అమెరికాలో 3లక్షల 10వేలు దాటిన కరోనా కేసులు…రోజుకి వేల సంఖ్యలో మరణాలు

  • Published By: venkaiahnaidu ,Published On : April 5, 2020 / 06:17 AM IST
అమెరికాలో 3లక్షల 10వేలు దాటిన కరోనా కేసులు…రోజుకి వేల సంఖ్యలో మరణాలు

చైనాలోని వుహాన్ సిటీలో గతేడాది డిసెంబర్ లో మొదటిసారిగా వెలుగుచూసిన ప్రాణాంతక కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచంలోని 205 దేశాలకు వ్యాప్తిచెందింది. రోజు రోజుకూ తన వేగాన్ని పెంచుకుంటున్న కరోనా వైరస్.. వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. ప్రపంచంలోని సగానికిపైగా దేశాలు లాక్‌డౌన్‌లో కొనసాగుతున్నాయి. ఐరోపాతోపాటు అమెరికాలోనూ వైరస్ తీవ్రత ప్రబలంగా ఉంది.

అమెరికాలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. అగ్రరాజ్యం రోజురోజుకీ వేల సంఖ్యల్లో కేసులు,మరణాలు నమోదవుతున్నాయి. యునైటెడ్ స్టేట్స్ లో కరోనా కేసులు 3లక్షలు దాటాయి. కరోనా కేసులతో పాటు, మరణాల్లో కూడా ఇటలీ, స్పెయిన్‌లతో అమెరికా పోటీపడుతోంది. గత 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా 5,500 మంది మృతిచెందడం వైరస్ తీవ్రతకు అద్దంపడుతోంది.

ఇప్పటివరకు అమెరికాలో 3లక్షల 11వేల 625 కరోనా కేసులు నమోదుకాగా,8వేల 454మంది మరణించారు. అత్యధికంగా న్యూయార్క్ లో 1లక్షా 14వేల 775 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత న్యూజెర్సీలో 34వేల 124 కేసులు నమోదయ్యాయి. మిచిగాన్ లో 14వేల 225 కేసులు నమోదయ్యాయి. ఇక కాలిఫోర్నియాలో కూడా 13వేల 927 కేసులు నమోదయ్యాయి. ఫ్లోరిడాలో కూడా 11వేల 545 కేసులు నమోదయ్యాయి.

ఇక అమెరికాలో కరోనా మరణాల విషయానికొస్తే…మరణాల విషయంలో కూడా న్యూయార్క్ మొదటిస్థానంలో ఉంది. ఒక్క న్యూయార్క్ లోనే ఇప్పటివరకు 3వేల 565 మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాత న్యూజెర్సీలో అత్యధికంగా 846 మరణాలు నమోదయ్యాయి. 

ప్రపంచంలోనే కరోనా మరణాలు 24గంట్లలో అత్యధికంగా అమెరికాలోనే నమోదయ్యాయి. శనివారం ఒక్కరోజే అమెరికాలో 1,331 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క న్యూయార్క్‌ రాష్ట్రంలో 630 మంది మృతిచెందారంటే ప్రతి రెండున్నర నిమిషాలకు ఒకరు చనిపోయినట్లు లెక్క. అంతకుముందు గురువారంరాత్రి 8గంటల నుంచి శుక్రవారం రాత్రి 8గంటలవరకు అమెరికాలో 1,408కరోనా మరణాలు నమోదయ్యాయి. ప్రపంచంలో మరే దేశంలోనూ 24 గంటల్లో ఇంత ప్రాణనష్టం జరగలేదు.

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చినప్పుడు ఇంట్లో తయారు చేసుకున్న మాస్కులనైనా ఉపయోగించాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సూచించారు. వైద్యపరమైన మాస్కులను మాత్రం వైద్య సిబ్బంది కోసం వదిలిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. 

కరోనా పురుడు పోసుకున్న చైనా.. కరోనా కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన ఇటలీ, స్పెయిన్‌ల కంటే కూడా అమెరికాలోనే కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం అమెరికన్లలో ఆందోళన కలిగిస్తొంది. అమెరికా కరోనాతో పూర్తిస్థాయిలో పోరాడుతోందని… అయితే మహమ్మారి ధాటికి 2,40,000 అమెరికన్లు మృత్యువాత పడే అవకాశం ఉందని వైట్ హౌస్ హెచ్చరించింది. అయితే దాదాపు 1లక్షమంది వరకు కరోనా మరణాలు నమోదయ్యే అవకాశముందని ఇటీవల ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే.

ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు 65వేల మంది ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య 12 లక్షలు దాటిపోయింది. అయితే ఈ 12లక్షల కేసుల్లో 3లక్షలకు పైగా కేసులు ఒక్క అమెరికాలోనే నమోదయ్యాయి. వచ్చే రెండు వారాల్లో మరిన్ని మరణాలను చూస్తామంటూ స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేయడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

ఇక ప్రపంచంలోనే అత్యధికంగా ఇటలీలోనే కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. ఇటలీలో ఇప్పటివరకు కరోనా మరణాల సంఖ్య 15,361కు చేరుకోగా… శనివారం మరో 800 మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. కొత్తగా దాదాపు 5,000 మందిలో వైరస్ నిర్ధారణ కావడంతో బాధితుల సంఖ్య 124,632కి చేరింది. అయితే, ఇటలీలో వైరస్ సంక్రమణ నెమ్మదించడం ఊరట కలిగించే అంశం.