ఆఫ్గనిస్తాన్ లో భూకంపం..వణికిన ఉత్తర భారతం

  • Published By: venkaiahnaidu ,Published On : December 20, 2019 / 01:34 PM IST
ఆఫ్గనిస్తాన్ లో భూకంపం..వణికిన ఉత్తర భారతం

ఆఫ్గనిస్తాన్‌,పాకిస్తాన్ లతో పాటుగా ఉత్తర భారతదేశంలో పలుచోట్ల ఇవాళ(డిసెంబర్-20,2019) తీవ్ర భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం సాయంత్రం 5.20 గంటలకు చోటుచేసుకున్న ఈ భూకంపంతో ఒక్కసారిగా ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఆఫ్గనిస్తాన్ లోని హిందూ కుష్ రీజియన్ ప్రాంతంలో భూకంపం కేంద్రీకృతమైంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.3గా నమోదైనట్టు సమాచారం. భూకంపం వ‌ల్ల ఓ ఇంట్లో పైక‌ప్పుకు ఉన్న ఫ్యాన్‌, షాండ్లియ‌ర్లు ఊగిపోయాయి.

ఉత్తర ప్రదేశ్‌లోని మధురా, లక్నో, ప్రయాగ్‌రాజ్‌లతో పాటు జమ్మూ కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో సైతం స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకోవడంతో  స్థానికలు ఆందోళనకు గురయ్యారు . పాకిస్తాన్‌లోని లాహోర్ ప్రాంతంలో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. కాగా భూకంపం కారణంగా ఎలాంటి నష్టం జరింగిందన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.