Prince Harry’ book “Spare,” : ‘మా అన్న నన్ను కొట్టారు’ ప్రకంపనలు రేపుతున్న బ్రిటన్ యువరాజు హ్యారీ పుస్తకం .. ప్యాలెస్ సీక్రెట్లు బట్టబయలు

 బ్రిటన్ యువరాజు హ్యారీ కొత్త పుస్తకం ప్రకంపనలు రేపుతోంది. రాజకుటుంబ రహస్యాలను బద్దలుకొడుతోంది. రాచరికపు కోటల మధ్య జరిగే అంతర్యుద్ధం, మానసిక సంఘర్షణ, అన్నదమ్ముల మధ్య ఆధిపత్యపోరు వంటి పలు వివాదాలను వెలుగులోకి తెస్తూ ప్రపంచవ్యాప్త సంచలనాలకు వేదికవుతోంది హ్యారీ కొత్త పుస్తకం ‘స్పేర్‌’.

Prince Harry’ book “Spare,” : ‘మా అన్న నన్ను కొట్టారు’ ప్రకంపనలు రేపుతున్న బ్రిటన్ యువరాజు హ్యారీ పుస్తకం .. ప్యాలెస్ సీక్రెట్లు బట్టబయలు

Prince Harry’ book “Spare,”

Prince Harry’ book “Spare,” : బ్రిటన్ యువరాజు హ్యారీ (Prince Harry)కొత్త పుస్తకం ప్రకంపనలు రేపుతోంది. రాజకుటుంబ రహస్యాలను బద్దలుకొడుతోంది. రాచరికపు కోటల మధ్య జరిగే అంతర్యుద్ధం, మానసిక సంఘర్షణ, అన్నదమ్ముల మధ్య ఆధిపత్యపోరు వంటి పలు వివాదాలను వెలుగులోకి తెస్తూ ప్రపంచవ్యాప్త సంచలనాలకు వేదికవుతోంది హ్యారీ కొత్త పుస్తకం స్పేర్‌ (Spare). మరో రెండ్రోజుల్లో ఇది ప్రజల ముందుకు వస్తే ఇంకెన్ని సంచలనాలు నమోదవుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది. జనవరి 10న పుస్తకాలు మార్కెట్‌లోకి రావాల్సి ఉన్నా… స్పెయిన్‌లోని కొన్ని దుకాణాలు ముందే స్పేర్‌ (Spare) పుస్తకాన్ని ఉంచాయి. ఆ తర్వాత అమ్మకాలు ఆపేసినా అప్పటికే కొన్ని ప్రజల్లోకి వచ్చేశాయి.

పేరుకే రాజకుటుంబం కావొచ్చు… కానీ ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో ఎలాంటి సీన్లు జరుగుతాయో బ్రిటన్ రాజకుటుంబంలోనూ అలాగే జరిగాయి.. భార్య చనిపోయినా భర్త పట్టించుకోకపోవడం, ఆధిపత్య పోరు, పెళ్ళిళ్లు వివాదాలు, కొడుకుల గురించి తండ్రి పట్టించుకోకపోవడం, తండ్రి ముందే కొడుకులు కొట్టుకోవడం ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఎన్నెన్నో… కోటలోపలి గదుల్లో సమాధి కావాల్సిన రాజరిక రహస్యాలను వెలుగులోకి తెచ్చింది బయటి వ్యక్తి కాదు… రాజకుటుంబంలోని వ్యక్తే… ఖరీదైన కోటు కింద దాగిన గుండెల్లో కన్నీటి చెమ్మను ఈ పుస్తకం ప్రపంచానికి మరోసారి చాటుతోంది. ఖరీదైన కోటల్లో విలాసవంతమైన మందిరాల్లో అంతా సుఖమే ఉంటుందనుకుంటే పొరపాటని హ్యారీ పుస్తకం చాటుతోంది స్పేర్‌ (Spare).

యువరాజు గౌరవాన్ని వదులుకుని అమెరికాలో సామాన్యుడిగా బతుకుతున్న హ్యారీ… కొత్త పుస్తకంలో తన అనుభవాలు, తానెదుర్కొన్న పరాభవాలు, తన తండ్రి, అన్నతో ఘర్షణ ఇలా ఎన్నో విషయాలను ఇందులో ప్రస్తావించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో స్పేర్‌పై ఆసక్తి నెలకొంది. దీనికి తోడు పుస్తకం నుంచి లీకవుతున్న ఒక్కో అంశం…ఉత్కంఠను అంతకంతకు పెంచుతోంది. తాను తొలిసారి సెక్స్‌లో పాల్గొనడం నుంచి అన్న విలియమ్ తన మీద చేయి చేసుకోవడం వరకు అనేక సంగతులను ఆ పుస్తకంలో ప్రిన్స్ హ్యారీ ప్రస్తావించారు.

బ్రిటన్‌ రాజు కింగ్‌ చార్లెస్‌-3 (King Charles III ), ప్రిన్సెస్‌ డయానా (Princess Diana)ల రెండో కుమారుడే ప్రిన్స్ హ్యారీ… రాజకుటుంబ అభ్యంతరాలను పట్టించుకోకుండా అమెరికా నటి మెగన్‌ మోర్కెల్‌ (Meghan Markle)ను హ్యారీ పెళ్లిచేసుకున్నాడు. అప్పట్నుంచి అన్నదమ్ముల మధ్య అప్పట్నుంచి గ్యాప్ పెరిగింది. తర్వాతి పరిణామాలతో హ్యారీ దంపతులు సంచలన రీతిలో రాజరిక హోదానే వదులుకునేందుకు దారితీసాయి. ఆ పరిస్థితులను పుస్తకంలో కళ్లకు కట్టినట్లు వివరించారు హ్యారి.

