Corona Vaccine : త్వరలోనే అందుబాటులోకి మరో టీకా
దేశంలో త్వరలోనే మరో కరోనా టీకా అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న బయోలాజికల్-ఈ తయారు చేస్తోన్న కార్బెవాక్స్ టీకా నవంబర్ చివరినాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Carbevox vaccine : దేశంలో త్వరలోనే మరో కరోనా టీకా అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న బయోలాజికల్-ఈ తయారు చేస్తోన్న కార్బెవాక్స్ టీకా నవంబర్ చివరినాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా వ్యాక్సిన్ విడుదల చేసే రోజే దాదాపు 10కోట్ల డోసులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం తయారవుతోన్న డోసులను పరీక్ష కోసం సెంట్రల్ డ్రగ్స్ లాబోరేటరీకి పంపించినట్లు బయోలాజికల్-ఈ తెలిపింది.
కార్బెవాక్స్ టీకా మూడో దశ ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ప్రయోగాల సమాచారం విశ్లేషణ కూడా నవంబర్ చివరినాటికి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. అనంతరం మరో నెలలో చిన్నారుల టీకా లైసెన్సు ప్రక్రియను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం చిన్నారులపై ప్రయోగాలు కొనసాగుతున్నాయని ఆ సంస్థ వెల్లడించింది.
China Vaccination for Above 3 Years : మూడేళ్ల చిన్నారులకు టీకా వేసేందుకు చైనా ప్రయత్నాలు
ప్రస్తుతం కొనసాగుతోన్న మూడో దశ ప్రయోగాల సమాచారాన్ని ఇప్పటికే అనుమతి పొందిన వ్యాక్సిన్ల సమాచారంతోనూ పోల్చి చూస్తున్నామని పేర్కొంది. ప్రతిఏటా దాదాపు వంద కోట్ల కార్బెవాక్స్ డోసులను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నట్లు తెలిపింది. కరోనా వైరస్ను ఎదుర్కొనే వ్యాక్సిన్ ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు బయోలాజికల్ ఇ లిమిటెడ్ ప్రయత్నాలు చేస్తోంది.
ఇందుకు అమెరికా ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా దాదాపు 50 మిలియన్ డాలర్లతో ఉత్పత్తి కేంద్రాన్ని విస్తరించేందుకు అమెరికా ఇంటర్నేషనల్ డెవలెప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్తో బయోలాజికల్ ఇ ఒప్పందం కుదుర్చుకుంది.