Russia ukraine war : ఎన్నాళ్లీ మారణకాండ..యుక్రెయిన్ పై రష్యా యుద్ధం ముగిసేది ఎప్పుడు?

ఎన్నీళ్లీ మారణకాండ..యుక్రెయిన్ పై రష్యా యుద్ధం ముగిసేది ఎప్పుడు? మూడు నెలల నుంచి యదేచ్ఛంగా కొనసాగుతున్న ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది. యుద్ధం వల్ల ఇరుదేశాలు తీవ్రంగా నష్టపోతున్నా యుద్ధం మాత్రం కొనసాగుతునే ఉంది.

Russia ukraine war : ఎన్నాళ్లీ మారణకాండ..యుక్రెయిన్ పై రష్యా యుద్ధం ముగిసేది ఎప్పుడు?

Russia ukraine war : యుద్ధంలో గెలిచేవారెవరూ ఉండరు. యూరప్ పర్యటనలో ప్రధాని మోదీ చెప్పిన మాట ఇది. రష్యా, యుక్రెయిన్ యుద్ధం ఈ విషయాన్ని పదే పదే రుజువుచేస్తోంది. రెండు వైపులా అపారనష్టం మిగిల్చుతూ మూడు నెలల నుంచి సాగుతున్న యుద్ధంలో ఏ దేశమూ అనుకున్న లక్ష్యం సాధించలేదు. నెలన్నరపాటు దాడులు, ప్రతిదాడులతో దద్దరిల్లిన యుక్రెయిన్ రాజధాని కీవ్‌లో…నగరం వార్షికోత్సవ వేళ ప్రశాంత పరిస్థితులు ఉండటమొక్కటే ఉపశమనం కలిగిస్తున్న విషయం.

ఎప్పుడు ముగుస్తోందో తెలియకుండా మూడు నెలల నుంచి సాగుతున్న యుద్ధంలో రష్యా, యుక్రెయిన్ అజెండాలేవీ నెరవేరడం లేదని అంతర్జాతీయ నిపుణులు సూత్రీకరించారు. రష్యన్ బలగాలన్నింటినీ యుక్రెయిన్ నుంచి బయటకు పంపాలన్నది ఆ దేశం లక్ష్యం. యుద్ధంలో మరిన్ని ప్రాంతాలు ఆక్రమించాలన్నది రష్యా ధ్యేయం. మూడు నెలల తర్వాత కూడా అటు రష్యా, ఇటు యుక్రెయిన్ ఎజెండాల సాధనకు అడుగులు పడడం లేదన్నది నిపుణుల మాట. కాబట్టి ఈ దశలో శాంతి చర్చలకు ఏ మాత్రం అవకాశం లేదని వారు అభిప్రాయపడుతున్నారు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీతో రష్యా అధ్యక్షుడు పుతిని్ నేరుగా సంప్రదింపులు జరపాలన్న ఫ్రాన్, జర్మనీ అధ్యక్షులు డిమాండ్ చేస్తున్న వేళ అంతర్జాతీయంగా ఈ అభిప్రాయం వ్యక్తమవుతోంది. 80 నిమిషాల పాటు పుతిన్‌తో చర్చలు జరిపిన జర్మనీ చాన్స్‌లర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించి, రష్యా బలగాలు యుక్రెయిన్ నుంచి వెనుతిరగాలని డిమాండ్ చేశారు. అయితే వారి డిమాండ్‌ను పుతిన్ తోసిపుచ్చారు. యుక్రెయిన్‌కు పాశ్చాత్య దేశాలు ఆయుధాలు అందించడాన్ని తప్పుపట్టారు. నల్ల సముద్రం నుంచి రష్యా, యుక్రెయిన్ ధాన్యం ఎగుమతులకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మరియుపోల్‌తో పాటు రష్యా ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో శాంతియుత జీవనం నెలకొనేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మార్చి 29న రష్యా యుక్రెయిన్ మధ్య చివరిసారిగా జరిగిన శాంతి చర్చలు విఫలమయిన తర్వాత మళ్లీ రెండు దేశాల మధ్య ఎలాంటి సంప్రదింపులూ సాగలేదు.

