Pakistan: మాజీ ప్రధాని కోర్టుకెళ్లగానే.. ఆయన ఇంట్లోకి చొరబడి లాఠీఛార్జ్ చేసిన పోలీసులు

Pakistan: మాజీ ప్రధాని కోర్టుకెళ్లగానే.. ఆయన ఇంట్లోకి చొరబడి లాఠీఛార్జ్ చేసిన పోలీసులు

Pak Police Break Into Imran Khan's Home Hours After He Leaves For Court

Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇంట్లోకి శనివారం పోలీసులు చొచ్చుకుని వచ్చి హడావుడి చేశారు. ఇట్లో ఉన్న కొంత మందిపై తీవ్రంగా లాఠీఛార్జ్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ ఒక పని నిమిత్తం దేశ రాజధాని ఇస్లామాబాద్‭ ప్రయాణం అయిన కొద్ది సమయానికే ఈ ఘటన జరగడం గమనార్హం. అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమ్రాన్.. కోర్టు విచారణ నిమిత్తం ఇస్లామాబాద్‌కు వెళ్లారు. కాగా, లాహోర్‌లోని ఆయన ఇంట్లోకి పోలీసులు ప్రవేశించినట్లు ఆయన పార్టీ నేతలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

TSPSC Paper Leakage Case : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. వెలుగులోకి రాజశేఖర్ రెడ్డి లీలలు

పోలీసులు ఇంట్లోకి చొరబడ్డ సమయంలో ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బేగం ఇంట్లోనే ఉన్నారు. వాస్తవానికి ఇంటి బయట బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ.. పోలీసులు వాటిని తొలగించి ఇంట్లోకి చొరబడ్డారు. ఈ విషయమై ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ “బుష్రా బేగం ఒంటరిగా ఉన్న జమాన్ పార్క్‌లోని నా ఇంటిపై పంజాబ్ పోలీసులు దాడికి పాల్పడ్డారు. వారు ఏ చట్టం ప్రకారం ఇలా చేస్తున్నారు? పరారీలో ఉన్న నవాజ్ షరీఫ్‌ను క్విడ్ ప్రోకోగా అధికారంలోకి తీసుకురావడానికి పన్నిన లండన్ కుట్రలో భాగం ఇది” అని ఇమ్రాన్ ట్వీట్ చేశారు.


ఇక, ఇమ్రాన్ పార్టీ అయిన పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్, తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. ఇమ్రాన్ మీద మోపిన కేసుల విచారణకు సంబంధించి పోలీసులకు ఆయన మద్దతుదారులకు మధ్య కొద్ది రోజులుగా తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి. మూడు రోజుల క్రితం ఇమ్రాన్ అరెస్టు కాకుండా అతని ఇంటిని వందలాది మంది మద్దతుదారులు చుట్టుముట్టారు. వారిపై భద్రతా దళాలు టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగులను ప్రయోగించాయి.


ఇమ్రాన్‌పై జారీ చేసిన నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లను ఇస్లామాబాద్ హైకోర్టు శుక్రవారం రద్దు చేసింది. ఆయన 2018 నుంచి 2022 వరకు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విదేశీ ప్రముఖులు తనకు ఇచ్చిన ప్రభుత్వ బహుమతులను చట్టవిరుద్ధంగా విక్రయించారనే ఆరోపణలపై జిల్లా కోర్టుకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించింది. విచారణ సందర్భంగా, ఇమ్రాన్ మార్చి 18న కోర్టుకు హాజరవుతానని ఆయన తరపు న్యాయవాది హైకోర్టుకు హామీ ఇచ్చారు.

Rajasthan: రాజస్థాన్‌లో 19 కొత్త జిల్లాల ఏర్పాటు.. వెల్లడించిన సీఎం అశోక్ గెహ్లాట్.. 50కి చేరనున్న జిల్లాల సంఖ్య

గతేడాది నవంబర్‭లో ప్రచారం చేస్తున్న సమయంలో ఇమ్రాన్ మీద కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో ఆయన గాయపడ్డారు. కాగా, అప్పటి కంటే ఇప్పుడు తన ప్రాణాలకు ఎక్కువ ప్రమాదం ఉందని తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. గత సంవత్సరం అవిశ్వాస ఓటు ద్వారా ఇమ్రాన్ తన పదవిని కోల్పోయారు. అయితే దేశంలో ముందస్తు ఎన్నికలు జరపాలని, పాకిస్తాన్ అంతటా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మీద అనేక చట్టపరమైన కేసులు నమోదు అవుతుండడం విశేషం. ఒకవైపు దేశంలో హైస్థాయిలో రాజకీయ డ్రామా కొనసాగుతుండగా.. మరొకవైపు దేశం అత్యంత ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి సహాయం పొందలేకపోతే డిఫాల్ట్‌గా మారే ప్రమాదం ఉంది.