Cooking Oil Prices : యుక్రెయిన్‌-రష్యా యుద్ధం ఎఫెక్ట్.. భగ్గుమంటున్న వంటనూనెల ధరలు

పామ్ ఆయిల్‌ నూనె ఖరీదు రూ.116 నుంచి రూ.145కు పెరిగింది. అన్ని నూనెల కన్నా పామాయిల్‌ ధర గరిష్ఠంగా రూ. 29 పెరిగింది. వంటనూనెల వినియోగంలో భారత్.. ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది.

Cooking Oil Prices : యుక్రెయిన్‌-రష్యా యుద్ధం ఎఫెక్ట్.. భగ్గుమంటున్న వంటనూనెల ధరలు

Oil Price

Ukraine Russia war : యుక్రెయిన్‌, రష్యా మధ్య భీకర యుద్ధం సాగుతోంది. యుక్రెయిన్ పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. రష్యా బలగాల దాడులకు ధీటుగా యుక్రెయిన్ సైన్యం ప్రతిఘటిస్తోంది. ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం వంట నూనెలలపై తీవ్ర ప్రభావం చూపింది. వంటనూనెల ధరలు భగ్గుమంటున్నాయి. నెల వ్యవధిలోనే అన్ని రకాల వంటనూనెల ధరలు లీటర్‌కు రూ.20కి పైగా పెరిగాయి. జనవరిలో సన్‌ఫ్లవర్‌ నూనె లీటర్‌ ధర రిటైల్‌ మార్కెట్‌లో రూ.134 ఉండగా ఇప్పుడు రూ.157కు చేరింది. లీటర్‌ రూ.23 పెరగడం గమనార్హం.

వేరుశనగ నూనె ధర రూ.136 నుంచి 159కి చేరింది. పామ్ ఆయిల్‌ నూనె ఖరీదు రూ.116 నుంచి రూ.145కు పెరిగింది. అన్ని నూనెల కన్నా పామాయిల్‌ ధర గరిష్ఠంగా రూ. 29 పెరిగింది. వంటనూనెల వినియోగంలో భారత్.. ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నప్పటికీ, దేశీయ అవసరాలకు తగ్గట్టు ఉత్పత్తి జరగడం లేదు. ఏటా రూ.70 వేల కోట్ల విలువైన వంటనూనెలను దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ప్రతినెల దాదాపు 10 లక్షల టన్నుల నూనెలను దిగుమతి చేసుకోవాల్సివస్తుంది.

Ukraine Hunger Cries : రష్యాతో యుద్ధం కారణంగా యుక్రెయిన్‌లో ఆకలి కేకలు

ఒకవేళ యుద్ధం ముగిసినా మరో నెలపాటు ధరల పెరుగుదల కొనసాగుతుందని భావిస్తున్నారు. వరుసగా నూనెల ధరలు పెరుగుతుండటంతో పలువురు వ్యాపారులు స్టాక్‌ను బ్లాక్‌ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ముందు జాగ్రత్తలో భాగంగా చిన్న దుకాణాదారులు, వినియోగదారులు అధిక మొత్తంలో నూనెలను కొనుగోలు చేస్తున్నారు. ఆయిల్‌ దుకాణాల ముందుకు పెద్ద పెద్ద క్యూలు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని విజయ ఆయిల్‌స్టాల్‌లో ఒక్కరోజే రూ.8.50 లక్షల విలువైన నూనెను విక్రయించడం గమనార్హం. ఈ స్టాల్‌ను ప్రారంభించిన తరువాత ఈ స్థాయిలో అమ్మకాలు జరగడం ఇదే ప్రథమం.

సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ అధికంగా యుక్రెయిన్‌ నుంచి దిగుమతి అవుతోంది. అక్కడ యుద్ధం జరుగుతుండటంతో దిగుమతులపై ప్రభావం పడింది. సముద్ర, వాయుమార్గాలు మూతపడటంతో అక్కడి నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో నూనెల ధరల భగ్గుమంటున్నాయి. యుద్ధం కొనసాగితే లీటర్‌ ధర రూ.200 దాటిన ఆశ్చర్యపోనవసరం లేదని నూనెల కంపెనీల ప్రతినిధులు, ఆయిల్‌ఫెడ్‌ అధికారులు అంటున్నారు.

Russia Ukraine Discussions : రష్యా-యుక్రెయిన్‌ కీలక చర్చలు.. రష్యా ముందు యుక్రెయిన్ రెండు డిమాండ్లు

మరోవైపు రష్యా, యుక్రెయిన్‌ మధ్య చర్చలు విఫలం అయ్యాయి. బెలారస్‌ సరిహద్దు ఫ్యాపిట్‌ వేదికగా మూడున్నర గంటలకు పైగా రెండు దేశాల ప్రతినిధులు చర్చించారు. రష్యా నుంచి ఐదుగురు, యుక్రెయిన్ నుంచి ఆరుగురు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తక్షణమే యుద్ధం విరమించాలని యుక్రెయిన్‌ ప్రధానంగా డిమాండ్‌ చేసింది. రష్యా బలగాలు వెనక్కి వెళ్లాలని పట్టుబట్టింది.

క్రిమియా నుంచి కూడా రష్యన్ బలగాలు తొలగించాలన్న యుక్రెయిన్ డిమాండ్ చేసింది. అయితే ఇందుకు రష్యా కండిషన్స్ పెట్టింది. పలు ఒప్పందాలకు ఆమోదం తెలపాలని రష్యా డిమాండ్‌ చేసింది. నాటోలో చేరబోమని యుక్రెయిన్‌ లిఖితపూర్వక హామీ ఇవ్వాలని రష్యా కోరింది. ఇరుదేశాల ప్రతినిధులు తగ్గకపోవడంతో చర్చల్లో ఎలాంటి ముందడుగు పడలేదు.