RS Praveen Kumar : గృహలక్ష్మి పథకంతో ఎలాంటి లాభమూ లేదు, తెలంగాణలో వచ్చేది బీఎస్పీ ప్రభుత్వమే- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నెల రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుందని.. ఎన్నికల కోసమే హడావిడిగా స్కీమ్ లు, స్కామ్ లు చేస్తున్నారని కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. RS Praveen Kumar - CM KCR

RS Praveen Kumar - CM KCR
RS Praveen Kumar – CM KCR : బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కొమురంభీం జిల్లా కౌటాలలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో హోం మినిస్టర్ ఉన్నాడా? లేడా? అనే అనుమానం కలుగుతోందన్నారు. సంఘ సేవకులకు, అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. పోలీసుల ఎదుటే దాడులు జరుగుతున్నా అడిగే వారు లేరు, పట్టించుకునే వారులేరని ఆవేదన వ్యక్తం చేశారు.
నెల రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుందని.. ఎన్నికల కోసమే హడావిడిగా స్కీమ్ లు, స్కామ్ లు చేస్తున్నారని కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు ప్రవీణ్ కుమార్. గృహలక్ష్మి పథకంతో ప్రజలకు లాభం జరిగే పరిస్థితే లేదని ఆయన తేల్చి చెప్పారు. ఎన్నికల్లో లబ్ది పొందడం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ గృహలక్ష్మి స్కీమ్ తీసుకొచ్చారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
తుమ్ముడిహెట్టి వద్ద ప్రాజెక్టు కడితే ఈ ప్రాంతానికి ఎంతో మేలు జరిగేదన్నారు. తుమ్ముడిహెట్టి ప్రాజెక్టును తరలించారు, వార్దా ప్రాజెక్టు అని కాలయాపన చేస్తున్నారు అని ధ్వజమెత్తారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీఎస్పీ జెండా ఎగరడం ఖాయం అని, బీఎస్పీ ప్రభుత్వమే వస్తుందని ఆర్ఎప్ ప్రవీణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.
ఇళ్లు లేని నిరుపేదల కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకమే గృహలక్ష్మి స్కీమ్. ఈ పథకం కింద సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునే పేదలకు రూ.3 లక్షలు ఆర్థిక సాయం అందిస్తుంది ప్రభుత్వం. ఆగస్టు 10 వరకు తొలి విడతల దరఖాస్తులు స్వీకరించారు. ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ ముగియడంతో వడపోతకు రెడీ అయ్యారు అధికారులు. ఈ పథకానికి సంబంధించి ఆగస్టు 10 వరకు ఊహించని రీతిలో అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే తొలి విడతలో ప్రతీ నియోజవర్గానికి 3వేల ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయి. దీంతో లబ్ధిదారుల ఎంపిక అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది.