మాట్లాడకుండా తినండి… రెస్టారెంట్లలో ప్రభుత్వం కొత్త నిబంధన

మాట్లాడకుండా తినండి… రెస్టారెంట్లలో ప్రభుత్వం కొత్త నిబంధన

not to talk in restaurants, japan new rule: కరోనా మహమ్మారి వెలుగుచూసి ఏడాదికిపైగా అవుతోంది. యావత్ ప్రపంచం కరోనాపై పోరాటం చేస్తోంది. అయినా కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. వ్యాక్సిన్లు వచ్చినా.. కరోనాలో కొత్త రకాలు ప్రజలను భయపెడుతున్నాయి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ప్రాణాలు తీసేందుకు ఈ వైరస్ రెడీగా ఉంది. అదుపులోకి వచ్చినట్టే వచ్చిన ఈ మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. క్రమంగా అన్ని దేశాల్లో కోవిడ్ తీవ్రత పెరుగుతోంది. పెద్ద సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి.

జపాన్ లోనూ ఇదే పరిస్థితి. అక్కడ కొత్త రకం వైరస్ వెలుగులోకి వచ్చింది. ఇది వ్యాక్సిన్ కు లొంగదని, వేగంగా వ్యాపిస్తుందని, మరింత ప్రమాదకరం అని తేలడంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో అలర్ట్ అయిన జపాన్ ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది. రెస్టారెంట్లలో కొత్త నిబంధన తీసుకొచ్చింది. రెస్టారెంట్లకు వెళ్లే ప్రజలు తినే సమయంలో మాట్లాడొద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా తినేసి బయటకు రావాలని సూచిస్తోంది.

జపాన్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా.. పెద్దగా ప్రయోజనం లేకుండా పోతోంది.
కరోనా కట్టడిలో భాగంగా కొన్ని నెలలపాటు రెస్టారెంట్లు మూతపడగా.. ఈ మధ్యే తిరిగి తెరుచుకున్నాయి. ఈ రెస్టారెంట్ల కారణంగానే కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతోందని, కొత్త కేసులు పెరుగుతున్నాయని అక్కడి ప్రభుత్వం బలంగా నమ్ముతోంది.

కరోనా వైరస్‌, గాలి ద్వారా సోకుతుందన్న విషయం తెలిసిందే. రోజంతా మాస్కులు ధరించే వ్యక్తులు తినే సమయంలోనే మాస్కులు తీసేస్తారు. తింటూ మాట్లాడుతున్నప్పుడు కరోనా వైరస్‌ గాల్లోకి చేరి ఇతరులకు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే, రెస్టారెంట్లకు వెళ్లే ప్రజలు తినే సమయంలో మాట్లాడొద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. అంతేకాదు, కరోనా కట్టడిలో భాగంగా రాత్రి 8 గంటలకే రెస్టారెంట్లు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక క్యోటో నగరం మరో అడుగు ముందుకేసి ‘సైలెంట్‌ ఈటింగ్‌’ పై ప్రజల్లో అవగాహన కలిగించే విధంగా నాలుగు కార్టూన్లతో పోస్టర్‌ రూపొందించింది.

ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో రెస్టారెంట్ కు ఎందుకెళ్తాం? సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేయడానికే కదా. అలా చేస్తే అందులో ఉండే ఎంజాయ్ మెంటే వేరు. కానీ, జపాన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధన తమ ఆశలపై నీళ్లు చల్లిందని జనాలు వాపోతున్నారు. సైలెంట్ గా తినేసి వెళ్లిపోమనడంతో నిట్టూరుస్తున్నారు. కొందరేమో.. ఇది మంచి పని అని, కరోనాను కట్టడి చేయాలంటే కొన్ని త్యాగాలు చేయాల్సిందేనంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనను సమర్థిస్తున్నారు. ప్రాణం కన్నా ఏదీ ఎక్కువ కాదని, ప్రజల క్షేమం కోసమే ఈ రూల్ అని వారంటున్నారు.