Fertilisers : పెట్రో ధరల ఎఫెక్ట్.. రైతుల నెత్తిన పిడుగు.. భారీగా పెరిగిన ఎరువుల ధరలు

రైతుల నెత్తిన పెను భారం పడనుంది. ధరలు విపరీతంగా పెరగనున్నాయి. ఇప్పటికే పెరిగిన పెట్టుబడి ఖర్చుతో సతమతమవుతున్న అన్నదాతపై కంపెనీలు భారీ ఎత్తున ధరల భారం మోపాయి.

Fertilisers : పెట్రో ధరల ఎఫెక్ట్.. రైతుల నెత్తిన పిడుగు.. భారీగా పెరిగిన ఎరువుల ధరలు

Fertilisers To Take Toll On Farmers

Fertilisers to take toll on farmers : రైతుల నెత్తిన పెను భారం పడనుంది. ఎరువుల ధరలు విపరీతంగా పెరగనున్నాయి. ఇప్పటికే పెరిగిన పెట్టుబడి ఖర్చుతో సతమతమవుతున్న అన్నదాతపై ఎరువుల కంపెనీలు భారీ ఎత్తున ధరల భారం మోపాయి. డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచాలని కంపెనీలు నిర్ణయించడంతో అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల తయారీకి అవసరమైన ముడిసరుకులు, పెట్రో ధరల పెంపు ప్రభావమే ఎరువుల ధరల పెంపునకు కారణం అని కంపెనీలు చెబుతున్నాయి.

ఇప్పటికే పలు కంపెనీలు పెంచిన ధరలను ప్రకటించగా.. మరికొన్ని ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నాయి. పెరిగిన ధరలను ఈ నెల(ఏప్రిల్) నుంచే అమలు చేయనున్నట్టు కంపెనీలు ప్రకటించాయి. రైతులు ప్రధానంగా ఉపయోగించే డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువులపై ఒక్కో బస్తాపై కనీసంగా రూ.450 పెంచాయి. పెరిగిన ధరలను ఇఫ్కో కంపెనీ బుధవారం(ఏప్రిల్ 7,2021) ప్రకటించింది. డీఏపీ ధర అత్యధికంగా రూ.1,900గా నిర్ణయించింది. ప్రస్తుతం దీని ధర రూ.1,200 ఉండగా.. ఏకంగా రూ.700 పెంచింది. కాంప్లెక్స్‌ ఎరువులకు సంబంధించి కనీసం రూ.450 పెంచింది. యూరియా ధర నిర్ణయం కేంద్రం చేతుల్లో ఉండటం ప్రస్తుతానికి ధర పెరగలేదు.

జూన్ నుంచి ప్రారంభం అయ్యే కరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే.. డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచాలని కంపెనీలు నిర్ణయించాయి. హోల్ సేల్ వ్యాపారులకు ఈ మేరకు సమాచారం అందించాయి కంపెనీలు. ఎరువుల ధరల పెంపు సుమారు 58శాతం ఉండటంతో అన్నింటి ధరలు భారీగా పెరగనున్నాయి. డై అమోనియం పాస్పేట్(DAP) 50 కిలోల బస్తా ఎమ్మార్పీ ప్రస్తుతం రూ.1200 ఉండగా, పెరిగిన ఉత్పత్తి వ్యయంతో రూ.1900 కి చేరుతుందని వ్యాపారులు పంపిన సమాచారంతో ఇఫ్కో కంపెనీ తెలిపింది.

ప్రస్తుతం రిటైల్, హోల్ సేల్ వ్యాపారుల దగ్గర నిల్వ ఉన్న సరుకుని పాత ధరలకే అమ్మాలని, ఏప్రిల్ 1 నుంచి సరఫరా అయ్యే వాటికి మాత్రమే కొత్త ధరలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఇఫ్కో మాత్రమే కాదు ఇతర కంపెనీలు కూడా ధరలు పెంచుతున్నట్టుగా జిల్లాల్లోని వ్యాపారులకు సమాచారం ఇచ్చాయి. ఆయా కంపెనీలు డీఏపీ ధరలు రూ.1200 నుంచి రూ.1700 వరకు పెంచాయి.

వాస్తవానికి డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల తయారీకి అవసరమైన పాస్పారిక్‌, అమ్మోనియాను చైనా, అరేబియాతోపాటు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అయితే అక్కడ వీటి ధరలు భారీగా పెరిగాయి. పాస్పారిక్‌ యాసిడ్‌ ధర ప్రస్తుతం టన్నుకు 689 డాలర్లు ఉండగా అది ఏకంగా 795 డాలర్లకు పెరిగిందని కంపెనీలు తెలిపాయి. తాజా పెంపుతో సాగు వ్యయం గణనీయంగా పెరగనుంది. రైతులపై తీవ్రమైన భారం పడనుంది. డీఏపీ సహా పెరిగే అన్నింటి ధరలను పరిగణలోకి తీసుకుంటే ఎకరాకి కనీసం రూ.2వేల అదనపు భారం పడే అవకాశం ఉందని వ్యవసాయవర్గాలు అంటున్నాయి. వరి సాగు చేసే రైతులపై ఈ భారం దాదాపు మూడు వేల వరకు ఉంటుంది.

ఇఫ్కో కంపెనీ నిర్ణయించిన ధరలు..
(50 కేజీ బస్తా రూ..ల్లో)
ఎరువు రకం పాతధర కొత్త ధర పెరుగుదల
డీఏపీ 1,200 1,900 700
10-26-26 1,175 1,775 600
12-32-16 1,185 1,800 615
20-20-0-13 925 1,350 425
15-15-15 1,040 1,500 460