Covid-19 : ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు

హమ్మయ్యా..! కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది.. అని అనుకునేలోపే.. రూపు మార్చుకొని మళ్లీ పంజా విసురుతోంది.

Covid-19  : ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు

South Korea Covid Cases

Covid-19 :  హమ్మయ్యా..! కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది.. అని అనుకునేలోపే.. రూపు మార్చుకొని మళ్లీ పంజా విసురుతోంది. కరోనా ఉద్భవించిన చైనాలో ఎన్నడూ లేని విధంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దక్షిణ కొరియాలోనూ అంతే.. రోజుకు 6 లక్షల కేసులు నమోదవుతూ కల్లోలం సృష్టిస్తోంది. స్టెల్త్ ఒమిక్రాన్‌ రూపంలో కోవిడ్‌ మళ్లీ వణికిస్తోంది. ఇజ్రాయెల్‌లో కొత్త వేరియంట్‌ బయటపడడం కలకలం రేపుతోంది.

కరోనా ముప్పు నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచ దేశాల్లో మళ్లీ అలజడి మొదలైంది. కొన్ని దేశాల్లో ఇప్పుడు కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. చైనాలో స్టెల్త్ ఒమిక్రాన్​ దడపుట్టిస్తోంది. కొవిడ్‌ భయాలతో చైనాలోని చాంగ్‌చున్‌, షెన్‌జెన్‌ సహా పలు ప్రధాన నగరాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. మరోవైపు దక్షిణకొరియాలోనూ కరోనా బుసలు కొడుతుంది. రోజురోజుకు దక్షిణ కొరియాలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. కొవిడ్​ కేసులతో పాటు మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.

వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా దక్షిణకొరియాలో బుధవారం ఒక్కరోజే 4 లక్షల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. గురువారం రోజు ఆ సంఖ్య 6 లక్షలకు చేరింది. మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి దక్షిణ కొరియాలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. రాజధాని సియోల్‌ నగరం పరిధిలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తోంది. లక్షలాది కేసులు అక్కడే నమోదవుతున్నట్లు అధికారులు చెప్తున్నారు.

దక్షిణ కొరియాలో వారం రోజులుగా రోజూ సగటున 3 లక్షల మందికి పైగా కరోనాబారిన పడుతున్నారు. ఈ వారం రోజుల్లోనే దక్షిణ కొరియాలో 23 లక్షల కేసులు నమోదయ్యాయి. దక్షిణ కొరియాలోని 87 శాతం జనాభాకు ఇప్పటికే వ్యాక్సినేషన్‌ పూర్తవగా.. 62.7 శాతం జనాభాకు బూస్టర్‌ డోసులు కూడా వేశారు. అయినా కేసుల ప్రవాహం ఆగడం లేదు. మరోవైపు హాంకాంగ్‌లోనూ 29 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే కొవిడ్‌ మృతుల్లో ఎక్కువమంది టీకా తీసుకోని వృద్ధులేనని హాంకాంగ్‌ అధికారవర్గాలు చెబుతున్నాయి.
Also Read : US-Russia Words: అఫ్గాన్, ఇరాక్ యుద్ధంలో అమెరికా పోగొట్టుకున్న సైనికుల కంటే ఎక్కువగా రష్యా సైనికులు మృతి

అటు వియత్నాంలో కూడా కరోనా ఉధృతంగా వ్యాపిస్తోంది. వియత్నాంలో గడిచిన వారంలో 18 లక్షల మంది మహమ్మారి బారిన పడ్డారు. చైనా, దక్షిణ కొరియా, వియత్నాం దేశాల్లో మళ్లీ మహమ్మారి విజృంభించడానికి ఒమిక్రాన్‌ బీఏ.2 సబ్‌ వేరియంట్‌ కారణం అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనే స్టెల్త్‌ ఒమిక్రాన్‌ అని పిలుస్తున్నారు. అటు ఇజ్రాయిల్‌ శాస్త్రవేత్తలు కొత్త కరోనా వేరియంట్‌ను గుర్తించినట్లు చెబుతుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అటు మార్చి 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభిస్తుండడంతో.. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది