Tokyo Olympics: విశ్వ క్రీడలు కరోనాకు కారణం అవుతున్నాయా?

2020 లో జరగాల్సిన టోక్యో ఒలంపిక్స్ కరోనా కారణంగా వాయిదాపడి ఈ ఏడాది జరుగుతున్నాయి. విశ్వక్రీడలు జరుగుతున్న వేళ మెడల్స్ గెలుచుకున్న దేశాలు ఆనందపడుతున్నాయి.

Tokyo Olympics: విశ్వ క్రీడలు కరోనాకు కారణం అవుతున్నాయా?

Olympics

Tokyo Olympics: 2020 లో జరగాల్సిన టోక్యో ఒలంపిక్స్ కరోనా కారణంగా వాయిదాపడి ఈ ఏడాది జరుగుతున్నాయి. విశ్వక్రీడలు జరుగుతున్న వేళ మెడల్స్ గెలుచుకున్న దేశాలు ఆనందపడుతున్నాయి. కానీ, ఒలింపిక్స్ జరుగుతున్న జపాన్ మాత్రం చిగురుటాకులా వణికిపోతుంది. కరోనా వైరస్ కేసులు విపరీతం అవ్వడంతో ఆ దేశంలో ఇప్పుడు ఎమర్జెన్సీ కూడా విధించారు. అసలు కరోనా కేసులు ఆ దేశంలో విపరీతం కావడానికి టోక్యో ఒలింపిక్సే కారణమా?

ఒలింపిక్స్ క్రీడలలో 204 దేశాల్లోని 11500 అథ్లెట్లు 33 క్రీడల్లో 339 పతకాంశాల్లో 17 రోజుల జరుగుతున్నాయి. ఒలింపిక్ ప్రపంచంలోనే గొప్ప విశ్వసమరం! చేపల్లా ఈదే స్విమ్మర్లు చిరుతల్లా పరుగెత్తే రన్నర్లు గురి చూసి కాల్చే షూటర్లు విన్యాసాలు చేసే వీరులు, చూడటానికి రెండు కళ్ళూ చాలవు అన్నట్లే ఉంటుంది. అందులో మన భారతీయ అథ్లెట్లు కేవలం 127 మంది మాత్రమే! అయితే, ఇంతమందిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఒలింపిక్స్ నిర్వాహకులు, ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా కూడా ఈ ఈవెంటే కరోనా సూపర్ స్ప్రెడర్స్‌ ఈవెంట్‌గా మారిందంటూ అభిప్రయాలు వినిపిస్తున్నాయి జపాన్‌లో.

వేర్వేరు దేశాలకు చెందిన కొంతమంది క్రీడాకారులు కరోనా బారినపడి.. పోటీ నుంచి తప్పుకోగా.. ఇప్పటివరకూ ఒలంపిక్స్ స్టేడియం వద్ద పరిస్థితులు మాత్రం బాగానే ఉన్నాయి. టోక్యో నగరంలో మాత్రం కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటివరకూ ఎన్నడూ లేనివిధంగా భారీగా సిటీలో కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లోనే కేవలం టోక్యోలోనే మూడు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. పెరుగుతున్న కేసులతో టోక్యోలోని ఆసుపత్రులపై మళ్లీ ఒత్తిడి పెరుగుతున్నట్టు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉంటే, ఒలింపిక్‌ గ్రామంలో ఇప్పటివరకు 241 మంది కరోనా బారిన పడ్డట్టు నిర్వహకులు తెలిపారు. ఇవాళ కొత్తగా మరో ఏడు కేసులు నమోదైనట్లు, ఇందులో నలుగురు అథ్లెట్లు కూడా ఉన్నట్లు ప్రకటించారు. ఒలింపిక్‌ గ్రామంలో కరోనా కేసులు చాపకింద నీరులా పాకుతుండటం ఒలింపిక్‌ నిర్వహకులతో సహా అథ్లెట్లను ఆందోళన చెందేలా చేస్తుంది. అయితే, ముఖ్యంగా డెల్టా వేరియంట్ కేసులు ఇక్కడ ఎక్కువగా నమోదవుతున్నాయి.