Asthma : ఆస్తమాతో జాగ్రత్త! ఎందుకొస్తుందో తెలుసా?

ఆరోగ్యకరమైన అలవాట్లు, వ్యాయామం, పోషకాహారం తీసుకున్నట్లయితే ఆస్తమా బాధించదు. రాత్రివేళ, ఉదయం సమయాల్లో శ్వాసకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి.

Asthma : ఆస్తమాతో జాగ్రత్త! ఎందుకొస్తుందో తెలుసా?

Asthma

Asthma : దీర్ఘకాలిక శ్వాసకోశ ఇబ్బందినే ఆస్తమా అంటారు. ఆస్తమా వ్యాధిగ్రస్తులలో అలర్జీ రియాక్షన్ ద్వారా ఊపిరితిత్తులలో గాలిమార్గానికి అడ్డంకులు ఏర్పడి శ్వాసపీల్చుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. పిల్లికూతలు, దగ్గు, ఆయాసం, ఛాతీలో నొప్పి తదితర లక్షణాలు ప్రధానంగా కనిపిస్తుంటాయి. శ్వాసకోశమార్గంలో వాపు, శ్వాసకోశ మార్గం కుచించుకపోవడం వల్ల ఆస్తమా వస్తుంది. పెరుగుతున్న పారిశ్రామీకరణ, ఆహారపుటలవాట్లు, వాయుకాలుష్యం వల్ల ఆస్తమాతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇటీవలి కాలంలో పట్టణ ప్రాంత వాసుల్లో ఈ సమస్య అధికంగా ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

పుట్టిన వయస్సు నుండి ఏ వయస్సు వారికైనా ఈ వ్యాధి వస్తుంది. పిల్లల్లో తరచు జలుబు, దగ్గు, ఆయాసం వస్తుంటాయి. తోటి పిల్లల వలె పరుగెత్తలేకపోవటం, మెట్లు ఎక్కుతున్నప్పుడు కాని ఆడుతున్నప్పుడు కానీ ఆయాసం వస్తుంటుంది. వ్యాయామం చేస్తున్నపుడు, ఆటలు ఆడుతున్నప్పుడు మాత్రమే కొంతమందిలో ఆస్తమా వస్తుంది. దీనిని ఎక్సర్‌సైజ్‌ ఇండ్యూస్డ్‌ ఆస్తమా అంటారు. అసిడిటీ, గ్యాస్‌ ప్రాబ్లమ్‌ ఉన్నవారిలో కూడా ఆస్తమా వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పనుల ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారికి , మానసిక ఆందోళన, ఒత్తిడిలాంటి మానసిక సమస్యలు ఉన్నవారికి కూడా ఆస్తమా వస్తుంది.

ఆస్తమా అనేది దుమ్ము, ధూళి, డస్ట్‌మైట్‌, పుప్పొడి, పొగ, చలిగాలి, వైరస్‌, వ్యాయామం, ఉద్వేగం వంటి వాటి వల్ల వస్తుంది. చాలా మందిలో ఆస్తమా జలుబుతో మొదలయ్యి తరువాత గొంతునొప్పి, గొంతులో నసగా ఉండడం, స్వరం మారడం జరుగుతుంది. కొంత మందిలో తరచుగా తుమ్ములు, ముక్కు దిబ్బడేయడం, నీరు కారటం, కంట్లో దురద, చర్మంపై దద్దుర్లు ఎలర్జిక్‌ డెర్మటైటిస్‌, ఎక్జి మా, లాంటి చర్మవ్యాధులు వస్తాయి. రాత్రిళ్ళు దగ్గు ఆయాసం ఎక్కువగా ఉండటం మూలాన వీరికి సరిగా నిద్ర పట్టదు. శ్వాస సరిగా అందక గాలికోసం నిద్ర నుండి లేచి కూర్చోవటం వంటివి లక్షణాలు కనిపిస్తాయి.

ఆరోగ్యకరమైన అలవాట్లు, వ్యాయామం, పోషకాహారం తీసుకున్నట్లయితే ఆస్తమా బాధించదు. రాత్రివేళ, ఉదయం సమయాల్లో శ్వాసకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ఎక్కువ శారీరక శ్రమలేకుండా చూసుకోవడం అవసరం. దుమ్ము, ధూళి, పొగ, చల్లటి వాతావరణంకు దూరంగా ఉండాలి. ఇంటి పరిసరాలు, ప్లాస్టిక్‌బ్యాగ్స్, కార్పెట్స్, బెడ్‌షీట్స్, బ్లాంకెట్స్‌లలో పరాన్న జీవులు ఉంటాయి. పది రోజులకొకసారి ఎండలో వేయడం, శుభ్రంగా ఉతుక్కోవాలి. పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి. ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనిపించిన వెంటనే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించటం మంచిది. వారు సూచించిన విధంగా చికిత్స పొందటం వల్ల సమస్య నుండి బయటపడవచ్చు.