Onion : ఉల్లిసాగులో చీడపీడల నివారణ

తామర పురుగులకు ఆశ్రయమిచ్చే వెల్లుల్లి, క్యాబేజి, పత్తి, టమాట, దోస మొదలగు పంటలను సాగుచేయరాదు. పంట చుట్టూ రెండు వరుసల మొక్కజొన్న లేదా లోపలి వరుస తము మరియు బయట వరుస మొక్కజొన్నలను రక్షక పంటలుగా వేయాలి.

Onion : ఉల్లిసాగులో చీడపీడల నివారణ

Onion Farming (1)

Onion : యాసంగి కూరగాయల పంటల్లో వాణిజ్యపరంగా ప్రధానమైన కూరగాయ పంటం ఉల్లి. తెలుగు రాష్ట్రాల్లో సైతం ఉల్లి సాగును రైతులు చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఉల్లి సాగులో చీడపీడల కారణంగా నాణ్యత తగ్గిపోయి మార్కెట్‌లో సరైన ధర లభించడం లేదు. నాణ్యమైన అధిక దిగుబడులు పొందుటకు రైతులు సరైన సాగు యాజమాన్యపద్దతులను పాటించాల్సిన అవసరం ఉంది. ఉల్లి సాగుకు నీరు నిల్వని సారవంతమైన మెరక నెలలు ఉల్లిసాగుకు అనుకూలంగా ఉంటాయి. ఉప్పు, చౌడు, క్షారత్వం, నీరు నిల్వ ఉండే నేలలు పనికిరావు. పంట తొలిదశ నుంచే సాగులో సరైన పద్దతులు అనుసరిస్తే అధిక దిగుబడులు పొందవచ్చు.

ఉల్లిసాగులో చీడపీడలు ;

తామర పురుగులు: తామర పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చివేయడం వల్ల తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. దానితో పాటుగా ఆకులపై, కాడలపై ఊదారంగు మచ్చలు కూడా ఏర్పడతాయి. ఈ పురుగు ఉదృతి ఎక్కువగా ఉన్నప్పుడు సుడులుగా ఎండిపోవడం చూడవచ్చు. తామర పురుగులకు ఆశ్రయమిచ్చే వెల్లుల్లి, క్యాబేజి, పత్తి, టమాట, దోస మొదలగు పంటలను సాగుచేయరాదు. పంట చుట్టూ రెండు వరుసల మొక్కజొన్న లేదా లోపలి వరుస తము మరియు బయట వరుస మొక్కజొన్నలను రక్షక పంటలుగా వేయాలి. దీని నివారణకు నీలిరంగు జిగురు అట్టలను ఎకరాకు 10`15 చొప్పున పొలంలో పైరు కంటే ఒక అడుగు ఎత్తులో అమర్చుకోవాలి. పురుగు ఉదృతిని బట్టి ఎకరాకు 400 మి.లీ. ఫిప్రోనిల్‌ లేదా 300 గ్రా. ఎసిఫేట్‌ లేదా 80 గ్రా. థయోమిధాక్సామ్‌ లేదా 200 గ్రా. డైఫెన్‌ధియురాన్‌ , అసిటామిప్రిడ్‌ లేదా 400 గ్రా. ఎసిఫేట్‌ , ఇమిడాక్లోప్రిడ్‌ లేదా 60 మి.లీ.స్పైనోశాడ్‌ లేదా 160 మి.లీ. స్పైనోటోరమ్‌ మందులను మార్చి మార్చి పిచికారీ చేయాలి.

నులిపురుగులు: నులిపురుగులు మొక్కలో కణజాలాన్ని తిని మొక్కలో అంతర పరాన్న జీవులుగా నివసిస్తాయి. ఇవి భూమిలో అధికంగా ఉంటే కుళ్ళ లక్షణాలను గమనించవచ్చు. నులిపురుగులు ఆశించిన నారు లేతఆకుపచ్చ లేదా పసుపురంగుకు మారి మెలికలు తిరుగుతాయి. లేత ఉల్లిపాయలు మెత్తబడి ఆకారం కోల్పోతాయి. ఈ పురుగు ఉధృతి అధికమైనప్పుడు గడ్డ పగులుతుంది. దీని నివారణకు కార్బోఫ్యూరాన్‌ 4 జి గుళికలు ఎకరాకు 10-12 కిలోల చొప్పున భూమిలో వేసి కలియ దున్నాలి.

ఉల్లి ఈగ : ఉల్లి ఈగ, ఉల్లి మొలకల మీద గుడ్లు పెట్టడం వలన అవి పొదిగి మొలకలను తింటాయి. తరువాత దశలో లార్వాలు గడ్డ భాగాన్ని ఆశించి నాశనం చేస్తాయి. గడ్డ్డ పెరుగుదల దశలో లార్వాలు ఉల్లిగడ్డలో సొరంగాలు చేసే పంటని నాశనం చేసి నష్టపరుస్తాయి. మొక్కలను దగ్గర దగ్గరగా నాటకూడదు. పంట మార్పిడి పద్ధతిని తప్పనిసరిగా అనుసరించాలి. దీని నివారణకు ఎకరానికి 400 మి.లీ. డైమిథోయేట్‌ లేదా 400 మి.లీ. ప్రొఫెనోఫాస్‌ మందును పిచికారీ చేయాలి.

ఆకుతినే పురుగు: ఈ లద్దె పురుగు బూడిద రంగులో ఉండి నల్లని చారలు కలిగి ఉంటుంది. ఈ లద్దెపురుగు ఆకులను తినడం వల్ల ఆకు కాడపై రంధ్రాలు గమనించవచ్చు. దీని నివారణకు మరియు 400 మి.లీ. క్లోరోఫైరిఫాస్‌ లేదా 60 మి.లీ. ఫ్లూబెండామైడ్‌ లేదా 80 మి.లీ. క్లోరాంట్రనిలిప్రోల్‌ మందును పిచికారి చేసుకోవాలి.

ఎర్రనల్లి: నల్లులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చుతాయి. ఆకుల పై భాగాన చిన్న చిన్న రంధ్రాలు గమనించవచ్చు. నల్లి వల్ల ఆకులపైన ఏర్పడే తెల్లని గూళ్ళ లాంటివి గమనించవచ్చు. తరువాత దశలో ఆకుల రంగు మారి ఎండిపోయి రాలిపోతాయి. దీని నివారణకు ఉల్లి పంటకు ప్రసొపార్‌ గైట్‌ 1 మి.లీ. లేదా స్పైరోమెసిఫైన్‌ 0.75 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.