Covid-19 Virus: కరోనా వైరస్ చైనా ల్యాబ్ నుంచి లీకైన వైరసే.. అమెరికా ఎనర్జీ డిపార్ట్‌మెంట్ నివేదిక.. ఖండించిన చైనా ..
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ చైనా ల్యాబ్ నుంచి లీక్ కారణంగానే సంభవించిందని యూఎస్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్ తేల్చి చెప్పింది. అయితే, ఈ విషయమై అమెరికన్ ఇంటలిజెన్స్ ఏజెన్సీలు కచ్చితమైన అభిప్రాయానికి రాలేకపోతున్నట్లు తెలుస్తోంది. యూఎస్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్ నివేదికపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.

US agency
Covid-19 Virus: రెండేళ్లపాటు ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికించిన విషయం విధితమే. ఈ వైరస్ భారినపడి ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పలు నివేదికల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఈ వైరస్ బారినపడి మరణించారు. రెండేళ్ల పాటు ఈ వైరస్ కారణంగా ప్రపంచ దేశాలు ఆర్థికంగానూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అయితే, ఈ వైరస్ చైనా నుంచి వ్యాప్తి చెందిందనే వాదన మొదటి నుంచి ఉంది. ఈ వాదనలను చైనా ఖండిస్తూ వస్తుంది. తాజాగా కొవిడ్ -19 చైనాలోని ల్యాంబ్ నుంచే లీకైనట్లు అమెరికాకు చెందిన ఎనర్జీ డిపార్ట్‌మెంట్ (యూఎస్‌డీఈ) నివేదిక స్పష్టంచేసింది. ఈ నివేదిక ప్రతులను శ్వేతసౌధం, కాంగ్రెస్ ముఖ్యులకు సంబంధిత విభాగం సమర్పించినట్లు వాల్‌స్ట్రీట్ జనరల్ వెల్లడించింది.
చైనాలోని వుహాన్ నగరంలోని హువానన్ మార్కెట్‌లో తొలిసారి కనిపించిన సార్స్ కోవ్ -2 వైరస్ 2019 చివరి నుంచి ప్రపంచమంతా వ్యాపించిందని నివేదిక పేర్కొంది. వైరస్ వ్యాప్తి ఎక్కడి నుంచి జరిగిందనే విషయంపై నిపుణుల మధ్య తీవ్ర చర్చలు జరిగాయని, నిఘా వర్గాల నివేదికలు వచ్చాయి. అయితే, వుహాన్‌లోని ప్రయోగశాలలో జరిగిన ప్రమాదం కారణంగానే వైరస్ బయటకు వచ్చినట్లు ఎఫ్‌బీఐ ఇచ్చిన నివేదికతో యూఎస్‌డీఈ నివేదిక ఏకీభవించింది. అయితే, ఈ నివేదిక బలమైన ఆధారాలతో కూడిలేదని, తన అభిప్రాయాన్ని పేలవంగా వ్యక్తపరిచిందని నివేదికను అధ్యయనం చేసిన వ్యక్తులు అభిప్రాయ పడ్డారు. ఈ క్రమంలో నాలుగు యూఎస్ ఇంటెలిజెన్సీలు కోవిడ్ సహజ ప్రసారం ద్వారా సంభవించాయని విశ్వసిస్తుండగా, మరో రెండు నిర్ణయించబడలేదని వాల్‌స్ట్రీట్ జర్నల్ నివేదించింది.
ఈ విషయంపై వైట్‌హౌస్ జాతీయ భద్రతా సలహారు జేక్ సలెవాన్ మాట్లాడుతూ.. వైరస్ ఎక్కడి నుంచి పుట్టిందనే విషయంపై ఇంటెలిజెన్స్ వర్గాలకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని అన్నాడు. దీనిపై స్పష్టత తీసుకురావాల్సిందిగా అధ్యక్షుడు జో బైడన్ ఆదేశించారని తెలిపారు. మరోవైపు ఈ నివేదికపై బీజింగ్ స్పందించింది.. ప్రయోగశాల నుంచి వైరస్ లీకైనట్లు మాట్లాడటం సరికాదని, ఈ వాదనలను రేకెత్తించడం ద్వారా, ఆ సమస్యను రాజకీయం చేయడాన్ని ఆపాలని సూచించింది. చైనా, డబ్ల్యూహెచ్ఓ నుండి ఉమ్మడి నిపుణులు రూపొందించిన అధికారిక శాస్త్రీయ నిర్ధారణల ద్వారా ప్రయోగశాల నుండి వైరస్ లీక్ సాధ్యం కాదని కొనుగొనడం జరిగిందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ గుర్తుచేశారు.