Nawaz Sharif కి బ్రిటన్ బిగ్ షాక్..తిరిగి లాహోర్ జైలుకి వెళ్లాల్సిందే!

 పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు బ్రిటన్ షాకిచ్చింది.

Nawaz Sharif కి బ్రిటన్ బిగ్ షాక్..తిరిగి లాహోర్ జైలుకి వెళ్లాల్సిందే!

Sharif

Nawaz Sharif   పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు బ్రిటన్ షాకిచ్చింది. పాకిస్తాన్ లో అవినీతి ఆరోపణలపై జైలుశిక్షకు గురైన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ (71) ట్రీట్మెంట్ పేరిట లండన్ లో కాలం గడుపుతున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా తన వీసా గడువు పొడిగించాలంటూ నవాజ్ షరీఫ్ చేసుకున్న దరఖాస్తును యూకే హోంశాఖ తిరస్కరించింది.

అవినీతి కేసుల్లో శిక్ష పడ్డ షరీఫ్.. నిబంధనలకు విరుద్ధంగా తమ దేశంలో ఉంటున్నారని యూకే హోంశాఖ పేర్కొంది. అంతేకాకుండా నవాజ్ షరీఫ్ వెంటనే దేశం విడిచి వెళ్లాల్సిందే అని యూకే హోంశాఖ స్పష్టం చేసింది. విదేశీయులు బ్రిటన్ లో ఆరు నెలలకు మించి ఉండేందుకు అక్కడి చట్టాలు అనుమతించవు. అయితే ఆరోగ్య కారణాలపై పాక్ ను వీడిన నవాజ్ షరీఫ్… తన వీసాలను అనేక దఫాలుగా పొడిగించుకుంటూ లండన్ లోనే ఉంటున్నారు. అయితే ఈసారి బ్రిటన్ ప్రభుత్వం షరీఫ్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. అయితే యూకే హోంశాఖ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ షరీఫ్ బ్రిటీష్ ఇమ్మిగ్రేషన్ ట్రిబ్యునల్ లో అప్పీల్ చేశారు. తనకు అనారోగ్య కారణాల రీత్యా వీసా గడువు పొడిగించాలని అందులో షరీఫ్ పేర్కొన్నారు.

పాకిస్తాన్‌లో రెండు అవినీతి కేసుల్లో నవాజ్ షరీఫ్ ముద్దాయిగా ఉన్నారు. అల్‌ అజీజియా మిల్స్‌ కేసులో 2018లో ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. దీంతో కొన్నాళ్ల పాటు లాహోర్ జైల్లో కూడా షరీఫ్ ఉన్నారు. అయితే తీవ్ర అనారోగ్యానికి గురయ్యాననా,వైద్య చికిత్స కోసం బెయిల్ కావాలంటూ.. నవాజ్ షరీఫ్ కోర్టు ఆశ్రయించారు. దీంతో లాహోర్ కోర్టు ఆయనకు నాలుగు వారాల బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ రావడంతో చికిత్స కోసం 2019లో ఇంగ్లాండ్‌కు వెళ్లిన షరీఫ్.. వైద్యం పేరుతో వీసా గడువును పెంచుకుంటూ అక్కడే మకాం వేశారు. అయితే నవాజ్ షరీఫ్ లండన్ వీధుల్లో చలాకీగా తిరుగుతూ, రెస్టారెంట్లలో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు ఇటీవల బయటికొచ్చిన విషయం తెలిసిందే.