ITR Filing : ఐటీ రిటర్న్‌ల గడువు పొడిగింపుపై తేల్చి చెప్పిన కేంద్రం

2021-22 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి  ఆదాయపన్ను  రిట‌ర్న్స్ దాఖ‌లు చేయ‌డానికి గ‌డువు తేదీని  పొడిగించేది లేదని కేంద్రం తేల్చి చెప్పింది.

ITR Filing : ఐటీ రిటర్న్‌ల గడువు  పొడిగింపుపై  తేల్చి చెప్పిన కేంద్రం

Itr Filing

ITR Filing :  2021-22 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి  ఆదాయపన్ను  రిట‌ర్న్స్ దాఖ‌లు చేయ‌డానికి గ‌డువు తేదీని  పొడిగించేది లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నెలాఖ‌రులోగా ప‌న్ను చెల్లింపుదారులు త‌ప్ప‌నిస‌రిగా తమ ఐటీ రిట‌ర్న్స్   స‌బ్‌మిట్ చేయాల్సిందేన‌ని కేంద్ర రెవెన్యూ శాఖ కార్య‌ద‌ర్శి త‌రుణ్ బ‌జాజ్ శుక్ర‌వారం స్ప‌ష్టం చేశారు.

జూలై 20 నాటికి 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రం అంచ‌నాలు (2020-21 ఆర్థిక సంవ‌త్స‌రం) ఐటీ రిట‌ర్న్స్‌ను 2.3 కోట్ల మందికి పైగా ప‌న్ను చెల్లింపుదారులు దాఖ‌లు చేశార‌ని, రోజురోజుకు ఐటీఆర్ దాఖ‌లు చేసే వారి సంఖ్య పెరుగుతోందని త‌రుణ్ బ‌జాజ్ చెప్పారు.  2021, డిసెంబ‌ర్ 31 నాటికి గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో 5.89 కోట్ల ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌ల‌య్యాయ‌ని త‌రుణ్ బ‌జాజ్ తెలిపారు.

ప‌న్ను చెల్లింపుదారులు ప్ర‌తి ఏటా  మాదిరిగానే ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేయ‌డానికి గడువు పొడిగిస్తార‌ని భావిస్తున్నారు. అందుకే ప్రారంభ ద‌శ‌లో ఐటీఆర్ ఫైలింగ్స్ చాలా నెమ్మ‌దిగా ఉన్నాయ‌న్నారు త‌రుణ్ బ‌జాజ్‌. ప్ర‌తి రోజూ 15 ల‌క్ష‌ల నుంచి 18 ల‌క్ష‌ల ఐటీ రిట‌ర్న్స్ స‌బ్మిట్ అవుతున్నాయ‌ని ఆయన తెలిపారు. మున్ముందు రోజూ 25 నుంచి 30 ల‌క్ష‌ల రిట‌ర్న్స్ దాఖ‌ల‌వుతాయ‌ని ఆయన చెప్పారు.

సాధార‌ణంగా ప‌న్ను చెల్లింపుదారులు ప్ర‌తియేటా ఐటీఆర్ దాఖ‌లు చేయ‌డానికి తుది గడువు వ‌ర‌కు వెయిట్ చేస్తుంటారు. గ‌త ఏడాది 9-10 శాతం మంది చివ‌రి రోజు ఐటీఆర్ స‌బ్మిట్ చేశారు. మేం చివ‌రి రోజు 50 ల‌క్ష‌ల‌కు పైగా ఐటీఆర్‌లు అందుకున్నామని ఆయన తెలిపారు. ఈ సారి చివ‌రి రోజు కోటి ఐటీఆర్‌లు స్వీక‌రించేందుకు సిద్ధంగా ఉండాల‌ని మా శాఖ సిబ్బందికి, అధికారుల‌కు సూచ‌న‌లు చేశానని త‌రుణ్ బ‌జాజ్ తెలిపారు.

ఆదాయపన్ను నిబంధనల ప్రకారం తమ ఖాతాలను ఆడిట్ చేయాల్సిన అవసరం లేని   వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్‌లను దాఖలు చేయడానికి గడువు తదుపరి ఆర్థిక సంవత్సరం జూలై 31.   ITR ద్వారా, ఒక వ్యక్తి భారత ఆదాయపు పన్ను శాఖకు సమర్పించవలసి ఉంటుంది.  ఇది వ్యక్తి యొక్క ఆదాయం మరియు సంవత్సరంలో చెల్లించాల్సిన పన్నుల గురించిన వివరాలను కలిగి ఉంటుంది. గత రెండేళ్లలో ప్రజలు కోవిడ్ తో    ఇబ్బందులు పడుతున్నందున  అప్పుడు ఐటీ రిటర్న్ లు దాఖలు చేసే గడువు పెంచామని ఇప్పుడు అలాంటి ఆలోచన ఏమీ లేదని  తరుణ్ బజాజ్  తెలిపారు.