అటు తూర్పు యుక్రెయిన్‌లో రష్యా బలగాల దాడులు కొనసాగుతున్నాయి. లుహాన్స్క్లో యుక్రెయిన్ ఆధీనంలో ఉన్న రెండు చిన్న పట్టణాలను ఆక్రమించేందుకు రష్యా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ వారంలో తూర్పు యుక్రెయిన్‌ స్వతంత్ర ప్రాంతాలుగా అవతరిస్తాయని రష్యా ప్రకటించింది. యుద్ధం ప్రారంభానికి ముందే డాన్ బాస్ ప్రాంత స్వతంత్ర ప్రతిపత్తిని గుర్తించిన రష్యా…ఇప్పుడు ఆ ప్రాంతంపై పట్టు సాధించింది. లైమాన్ పూర్తిగా రష్యా బలగాలు, వారి మద్దతున్న వేర్పాటువాదుల వశమయిందని రష్యా రక్షణమంత్రి ప్రకటించారు. తూర్పు యుక్రెయిన్‌లో పరిస్థితి చాలా కష్టంగా ఉందని జెలన్‌స్కీ వ్యాఖ్యానించారు. రష్యా ఆక్రమించిన ఖేర్సన్‌లో ప్రజలను నగరం వీడనివ్వడం లేదని, ప్రజలను శరణార్థులుగా మార్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో రష్యా న్యూస్ చానళ్లను ప్రసారం చేయడం, రష్యా ఏరియా కోడ్‌లు ప్రవేశపెట్టడం, రష్యా స్కూల్ కరిక్యులమ్ అమలుచేయడం వంటివి చేయడం ప్రారంభించిందని యుక్రెయిన్ అధికారులు ఆరోపిస్తున్నారు.

యుద్ధం మరింతకాలం కొనసాగించేందుకు రష్యా సన్నాహాలు చేసుకుంటోంది. సైన్యం వయోపరిమితి గడువును పెంచింది. యుద్ధ సహాయక చర్యల్లో పాల్గొనేవారిని భారీగా నియమించుకుంటోంది. గతంలో రష్యా సైన్యంలో వయో పరిమితి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండగా ఇప్పుడు 45 ఏళ్లకు పెంచింది. యుద్ధంలో రష్యా బలగాలకు భారీగా ప్రాణనష్టం జరిగిందని యుక్రెయిన్ ఆరోపిస్తోంది. 30వేలమంది రష్యా సైనికులు చనిపోయారని యుక్రెయిన్ అంటోంది. అయితే బ్రటన్ 15వేలమంది రష్యా సైనికులు మరణించి ఉంటారని అంచనా వేసింది. రష్యా అధికారిక లెక్కలు మాత్రం చనిపోయిన రష్యా సైనికుల సంఖ్య 13వందల 51 అని ప్రకటించింది.

అటు రష్యా దాడుల్లో సర్వం కోల్పోయామని యుక్రెయిన్ అంటోంది. యద్దంలో 25వేల కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసం అయ్యాయని, వందలాది బ్రిడ్జిలు, 12 ఎయిర్‌పోర్టులు నాశనమయ్యాయని యుక్రెయిన్ ప్రధాని డెనిస్ చెప్పారు. వంద విద్యాసంస్థలు, 500 మెడికల్ కేంద్రాలు, 200 ఫ్యాక్టరీలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. యుక్రెయిన్ 30 నుంచి 50శాతం జీడీపీ పోగొట్టుకుందని అంచనావేశారు. యుక్రెయిన్ మౌలిక సదుపాయాలకు, ఆర్థిక వ్యవస్థకు 4వేల560 కోట్ల నష్టం వాటిల్లిందన్న అంచనాలు వెలువడుతున్నాయి.

యుద్ధం విషాదకర వార్తల మధ్య యుక్రెయిన్ వాసులకు ఉపశమనం కలిగించే ఒకే ఒక అంశం..రాజధాని కీవ్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనడం. కొన్ని రోజుల క్రితం బాంబుల మోతలు, క్షిపణుల దాడులు, యుద్ధ విమానాలతో దద్దరిలిన్ని కీవ్‌లో ఇప్పుడిప్పుడే ప్రజలు మామూలు జీవనానికి అలవాటు పడుతున్నారు. విషాదకర గుర్తులు, చీకటి జ్ఞాపకాలు, భవిష్యత్ అగమ్యగోచరంగా ఉన్న పరిస్థితుల మధ్యే కీవ్ డే వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ వేడుకలిచ్చే ఉత్సాహంతో కీవ్ శిథిలాలపై కొత్త భవిష్యత్ నిర్మించుకునేందుకు తమను తాము సిద్ధం చేసుకుంటున్నారు. కీవ్ ఆవిర్భావానికి గుర్తుగా 1982 నుంచి ఆ నగరంలో మే చివరి ఆదివారం కీవ్‌ డేగా జరుపుకుంటున్నారు అక్కడి ప్రజలు. యుద్ధం మిగిల్చిన విషాదం తలుచుకుంటూనే కీవ్ ప్రజలు నగరంలో సందడిగా గడిపారు.