Nicolas Sarkozy : ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడికి ఏడాది జైలు శిక్ష

2012 ఫ్రాన్స్ ఎన్నికల సమయంలో అక్రమంగా నిధులు సేకరించారన్న కేసులో మాజీ అధ్యక్షుడు నికోలస్‌ సర్కోజీ(66)కి ఏడాది జైలు శిక్ష విధిస్తూ తాజాగా పారిస్ లోని ఓ కోర్టు తీర్పు వెల్లడించింది.

Nicolas Sarkozy : ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడికి ఏడాది జైలు శిక్ష

France

Nicolas Sarkozy  2012 ఫ్రాన్స్ ఎన్నికల సమయంలో అక్రమంగా నిధులు సేకరించారన్న కేసులో మాజీ అధ్యక్షుడు నికోలస్‌ సర్కోజీ(66)కి ఏడాది జైలు శిక్ష విధిస్తూ తాజాగా పారిస్ లోని ఓ కోర్టు తీర్పు వెల్లడించింది. ఆరు నెలల క్రితమే ఈ కేసులో సర్కోజీని దోషిగా తేల్చిన కోర్టు..గురువారం జైలు శిక్షను ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించింది. అయితే సర్కోజీ జైలుకి వెళ్లకుండానే.. ఎలక్ట్రానిక్​ మానిటరింగ్ బ్రాస్ లెట్​ ధరించి ఇంట్లోనే శిక్ష పూర్తి చేసేందుకు న్యాయస్థానం అనుమతించింది. కాగా, కోర్టు తీర్పును సవాల్ చేయనున్నట్లు సర్కోజీ లాయర్ థియర్రీ హెర్జాగ్ తెలిపారు.

2007 నుంచి 2012 వరకు అధ్యక్షుడిగా పని చేసిన సర్కోజీ..2012 ఎన్నికల్లో మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన సోషలిస్ట్ పార్టీ నేత ఫ్రాంకోయిస్ హోలాండే చేతిలో ఓడిపోయారు. అయితే ఎన్నికల ప్రచార సమయంలో సర్కోజి నిర్ణయించిన ఆర్థిక మొత్తం 22.5 మిలియన్ యూరోల కన్నా రెండింతలు ఎక్కువ 42.8 మిలియన్ యూరోలు ఖర్చు చేశారని న్యాయ విచారణలో తేలింది. తమ ఖర్చు లెక్కలను దాచిపెట్టేందుకు ఆ సమయంలో బైగ్మాలియన్ ఎఫైర్ అనే పబ్లిక్ రిలేషన్స్ సంస్థను నియమించుకున్నారు. ఆ సంస్థ ఎన్నికల ప్రచార కార్యక్రమాల యొక్క అసలు ఖర్చును కప్పిపుచ్చేందుకు ఫేక్ ఇన్ వాయిస్‌ల వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తేలింది.

కాగా, నికోలస్ సర్కోజీకి ఈ ఏడాది ఇది రెండవ దోషి తీర్పు. న్యాయ విచారణపై రహస్య సమాచారాన్ని పొందడానికి న్యాయమూర్తికి లంచం ఇవ్వడానికి, ప్రభావం చూపడానికి ప్రయత్నించిన కేసులో ఈ ఏడాది మార్చిలో జరిగిన ప్రత్యేక విచారణలో సర్కోజీ దోషిగా తేలిన విషయం తెలిసిందే. ఆ కేసులో సర్కోజీకి మూడేళ్ల జైలు శిక్ష పడింది. అయితే ఇందులో రెండేళ్ల జైలు శిక్షను సస్పెండ్ చేశారు. అయినప్పటికీ ఇంతవరకు సర్కోజీ జైలుకి వెళ్లలేదు. ఆ తీర్పుని సవాల్ చేస్తూ ఆయన చేసుకున్న అప్పీల్ ఇంకా పెండింగ్ లోనే ఉంది.

ALSO READ  G-23 ఎఫెక్ట్..త్వరలో సీడబ్యూసీ భేటీ!