Monkeypox : మంకీ పాక్స్‌పై కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నత స్ధాయి సమావేశం

దేశంలో నాలుగో మంకీపాక్స్ కేసు నమోదైన నేపధ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.

Monkeypox : మంకీ పాక్స్‌పై కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నత స్ధాయి సమావేశం

Monkeypox

Monkeypox : దేశంలో నాలుగో మంకీపాక్స్ కేసు నమోదైన నేపధ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. దీనిపై చర్చించేందుకు ఈరోజు మధ్యాహ్నం ఆరోగ్య శాఖ డైరెక్టర్ జరనల్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మంకీపాక్స్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించిన మర్నాడే ఈ సమావేశం జరగడం  ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ భేటీలో మంకీపాక్స్ నివారణకు, ముందుజాగ్రత్త చర్యగా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించినట్లు తెలుస్తోంది. దేశంలో కరోనా తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న సమయంలో మరో కొత్త వ్యాధి వెలుగు చూస్తుండటం ఆందోళనకు గురి చేస్తోంది.  ఢిల్లీలో ఆదివారం నమోదైన కొత్త కేసుతో కలిపి దేశంలో మొత్తం మంకీపాక్స్ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది.

అయితే తాజాగా ఈ వ్యాధి సోకిన 34 ఏళ్ల వ్యక్తికి విదేశాల్లో పర్యటించిన చరిత్ర లేదు. జ్వరం, చర్మంపై దద్దుర్లతో రెండు రోజుల క్రితం ఢిల్లీలోని    లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్  ఆస్పత్రిలో చేరాడు. శనివారం రోగి శాంపిల్స్ సేకరించి పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించగా.. ఆదివారం వచ్చిన రిపోర్టులో పాజిటివ్ అని తేలింది. ఈ వ్యక్తిని ప్రత్యేక ఐసోలేషన్ లో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు చెప్పారు.

ఈ వ్యక్తి ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లోని మనాలీలో జరిగిన పార్టీకి వెళ్లి వచ్చినట్లుగా గుర్తించారు. కాగా ఈరోజు మంకీ పాక్స్ నిర్ధారణ అయిన వ్యక్తి కాంటాక్ట్ లిస్టు అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం  రోగి  ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉన్నట్లు  హాస్పటల్ డైరెక్టర్ సురేష్ కుమార్ తెలిపారు. అంతకు ముందు నమోదైన మూడు మంకీపాక్స్‌ కేసులు కేరళలోనే వెలుగు చుశాయి. వీరిలో ఇద్దరు యూఏఈలో పర్యటించగా.. ఒకరు దుబాయ్ నుంచి వచ్చారు.

మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా WHO  శనివారం ప్రకటించింది. అన్ని దేశాలు అప్రమత్తమై తక్షణమే వేగవంతమైన చర్యలు చేపట్టాలని సూచించింది. 75 దేశాలలో 16 వేల మంకీ పాక్స్ కేసులు ఇంత వరకు వెలుగు చూశాయి. మంకీ పాక్స్ కారణంగా ఇంతవరకు ఐదుగురు మరణించినట్లు అధికారిక లెక్కలు చెపుతున్నాయి.    అంతర్జాతీయ సమాజమంతా ఏకమై ఈ వ్యాధిపై పోరాడాలని, వ్యాక్సిన్లు, మందుల సాయం అందించుకోవాలని పేర్కొంది.  ఈ రోజు జరిగిన సమావేశానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సిడిసి) మరియు ఐసిఎంఆర్ అధికారులు హాజరయ్యారు.

Also Read : Bill Gates: మంకీపాక్స్ కూడా బిల్‌గేట్స్ కుట్రే.. నిజం ఏంటి?