, పెరిగిన ధరలు, దిగుమతి ఖర్చులతో IMF సహా ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక యుద్ధ ప్రభావంతో ఇప్పుడు పరిస్థితులు అదుపుతప్పుతున్నాయి. ఈ పరిస్థితుల మధ్యే చైనాతో బంగ్లాదేశ్ నాలుగు ఒప్పందాలు కుదుర్చుకుంది. విపత్తు నిర్వహణ, సాంస్కృతిక సహకారం సహా నాలుగు అంశాల్లో కలిసి పనిచేయాలని బంగ్లాదేశ్, చైనా నిర్ణయించాయి.

Also read : Pladda Island for sale : అతి తక్కువ ధరకే అందాల ఐలాండ్..ఐదు బెడ్ రూముల ఇంటితో పాటు హెలిప్యాడ్ సౌకర్యాలు

ఈ ఒప్పందాలపై బంగ్లాదేశ్‌లోనే కొన్ని వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. శ్రీలంక దివాళాకు చైనా ఓ కారణమన్నది ప్రపంచమంతా అంగీకరిస్తున్న నిజం. ఇప్పటికే సంక్షోభం దిశగా పయనిస్తున్న బంగ్లాదేశ్..ఈ సమయంలో చైనాతో ఒప్పందాలు కుదుర్చుకోవాల్సిన అవసరమేంటని…కొందరు బంగ్లాదేశ్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఒప్పందాల సంగతి పక్కనపెడితే…ధరల సంక్షోభం నుంచి బంగ్లాదేశ్ బయటపడుతుందా..లేక శ్రీలంకలా ప్రమాదకర పరిస్థితులు కొనితెచ్చుకుంటుందా అన్నది కొన్నిరోజుల్లో తేలనుంది.