2019లో ఒకసారి లండన్‌లోని తన ఇంట్లో విలియమ్ కింద పడేలా కొట్టాడని హ్యారీ ఈ పుస్తకంలో పేర్కొన్నాడు. తన భార్య మేఘన్‌ మీద విలియమ్‌ చేసిన కామెంట్లతో వివాదం రేగిందన్నాడు. మేఘన్‌ను సమర్ధించడానికి హ్యారీ ప్రయత్నించినప్పుడు విలియం ఆగ్రహంతో ఊగిపోయాడట. హ్యారీ చొక్కా పట్టుకుని కిందకు నెట్టేశాడు. కుక్కకు భోజనం పెట్టే పాత్ర తగిలి హ్యారీ వీపుకు గాయమైంది. ఆ గాయం మానడానికి నెలలు పట్టిందని చెప్పుకొచ్చాడు.

17 ఏళ్లకే డ్రగ్స్ తీసుకున్నానని పుస్తకంలో ఒప్పుకున్నాడు హ్యారీ. ఓ ఫ్రెండ్‌ ఇంట్లో కొకైన్ తీసుకున్నానని అయితే అది అంత కిక్ ఇవ్వలేదన్నాడు. ఆ తర్వాత కూడా చాలాసార్లు డ్రగ్స్ తీసుకున్నానని… కాలేజీ బాత్రూమ్‌లో గంజాయి తాగేవాడినని ఒప్పుకున్నాడు. అలాగే తనకంటే పెద్ద వయసు ఆమెతో సెక్స్‌లో పాల్గొన్నట్లు పుస్తకంలో రాసుకొచ్చాడు హ్యారీ. పబ్‌ వెనక బహిరంగ ప్రదేశంలో శృంగారం చేశానని అందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నానని చెప్పుకొచ్చాడు యువరాజు. 2012-13లో అఫ్గానిస్తాన్‌లో హెలికాప్టర్ పైలెట్‌గా పని చేసినప్పుడు 25 మంది తాలిబాన్ ఫైటర్లను చంపానన్నాడు హ్యారి.

తన తండ్రి, ప్రస్తుత బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్-3తో తన అనుబంధం అంత గొప్పగా లేదని పుస్తకంలో ఇందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తన తల్లి డయానా చనిపోయిన విషయాన్ని తండ్రే తనకు చెప్పాడని… ఏడుస్తున్న తనను కనీసం దగ్గరకు తీసుకుని ఓదార్చలేదని వెల్లడించాడు. అప్పుడు తన వయసు కేవలం 12ఏళ్లేనని ఏం జరుగుతుందో కూడా తనకు అర్థం కాలేదన్న ఆవేదన హ్యారీ రాతల్లో కనిపిస్తోంది. తల్లి ఆత్మతో మాట్లాడేందుకు ఓ మంతగత్తె దగ్గరకు కూడా వెళ్లాడట హ్యారీ… కెమిల్లాను పెళ్లి చేసుకోవద్దని తాను, విలియం వేడుకున్నా తండ్రి వినలేదన్నాడు హ్యారీ.

బ్రిటన్ రాణి ఎలిజిబెత్‌ (Queen Elizabeth of Britain)చనిపోయిన సమయంలోనూ హ్యారీకి అవమానాలు తప్పలేదు. ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నప్పుడు హ్యారీకి ఫోన్ చేసిన ఛార్లెస్‌…. రాణి ఉన్న బల్మోరల్ ప్యాలెస్‌కు హ్యారీ ఒక్కడినే రమ్మని చెప్పాడు. మేఘన్‌ను వెంట తీసుకురావొద్దని స్పష్టంగా చెప్పేశాడు. తన నాయనమ్మ చనిపోయిన విషయం బీబీసీలో చూసాకే తెలుసుకున్నానన్నాడు. రాణి ఎలిజిబెత్‌ చివరిచూపు కూడా మేఘన్‌కు దక్కలేదు. అంతేకాదు ఎలిజిబెత్‌ అంత్యక్రియల సమయంలో హ్యారీ ధరించిన సైనిక దుస్తులపై రాణి అధికార చిహ్నాన్ని తొలగించడం అవమానాన్నే మిగిల్చింది. బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌లో దేశాధినేతలకు ఇచ్చిన విందుకు ఆహ్వానం అందకపోవడం కూడా హ్యారీ దంపతులకు గుండెకోత మిగిల్చింది.

రాణి ఎలిజిబెత్‌ మరణం తర్వాత అన్నదమ్ములు విలియం, హ్యారీలు దగ్గరవుతున్నారని అందరూ భావించారు. కానీ అదంతా ప్రచారమేనని ఆ గాయం అంతకంతకూ పెరుగుతోందని హ్యారీ పుస్తకం స్పష్టం చేస్తోంది. ఈ పుస్తకం మార్కెట్‌లోకి వస్తే ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో, అన్నదమ్ముల మధ్య దూరాన్ని ఇంకెంత పెంచుతుందోనన్న ఆందోళన రాజకుటుంబంలో నెలకొంది.