Agnipath: 3 వేల ఉద్యోగాలకు నోటిఫికేష‌న్.. 9.55 ల‌క్ష‌ల‌ మంది ద‌ర‌ఖాస్తులు

అగ్నిప‌థ్ ప‌థ‌కం కింద భార‌త నౌకాద‌ళంలో 3,000 ఉద్యోగాల భ‌ర్తీ కోసం నోటిఫికేష‌న్ వెలువ‌డ‌గా 9.55 ల‌క్ష‌ల‌ మంది ద‌ర‌ఖాస్తులు చేసుకున్నారు. వారిలో 82,200 మంది మ‌హిళ‌లు ఉన్నారని అధికారులు తెలిపారు. ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ ముగిసింద‌ని చెప్పారు. జూలై 1 నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించారు.

Agnipath: 3 వేల ఉద్యోగాలకు నోటిఫికేష‌న్.. 9.55 ల‌క్ష‌ల‌ మంది ద‌ర‌ఖాస్తులు

Agnipath: అగ్నిప‌థ్ ప‌థ‌కం కింద భార‌త నౌకాద‌ళంలో 3,000 ఉద్యోగాల భ‌ర్తీ కోసం నోటిఫికేష‌న్ వెలువ‌డ‌గా 9.55 ల‌క్ష‌ల‌ మంది ద‌ర‌ఖాస్తులు చేసుకున్నారు. వారిలో 82,200 మంది మ‌హిళ‌లు ఉన్నారని అధికారులు తెలిపారు. ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ ముగిసింద‌ని చెప్పారు. జూలై 1 నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించారు. త్రివిధ ద‌ళాల్లో నియామ‌కాల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశపెట్టిన అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని జూన్ 14న ప్ర‌వేశ‌పెట్టిన విషయం తెలిసిందే.

ఈ ప‌థ‌కం కింద నాలుగేళ్ళు మాత్ర‌మే విధుల్లోకి తీసుకోవ‌డం ఏంటంటూ దేశ వ్యాప్తంగా ఉద్యోగార్థులు పెద్ద ఎత్తున నిరస‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించారు. అయిన‌ప్ప‌టికీ, ఈ ప‌థ‌కం కింద ఉద్యోగాల్లో చేర‌డానికి యువ‌త‌ నుంచి భారీగా స్పంద‌న వ‌స్తోంది. అగ్నిప‌థ్ ప‌థ‌కం కింద భార‌తీయ వైమానిక ద‌ళం కూడా ఇప్ప‌టికే నియామ‌కాల ప్ర‌క్రియ ప్రారంభించగా, దీనికి కూడా భారీగా ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. 3,000 ఉద్యోగాల భ‌ర్తీ కోసం నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌గా, మొత్తం 7,50,000 మంది ద‌రఖాస్తు చేసుకున్నారు.

కాగా, బీజేపీ పాలిత రాష్ట్రాలు అగ్నివీర్ల కోసం ప‌లు కీల‌క‌ ప్ర‌క‌ట‌న‌లు చేశాయి. ఈ ప‌థ‌కం కింద ఉద్యోగం చేసి వ‌చ్చిన వారికి రాష్ట్ర పోలీసు ద‌ళాల్లో ప్రాధాన్యం ఇస్తామ‌ని చెప్పాయి. అలాగే, అగ్నిప‌థ్‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌ల్లో పాల్గొని, హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డ్డవారిని త్రివిధ ద‌ళాల్లోకి తీసుకోబోమ‌ని ఇప్ప‌టికే సంబంధిత‌ అధికారులు స్ప‌ష్టం చేశారు.