‘Bar-tailed godwit’ Bird Record : ఓ బుల్లి పిట్ట ప్రపంచ రికార్డ్ .. నాన్‌స్టాప్‌గా 13,560 కిలోమీటర్లు ప్రయాణించిన పక్షి

ఓ బుల్లిపిట్ట మాత్రం ఏకంగా నాన్‌స్టాప్‌గా 13వేల 560కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణించింది. ప్రయాణానికి భంగం కలుగకుండా ఏకంగా ఆహారం తినకుండానే జర్నీ కంటిన్యూ చేసింది. అలా ఏకంగా 13వేల 560కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణించి శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది.

‘Bar-tailed godwit’ Bird Record : ఓ బుల్లి పిట్ట ప్రపంచ రికార్డ్ .. నాన్‌స్టాప్‌గా 13,560 కిలోమీటర్లు ప్రయాణించిన పక్షి

‘Bar-tailed godwit’ Bird World Record

Wonder Bird ‘Bar-tailed godwit ’ world record :  పిట్టకొంచెం… కూతఘనం అంటారు పెద్దలు. ఇక్కడ అలాంటిదే ఓ పిట్టుంది… దాని కూత మాటేమో గానీ అది చేసింది మాత్రం ఘనాతి ఘనంగా ఉంది. బుల్లిపిట్ల రికార్డు సాధించింది. ఒక్కసారి మేఘాల్లోకి అలా ఎగిరిందో లేదో గిన్నీస్‌ రికార్డును బద్దలుకొట్టేసింది. ఇంతకీ ఆ బుల్లిపిట్ట కథాకమామీషు ఏంటో తెలిస్తే వారెవ్వా ఏం పిట్టరాబాబూ..దీనికి ఎక్కడనుంచి వచ్చిందో ఇంత ఓపిక అనిపిస్తుంది.

బాగా పరుగు పెట్టేవాళ్లను అరేబియన్ గుర్రం అంటారు. మేలుజాతికి చెందిన గుర్రమైనా ఆగకుండా ఓ 10-15కిలోమీటర్లు వెళ్లగలదేమో… మరి పక్షులు ఆగకుండా ఎన్ని కిలోమీటర్లు వెళ్లగలవు… ఓ 20 లేదా 30 లేదా 40 కిలోమీటర్లు… కానీ ఓ బుల్లిపిట్ట మాత్రం ఏకంగా నాన్‌స్టాప్‌గా 13వేల 560కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణించింది. ప్రయాణానికి భంగం కలుగకుండా ఏకంగా ఆహారం తినకుండానే జర్నీ కంటిన్యూ చేసింది. అలా 10కాదు 20 కాదు పోనీ 100కాదు 200,500కూడా కాదు…ఏకంగా 13వేల 560కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణించి శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది.

లిమోసా జాతికి చెందిన బార్‌ టెయిల్డ్‌ గాడ్‌విట్‌ అనే చిన్న పక్షి అమెరికాలోని అలస్కా నుంచి బయల్దేరి ఆస్ట్రేలియాలోని టాస్మేనియా వరకు ఎక్కడా ఆగకుండా ప్రయాణించింది. కనీసం తిండి కోసం కూడా ఎక్కడా ఆగలేదు…ఇది ప్రపంచరికార్డ్‌ అంటున్నారు శాస్త్రవేత్తలు… సాధారణంగా వలస పక్షులు మధ్యలో అక్కడక్కడా ఆగుతాయి. ఆహారాన్ని సేకరించుకుంటాయి. కొంత విశ్రాంతి తర్వాత మళ్లీ జర్నీ మొదలుపెడతాయి. కానీ ఈ బుల్లిపిట్ట మాత్రం ఎక్కడా బ్రేక్ అనేదే తీసుకోలేదు. పైగా ఈ పక్షి వయస్సు కేవలం ఐదు నెలలు మాత్రమే.

ఐదునెలల వయసున్న ఈ పక్షి అక్టోబర్‌ 13న అలస్కాలో బయల్దేరింది. పసిఫిక్‌ సముద్రం మీదుగా 11రోజులు ఏకబిగిన జర్నీ చేసి టాస్మేనియాలోని ఆన్‌సాన్స్‌ తీరానికి చేరింది. అలస్కా నుంచి బయల్దేరడానికి ముందే కొన్ని వలస పక్షులకు సైంటిస్టులు GPS చిప్‌లు అమర్చారు. ఇది బయల్దేరినప్పటి నుంచి నిరంతరం ట్రాక్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడ ఆగింది ఎంతసేపు ఆగింది వంటి వివరాలు నమోదు చేశారు. కానీ ఈ బుల్లిపిట్ట మాత్రం ఒక్కసారి కమిటైతే నా మాటే నేను వినను అన్నట్లు 13,560కిలోమీటర్లు అలుపు సొలుపు లేకుండా ఎగిరింది. ముందుగా జపాన్‌వైపు పయనం మొదలుపెట్టి ఆ తర్వాత దిశ మార్చుకుంది.

అంతదూరం ఈ చిన్న పక్షి సింగిల్‌గా జర్నీ చేసిందా లేక మిగతా పక్షులతో కలసి వలస వెళ్లిందా అన్నదానిపై మాత్రం సైంటిస్టులకు క్లారిటీ లేదు. పైగా దీని వయసు కేవలం 5నెలలు.. అలాంటప్పుడు అది పెద్దపక్షుల లాగా అంతదూరం ఎలాంటి తడబాటు లేకుండా ఎక్కడా ఆగకుండా ఎలా వెళ్లగలిగిందన్నది నిజంగా వండర్‌… పోనీ ఇది పెద్దపక్షులతో కలసి జర్నీ చేసిందా అంటే అదీ కాదంటున్నారు. ఎందుకంటే పెద్దపక్షులు అలస్కాను కొన్ని నెలల ముందే వదిలేశాయి. అలాంటప్పుడు ఈ చిన్న పక్షి వాటితో వెళ్లే అవకాశమే లేదు. దీంతో ఇది ఎలా జర్నీ చేసిందన్నది సైంటిస్టులకే అంతుబట్టడం లేదు.

అవిశ్రాంత ప్రయాణం కారణంగా పక్షి సగం బరువు కోల్పోయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2020లో కూడా ఇదే జాతికి చెందిన ఓ పక్షి అలస్కా నుంచి బయల్దేరి న్యూజిలాండ్ వరకు 12వేల 2వందల కిలోమీటర్లు జర్నీ చేసి గిన్నీస్‌కు ఎక్కింది. అదే పక్షి ఆ తర్వాతి ఏడాదే 13వేలను టచ్ చేసింది. ఇప్పుడు ఐదు నెలల వండర్‌బర్డ్‌ ఆ రికార్డును బద్దలుకొట్టింది.