Harish Rao : దమ్ముంటే.. అంబర్ పేట చౌరస్తాకు రా.. కిషన్ రెడ్డికి హరీశ్ సవాల్

బహిరంగ చర్చకు తాము సిద్ధమే అన్న హరీశ్ రావు.. కిషన్ రెడ్డితో చర్చకు కేసీఆర్ స్థాయి అవసరం లేదన్నారు. కిషన్ రెడ్డి.. అంబర్ పేట చౌరస్తాకు వస్తే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్..

Harish Rao : దమ్ముంటే.. అంబర్ పేట చౌరస్తాకు రా.. కిషన్ రెడ్డికి హరీశ్ సవాల్

Harish Rao

Harish Rao : తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. సవాళ్లు విసురుకుంటున్నారు. ఇరు పార్టీల నేతలు తమ డైలాగులతో రాజకీయాలను వేడెక్కించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తగ్గేదేలే అంటూ కేంద్రంతో సమరానికి సై అంటున్నారు. అటు బీజేపీ నేతలు కూడా ఘాటుగా బదులిస్తున్నారు. మోదీ సర్కార్ పనితీరుపై బహిరంగ చర్చకు రావాలని సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన సవాల్ కు తెలంగాణ మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు.

బహిరంగ చర్చకు తాము సిద్ధమే అన్న హరీశ్ రావు.. కిషన్ రెడ్డితో చర్చకు కేసీఆర్ స్థాయి అవసరం లేదన్నారు. కిషన్ రెడ్డి.. అంబర్ పేట చౌరస్తాకు వస్తే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ వస్తారని చెప్పారు. దమ్ముంటే.. అంబర్ పేట చౌరస్తాకు రావాలని కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. తెలంగాణ కోసం రాజీనామా చేయకుండా పారిపోయిన వ్యక్తి కిషన్ రెడ్డి అని హరీశ్ రావు అన్నారు. అమరవీరుల గురించి మాట్లాడే నైతికత కిషన్ రెడ్డికి ఉందా? అని ప్రశ్నించారు మంత్రి హరీశ్ రావు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు.. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే కిషన్ రెడ్డి కేంద్రమంత్రి అయ్యారని చెప్పారు. కేసీఆర్ వల్లే కేంద్రమంత్రి అయ్యావ్ అని కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు మాట్లాడుకునే భాషనే కేసీఆర్ మాట్లాడతారని హరీశ్ రావు పేర్కొన్నారు. మీలాగా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కేసీఆర్ మాట్లాడరని చెప్పారు. ఉపాధి హామీ పథకానికి కోత ఎందుకు పెట్టారని కేసీఆర్ అడిగితే తప్పా? అని మంత్రి ప్రశ్నించారు.

CM KCR : త్వరలో కొత్త జాతీయ పార్టీ..!-కేసీఆర్ సంచలనం

‘తెలంగాణ వద్దని.. జై ఆంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహిస్తానని అనలేదా? తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఎండల లక్ష్మీ నారాయణ గెలుపుకు ప్రచారం చేయలేదు. మతాల మధ్య చిచ్చు పెట్టే భాష మీది.. మా భాష ఉద్యమ సమయం నుంచి అదే. బీజేపీ నేతలు ప్రజలను బానిసలుగా చూస్తున్నారు. పాకిస్తాన్ పాచిక పాత బడింది… దాన్ని బీజేపీ నేతలు వదిలేయాలి. కిషన్ రెడ్డి తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు తెస్తే… మేము స్వాగతిస్తాం… అభినందిస్తాం. నదుల అనుసంధానం పేరుతో తెలంగాణ నీటిని పక్క రాష్ట్రాలకు మళ్లించే యత్నం కేంద్రం చేస్తోంది. దీన్ని మేము సమర్ధించాలా?
ఈరోజు తెలంగాణ ప్రయోజనాలను మేము అడిగితే… పక్క రాష్ట్రాల కోసం కిషన్ రెడ్డి అడుగుతున్నారు. పాలమూరు, సీతారామ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదు? పిలవని పేరంటానికి పాకిస్తాన్ వెళ్లి బిర్యానీ ఎవరు తిన్నారో చెప్పాలి? మీ ఎమ్మెల్యే రాజసింగ్ భాష ఏమిటో తెలుసుకో. దీన్ని మీరు సమర్థిస్తారా? తల్లిని, స్త్రీని అవమానపరిచే వాళ్లు దేశ భక్తులా? ప్రతి చెల్లి, అక్క ఆత్మగౌరవాన్ని అవమాన పరిచారు. అసోం సీఎం హిమంత బిశ్వ భాష మీకు అందంగా కనిపిస్తోంది. ఓటు వేయకపోతే చంపేస్తామనేది ఎవరి భాష? అని హరీశ్ రావు నిప్పులు చెరిగారు.

గత ఏడేళ్ల పాల‌న‌లో మోదీ ప్రభుత్వం దేశానికి చేసిందేమీ లేదన్న కేసీఆర్ ఆరోపణలపై మంత్రి కిష‌న్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఈ ఏడేళ్ల కాలంలో ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించిందని, ఈ విషయాన్ని చర్చలో నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్‌ అభ్యంతరకర పదజాలంతో దూషిస్తున్నార‌ని, నిరాశతోనే ప్రధానిపై విషం చిమ్ముతున్నారని చెప్పారు. కేసీఆర్ వాడుతున్న భాష ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగదన్నారు. బీజేపీని దేశం నుంచి తరిమికొడతామని కేసీఆర్ చెప్పడాన్ని కిషన్ రెడ్డి ఖండించారు. భూమ్మీద ఏ శక్తీ దీన్ని చేయలేదని తేల్చి చెప్పారు. రేపు అధికారం కోల్పోయినా బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా కొనసాగుతుందని తెలిపారు.

CM KCR : BJPకి వ్యతిరేకంగా ఏకమవ్వటానికి ప్రాంతీయ పార్టీల ప్లాన్..దీదీ,మహారాష్ట్ర సీఎంలతో కేసీఆర్ భేటీ..

2016లో ఉరీ ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్‌పై జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ కు సంబంధించి తనకు రుజువు చూపాలని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో ప్రకంపనలు రేపాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు దేశ భద్రత, సమగ్రతను దెబ్బతీసేలా ఉన్నాయని కిషన్ రెడ్డి మండిపడ్డారు. “కేసీఆర్ అమరవీరులను అవమానించారు. అత్యున్నత త్యాగం చేసిన వారి కుటుంబాల మనోభావాలను దెబ్బతీశారు” అని కిష‌న్ రెడ్డి విమ‌ర్శించారు. కేసీఆర్ ఉప‌యోగిస్తున్న భాష‌ను పాకిస్తాన్ కూడా ఉప‌యోగించ‌ద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.