Snake Bites Deaths in India : భారత్ లో పాము కాటుతో 20 ఏళ్లలో 12లక్షలకు పైగా మరణాలు

పాములు పగపడతాయా? పగతో వెంటాడి మరీ కాటేస్తాయా?  పాముకాటుతో దేశంలో లక్షలాదిమంది మరణిస్తున్నారని WHO రిపోర్టులో పేర్కొంది. పాములు పగ పట్టటం వల్లనే భారత్ లో ఇంతమంది పాముకాటుతో మరణిస్తున్నారా? అనే చర్చ కొనసాగుతోంది.

Snake Bites Deaths in India : భారత్ లో పాము కాటుతో 20 ఏళ్లలో 12లక్షలకు పైగా మరణాలు

Snake Bites Deaths in India

Snake Bites Deaths in India : పాములు పగపడతాయా? పగతో వెంటాడి మరీ కాటేస్తాయా?  అనే చర్చ ఇప్పటిది కాదు. పాము పగలపై ఏళ్లుగా ఇది నడుస్తూనే ఉంది. ఐతే ప్రపంచ ఆరోగ్య సంస్థ బయటపెట్టిన ఓ రిపోర్టు.. ఇప్పుడు పాము పగలను తన రిపోర్టుతో మళ్లీ హైలైట్ చేసింది. పాముకాటుతో దేశంలో చోటుచేసుకుంటున్న మరణాలు.. ఆ చర్చ మళ్లీ మొదలయ్యేలా చేస్తోంది. ఇంతకీ WHO రిపోర్టులో ఏముంది.. మనుషుల మీద నిజంగా పాములు పగపట్టాయా ?

పాములు పగపడతాయా లేదా అనే చర్చ ఇప్పటిదీ కాదు.. సర్పదోశ నివారణలు ఇప్పటికీ జరుగుతుంటాయ్ మనదేశంలో ! పాము పగపడితే 12 ఏళ్ల వరకు వదలదని చాలామంది భయం. ఐతే అది నిజం అనడానికి ఎలాంటి ఆధారాలు లేకపోయినా.. ప్రపంచఆరోగ్య సంస్థ బయటపెట్టిన కొన్ని లెక్కలు ఇప్పుడు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయ్. భారతదేశంలో పాము కాటు మరణాలు భారీగా నమోదవుతున్నాయన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్ట్ ఇప్పుడు.. షాక్ కలిగిస్తోంది. పదులు, వందలు కాదు.. ఏకంగా వేలల్లో మరణాలు సంభవించడం ఇప్పుడు మరిన్ని భయాలకు కారణం అవుతోంది. అధికారిక లెక్కలే ఇలా ఉంటే.. అధికారికంగా ఎంత మంది చనిపోతున్నారన్న చర్చ కూడా వినిపిస్తోంది.

2వేల సంవత్సరం నుంచి 2019వరకు.. 20ఏళ్లలో ఏకంగా 12లక్షల మంది పాముకాటుతో ప్రాణాలు వదిలారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అంటే ఏడాదికి సుమారుగా 58 వేల మంది చనిపోతున్నారు. ప్రభుత్వ లెక్కల్లోకి రాని పాముకాటు మరణాలు… దేశంలో పెద్ద ఎత్తున ఉన్నాయని WHO చెప్తోంది. పెద్దసంఖ్యలో పాముకాటు మరణాలు సంభవిస్తున్నా… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని తగ్గించి చూపించే ప్రయత్నం చేస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం… 2017లో 1068 మంది, 2018లో 1060మంది, 2019లో 885 మంది చనిపోయారు. ఐతే వాస్తవం అందుకు భిన్నంగా ఉందని WHO తెలిపింది. కేంద్రం లెక్కల్లో చూపించిన దానికంటే పాముకాటు మరణాల సంఖ్య 60రెట్లు ఎక్కువ అన్నది WHO అంచనా.

Also read : Snake Bite Treatment in India : పాముకాటుకు భారత్ లో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది..?

కట్ల పాము, తాచు పాము, రెండు రకాల రక్తపింజర కారణంగా.. పాముకాటుతో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయ్. ప్రస్తుతం పాముకాటుకు విరుగుడు యాంటీ వీనం తయారుచేస్తున్న కంపెనీలు నాలుగే ఉన్నాయని… వాటి తయారీలోనూ క్వాలిటీ ఉండడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది. భారతదేశంలో అవసరానికి తగ్గట్టుగా మెడిసిన్ ఉత్పత్తి జరగడం లేదని తెలిపింది. పాముకాటుతో మరణాలకు గురవుతున్న వారు కొందరైతే… మరణాలతో పోలిస్తే పది రెట్లు ఎక్కువగా బాధితులు అంగవైకల్యానికి గురి అవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. పాము కాటు కేసుల్లో 30శాతం మందికి.. పూర్తి స్థాయిలో విషం శరీరంలోకి వెళ్తుందని WHO గుర్తించింది. పాముకాటుకు గురైన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లే సౌకర్యాలు గ్రామాల్లో లేకపోవడమే దీనికి కారణం అని WHO నివేదికలో తెలిపింది.

చాలా గ్రామాల్లో పాముకాటుకు గురైన వెంటనే పసరు వైద్యం తీసుకుంటున్నారని… అది కూడా మరణాలకు కారణం అవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది. 80 శాతం పాముకాటు జూన్, సెప్టెంబర్ నెలల మధ్యలోనే జరుగుతున్నాయ్. వానాకాలం కావడంతో రైతులు, కూలీలు పొలాలకు వెళ్తూ ఉండడమే దీనికి కారణం. ఇక పది శాతం పాముకాట్లు నిద్రపోయే టైమ్‌లో జరుగుతున్నాయ్. 14శాతం కేసుల్లో పాము కరిచిన జాడలు కనిపించడం లేదు. 10 నుంచి 19 ఏళ్ల వయసు వారు ఎక్కువగా పాము కాటుకు గురవుతున్నారు. పాము కాటు మరణాలలో 90శాతం గ్రామాల్లోనే సంభవిస్తన్నాయ్. ఇక దేశంలో సంభవించే మరణాలలో 0.5 శాతం పాముకాటుతోనే జరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాలు బయటపెట్టింది.