China-US ‘Cold War’ : అంతర్జాతీయ వాణిజ్యంలో ఎదుగుతున్న చైనా.. తొక్కిపడేయాలని చూస్తున్న అమెరికా

China-US ‘Cold War’ : అంతర్జాతీయ వాణిజ్యంలో ఎదుగుతున్న చైనా.. తొక్కిపడేయాలని చూస్తున్న అమెరికా

China Govt accuses US of ‘Cold War thinking’ in security strategy

China-US ‘Cold War’ : ఓ వైపు.. రష్యా-యుక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సమయంలో.. పుతిన్‌కు వ్యతిరేకంగా, యుక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా స్టాండ్ తీసుకుంది. ఇదంతా.. ప్రత్యక్షంగా జరుగుతున్న యుద్ధమే. దీని గురించి ప్రపంచం మొత్తం తెలుసు. కానీ.. కొత్తగా మరో ప్రచ్ఛన్న యుద్ధం మొదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయ్. అది కూడా.. అమెరికా – చైనా మధ్య! జిన్ పింగ్ ప్రభుత్వం చేస్తున్న తాజా ఆరోపణలు చూస్తే.. అతి త్వరలోనే.. యూఎస్-డ్రాగన్ మధ్య కోల్డ్ వార్ తప్పదనే సిగ్నల్స్ వస్తున్నాయ్.

ప్రపంచం మొత్తం రష్యా-యుక్రెయిన్ యుద్ధం గురించే ఆలోచిస్తోంది. ఆందోళన చెందుతోంది. ఇలాంటి సమయంలో.. ప్రపంచ దేశాల్లో మరోసారి అమెరికా-చైనా సంబంధాలపై హాట్ డిబేట్ మొదలైంది. యూఎస్‌తో.. అమీ-తుమీ తేల్చుకునేందుకు జిన్ పింగ్ సర్కార్ కూడా సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇందుకు.. తాజాగా చైనా ప్రభుత్వం బైడెన్ గవర్నమెంట్ మీద చేసిన ఆరోపణలే కారణం. చైనాతో ప్రచ్ఛన్న యుద్ధం గురించి అమెరికా ఆలోచిస్తున్నట్లు.. బీజింగ్ ఆరోపిస్తోంది. అంతేకాదు.. ఇప్పటికే రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేపట్టాలని వాషింగ్టన్‌ని కోరింది. అంతర్జాతీయ వ్యవహారాల్లో.. చైనా కంటే ముందుండాలని.. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్.. సరికొత్త జాతీయ భద్రతా వ్యూహాన్ని విడుదల చేసిన తర్వాత.. బీజింగ్ నుంచి కోల్డ్ వార్‌కు సంబంధించిన ప్రకటన వచ్చింది.

అమెరికా అడుగులు చూస్తుంటే.. చైనా విషయంలో కాస్త అలర్ట్‌గా ఉండాలన్న ఆలోచనకు వచ్చినట్లు కనిపిస్తోంది. అంతర్జాతీయ వాణిజ్యంలో చైనా ఎదుగుదలను చూసి.. యూఎస్ టెన్షన్ పడుతుందన్న విషయం అర్థమవుతోంది. అందుకే.. గ్లోబల్ గవర్నెన్స్, అంతర్జాతీయ వ్యాపారం, టెక్నాలజీ సహా సైనిక వ్యవహారాల్లో.. చైనాను ఓడించడానికి సిద్ధం కావాలంటూ బైడెన్ పిలుపునిచ్చారు. ప్రతి విషయంలో.. చైనాకు గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించారు. అంతర్జాతీయంగా చైనాను తొక్కిపడేయాలని, అన్ని రంగాల్లోనూ అమెరికా ఆధిపత్యమే కొనసాగేలా చర్యలు చేపట్టాలని.. బైడెన్ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇప్పుడిదే.. చైనాకు అస్సలు మింగుడుపడటం లేదు.

