Congress Protest : రాహుల్ గాంధీపై అనర్హతను నిరసిస్తూ.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు

రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దును నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రాహుల్ నోరు నొక్కేసే ఉద్ధేశంతో ప్రభుత్వం మెరుపు వేగంతో వ్యవహరించి అనర్హత వేటు వేసిందని ఆరోపిస్తున్నారు.

Congress Protest : రాహుల్ గాంధీపై అనర్హతను నిరసిస్తూ.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు

CONGRESS

Updated On : March 25, 2023 / 11:13 AM IST

Congress Protest :ప్రధాన మోదీ (PM Modi) ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను రెండేళ్ల జైలు శిక్ష ఎదుర్కొన్న కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. 2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా తేలినందున రాహుల్ గాంధీ లోక్‭సభకు అనర్హుడయ్యాడు. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం ఆయనపై అనర్హత వేటు (disqualification) వేశారు. దీంతో ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు లోక్‭సభ సెక్రెటేరియట్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.

రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దును నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రాహుల్ నోరు నొక్కేసే ఉద్ధేశంతో ప్రభుత్వం మెరుపు వేగంతో వ్యవహరించి అనర్హత వేటు వేసిందని ఆరోపిస్తున్నారు. రాహుల్ పై అనర్హత నిర్ణయం వెలువడగానే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయక్వం పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం అయ్యింది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన మల్లికార్జున ఖర్గె, ప్రియాంక గాంధీ, కేసి వేణుగోపాల్, జయరాం రమేష్, రాజీవ్ సుక్లా, ఇతర సీనియర్ నేతలు భేటీ అయ్యారు.

Rahul Disqualification: అనర్హత వేటుపై రాహుల్ గాంధీ తొలి రియాక్షన్ ఇదే..

తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై నేతలు చర్చించారు. రాహుల్ గాంధీపై అనర్హతను నిరసిస్తూ జన్ ఆందోళనను నిర్వహించాలని నిర్ణయించారు. అదానీ వ్యవహారంతో సహా వివిధ అంశాలపై గళం విప్పినందుకే రాహుల్ పై కేంద్రం ఈ చర్యను చేపట్టిందని జయరాం రమేష్ ఆరోపించారు. భారత్ జోడో యాత్ర విజయవంతం కావడాన్ని మోదీ సర్కార్ జీర్ణించుకోలేక పోయిందని విమర్శించారు. ఈ అంశంపై విపక్ష పార్టీల మద్దతును స్వాగతిస్తున్నామని చెప్పారు. పతిపక్షాల ఐక్యతను ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది.

లోక్ సభ, రాజ్యసభల్లోని ఆయా పార్టీల నేతలతో ఖర్గే ఎప్పటికప్పుడు సమావేశం అవుతున్నారు. ఇప్పుడు పార్లమెంట్ వెలుపల కూడా సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర విభాగాలు నిరసన కార్యక్రమాలు చేపడుతాయన్నారు. రాహులపై అనర్హత వేటు అంశాన్ని త్వరలోనేపై కోర్టులో అప్పీల్ చేస్తామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింగ్వి స్పష్టం చేశారు. సూరత్ కోర్టు ఇచ్చిన 170 పేజీల తీర్పును పూర్తిగా అర్థం చేసుకొనే ప్రయత్నంలో ఉన్నామన్నారు.

Rahul Disqualification: అనర్హత వేటు ఎందుకు పడుతుంది? రాహుల్ గాంధీ విషయంలో ఏం జరిగింది?

సూరత్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు, ఆందోళనకు సిద్ధం అవుతుంది. ఇందులో భాగంగానే మండలస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా నిరసన కార్యచరణకు రంగం సిద్ధం చేస్తుంది. దీని కోసం కమిటీని కూడా ఏఐసీసీ వేయబోతుంది. దేశ వ్యాప్తంగా ఏ విధంగా బీజేపీ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి, రాహుల్ గాంధీ గొంతు నొక్కివేయడం, కాంగ్రెస్ పార్టీని అణిచివేయడం ఏ విధంగా చేస్తుందన్న అంశాలపై ఒక కమిటీని వేయబోతుంది.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఒక భారీ నిరసన ర్యాలీ నిర్వహించబోతుంది. కేవలం రాహుల్ గాంధీ అనర్హత వేటు విషయం ఒక్కటే కాదు గడిచిన తొమ్మిది ఏళ్లల్లో మోదీ ప్రభుత్వ నిర్ణయాలు, విధానాల అన్నింటిపై ప్రజల్లోకి వెళ్లాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇందులో భాగంగానే రాహుల్ గాంధీపై అనర్హత వేటు జీఎస్టీ, అలాగే నోట్ల రద్దు ఇలాంటి ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు, అదానీ స్కామ్ పై ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించారు.  పార్లమెంట్ లో అదానీతో మోదీ ఉన్న ఫోటోలను రాహుల్ గాంధీ ఫిబ్రవరి 11వ తేదీన బడ్జెట్, ముఖ్యంగా రాష్ట్రపతి ధన్యవాద తీర్మానం ప్రసంగం సందర్భంగా ఆయన ప్రదర్శించారు.

CM KCR: దేశ చరిత్రలో ఇదో చీకటి రోజు.. రాహుల్ గాంధీ అనర్హత వేటుపై సీఎం కేసీఆర్.. ఖండించిన కేటీఆర్, కవిత

అప్పటికే రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. రాహుల్ గాంధీని పార్లమెంట్ లో లేకుండా చేయాలని చూస్తున్నారు. అనేక అంశాలపైన పార్లమెంట్ లోపల, బయట మోదీని, బీజేపీ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ నిలదీస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక కుట్ర పూరితంగానే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. న్యాయపరంగా పోరాడేందుకు సమయం ఇవ్వకుండా లోక్ సభ సెక్రటరీ జనరల్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. దీనిపైన న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు.