Ajinkya Rahane : విండీస్‌తో టెస్టు సిరీస్‌లో విఫ‌ల‌మైన ర‌హానే.. పుజారా గ‌తే ప‌డుతుందా..?

వెస్టిండీస్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ముగిసింది. క్లీన్ స్వీప్ చేయాల‌న్న భార‌త జ‌ట్టు ఆశ‌ల‌పై వ‌రుణుడు నీళ్లు చ‌ల్లాడు. 1-0 తో సిరీస్ భార‌త్ సొంత‌మైంది. కాగా..ఈ సిరీస్‌లో టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు అజింక్య ర‌హానే ఘోరంగా విఫ‌లం అయ్యాడు.

Ajinkya Rahane : విండీస్‌తో టెస్టు సిరీస్‌లో విఫ‌ల‌మైన ర‌హానే.. పుజారా గ‌తే ప‌డుతుందా..?

Ajinkya Rahane

Rahane : వెస్టిండీస్‌(west indies)తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ముగిసింది. క్లీన్ స్వీప్ చేయాల‌న్న భార‌త జ‌ట్టు ఆశ‌ల‌పై వ‌రుణుడు నీళ్లు చ‌ల్లాడు. 1-0 తో సిరీస్ భార‌త్ సొంత‌మైంది. కాగా..ఈ సిరీస్‌లో టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు అజింక్య ర‌హానే(Ajinkya Rahane) ఘోరంగా విఫ‌లం అయ్యాడు. ఓ వైపు అత‌డి ఫామ్ క‌ల‌వ‌ర‌పెడుతుండ‌గా మ‌రో వైపు జ‌ట్టులో అత‌డి స్థానం ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. అయితే.. మ‌రో ఐదు నెల‌ల వ‌ర‌కు టీమ్ఇండియా టెస్టు మ్యాచ్‌లు ఆడ‌దు. ప్ర‌పంచ క‌ప్ ముగిసిన త‌రువాత ఈ ఏడాది చివ‌రిలో దక్షిణాఫ్రికాతోనే ఆడ‌నుంది. ఇది ఒక్క‌టే ర‌హానేకు ఊర‌ట నిచ్చే అంశం.

పేల‌వ ఫామ్‌తో జ‌ట్టులో చోటు కోల్పోయిన ర‌హానే దాదాపు 18 నెల‌ల పాటు టీమ్ఇండియాకు దూరం అయ్యాడు. ఐపీఎల్ 2023 సీజ‌న్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున దుమ్మురేపడంతో డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్‌కు భార‌త జ‌ట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఓవ‌ల్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో మిగిలిన భార‌త బ్యాట‌ర్లు అంద‌రూ విఫ‌లం అయిన‌ప్ప‌టికీ ర‌హానే మాత్రం అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో అత‌డిని వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌కు ఎంపిక చేశారు. అదే స‌మ‌యంలో డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌లో విఫ‌లం అయిన సీనియ‌ర్ ఆట‌గాడు ఛ‌తేశ్వ‌ర పుజారా పై వేటు ప‌డింది.

Team India: డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఇండియాను దాటేసిన పాకిస్థాన్ .. భారత్ ఏ స్థానంలో ఉందంటే?

వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌కు ఎంపిక చేయ‌డ‌మే కాకుండా ర‌హానేకు వైస్ కెప్టెన్‌గా నియ‌మించారు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ర‌హానేకు రెండు ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసే అవ‌కాశం వ‌చ్చింది. అయితే.. 8, 3 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఘోరంగా విఫ‌లం అయ్యాడు. ఇప్ప‌టికే ర‌హానేకు జ‌ట్టులో చోటు ఇవ్వ‌డంతో పాటు వైస్ కెప్టెన్సీ ఇవ్వ‌డాన్ని ప‌లువురు మాజీ ఆట‌గాళ్లు త‌ప్పుబ‌డుతున్నారు. అత‌డి స్థానంలో యువ ఆట‌గాళ్లు అవ‌కాశాలు ఇవ్వాల‌ని సూచిస్తుండ‌గా ర‌హానే ఘోర ప్ర‌ద‌ర్శ‌న‌తో జ‌ట్టులో త‌న స్థానాన్ని ప్ర‌శ్నార్థకం చేసుకున్నాడు.

పుజారా గ‌తే..?

వెస్టిండీస్ సిరీస్‌లో రహానే జంట వైఫల్యాల తర్వాత భారత జట్టు మేనేజ్‌మెంట్ క‌ఠిన నిర్ణ‌యం తీసుకుంటుందా..? లేదా అన్న‌దే ఇప్పుడు ఉన్న ప్ర‌శ్న‌. ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో ర‌హానే కీల‌కంగా మారుతాడ‌ని ఇటీవ‌ల టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్ర‌మ్ రాథోడ్ వ్యాఖ్యానించిన నేప‌థ్యంలో అత‌డికి సఫారీ ప‌ర్య‌ట‌న‌లో చోటు ద‌క్కే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అయితే అది అంత ఈజీ కాదు. ఈ ప‌ర్య‌ట‌న‌కు ఐదు నెల‌ల స‌మ‌యం ఉంది. ఈ లోగా ర‌హానే మ‌ళ్లీ దేశ‌వాలీ మ్యాచులు ఆడి స‌త్తా చాటాల్సిన అవ‌స‌రం ఉంది. లేదంటే అజిత్ అగార్కర్‌లో నేతృత్వంలోని సెల‌క్ష‌న్ క‌మిటీ క‌ఠిన నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయి. సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ వంటి యువ ఆట‌గాళ్లు అవ‌కాశాల కోసం ఎదురుచూస్తున్న నేప‌థ్యంలో సీనియ‌ర్ ఆట‌గాళ్లు అయిన ర‌హానే, పుజారాల‌ను మ‌ళ్లీ టీమ్ఇండియాలో చూడ‌డం క‌ష్ట‌మే కావొచ్చు.

India vs West Indies 2nd Test: టీమిండియా ఆశలపై నీళ్లు చల్లిన వరుణుడు.. డ్రాతో సరిపెట్టుకున్న భారత్.. సిరీస్ కైవసం