ఇప్పటికే.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా ఎదిగింది. అంతేకాదు.. మిలిటరీ విషయంలోనూ డ్రాగన్ కంట్రీ ద్వితీయ స్థానంలో ఉంది. ఈ రెండింటితో అంతర్జాతీయగా స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపేందుకు జిన్ పింగ్ అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంపై కొనసాగుతున్న అగ్రరాజ్యం అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించి.. చైనాను ఆ స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నారు. పెరుగుతున్న ఆర్థిక, దౌత్య, సైనిక, సాంకేతిక శక్తితో.. అంతర్జాతీయ క్రమాన్ని పునర్నిర్మించాలనే ఉద్దేశంతో.. చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్ పావులు కదుపుతున్నారు. దీంతో.. అమెరికా అప్రమత్తమైంది. చైనాను గనక ఇలాగే వదిలేస్తే.. ఏనాటికైనా తమ స్థాయికి ఎదిగి.. తమనే శాసిస్తుందనే ఆలోచనకు వచ్చింది. పైగా.. మిగతా దేశాలతో పోలిస్తే.. ఇప్పుడు యూఎస్‌కు పోటీగా ఉన్న ఒకే ఒక్క దేశం చైనా మాత్రమే. అందువల్ల.. చైనా దూకుడుకు కళ్లెం వేయాలంటే.. ఆ దేశానికి అన్ని రంగాల్లో మరింత గట్టి పోటీ ఇవ్వాలని బైడెన్ నిర్ణయించుకున్నారు. ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఆ దిశగానే ఉన్నాయ్.

చైనా సప్లై చైన్ మీద దెబ్బకొట్టేలా.. తాజాగా బైడెన్ ఓ నిర్ణయం తీసుకున్నారు. చైనా సహా ఇతర ఆసియా దేశాల నుంచి వచ్చే.. సెమీ కండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, సోలార్ ప్యానెల్స్, ఇతర టెక్నాలజీపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు.. అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో.. జిన్ పింగ్ ప్రభుత్వం కూడా.. అమెరికా సహా ఇతర పశ్చిమ దేశాల టెక్నాలజీపై ఆధారపడకూడదని నిర్ణయించుకుంది. ఇందుకోసం.. సొంతంగా ప్రాసెసర్ చిప్‌లు, ఏఐ టెక్నాలజీ, ఏరోస్పేస్, ఇతర టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవడం మీద ఫోకస్ పెట్టింది. యూఎస్ సహా పశ్చిమ దేశాలపై ఆధారపడే అవసరాన్ని తగ్గించుకునేందుకు భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నారు. ఏది తయారైనా.. చైనాలోనే తయారవ్వాలన్నట్లుగా.. మేడిన్ చైనా ప్రొడక్టులను ప్రోత్సహిస్తున్నారు. ప్రపంచమంతా చైనా ప్రొడక్ట్స్‌ను అమ్మాలని చూస్తున్నారు. అదే సమయంలో వరల్డ్ సప్లై చైన్ మీద ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని.. తమ దేశంలోని కంపెనీల మీదా జిన్ పింగ్ ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది.

అన్ని రంగాల్లో ఎదిగి.. ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించాలని చైనా.. ఇప్పటికే గట్టిగా ఉన్న పట్టును కోల్పోకుండా చూసుకునేందుకు అమెరికా.. గట్టిగా ప్రయత్నిస్తున్నాయ్. ఇందుకోసం.. అంతర్జాతీయ వాణిజ్యంలో.. అన్ని రంగాల్లో చైనాను అణగదొక్కేందుకు.. మార్కెట్‌లో డ్రాగన్‌ కంట్రీకి తీవ్రమైన పోటీ ఇవ్వాలని అమెరికా నిశ్చయించుకుంది. మరోవైపు.. ఇప్పటికే ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన చైనా.. నెంబర్ వన్ పొజిషన్‌కు చేరుకోవాలని చూస్తోంది. ఇందుకోసం.. టెక్నాలజీని పెంచుకోవడంతో పాటు దాని కోసం ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో.. రెండు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలై.. అది ముదిరితే.. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న ఆందోళన మొదలైంది.