Pests In Brinjal : వంగసాగులో చీడపీడలు…నివారణ

పిల్ల పురుగులు గుంపులుగా ఆకుల అడుగు భాగాన చేరి పత్రహరితాన్ని గోకి తినడం వల్ల అకులు జల్లైడలా తయారవుతాయి. ఈ పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకుల ఈనెలు మాత్రమే.

Pests In Brinjal : వంగసాగులో చీడపీడలు…నివారణ

Brinjal (1)

Pests In Brinjal : అన్నికాలాల్లో సాగు చేయటానికి అనువైన కూరగాయ పంట వంగ, ఇటీవలి కాలంలో కూరగాయలకు మంచి డిమాండ్ ఏర్పడటంతో చాలా మంది రైతులు కూరగాయల సాగువైపు మొగ్గు చూపుతున్నారు. అన్ని వాతావరణాలకు అనుకూలమైన పంట కావటంతో వంగసాగును రైతులు చేపడుతున్నారు. సరైన సస్యరక్షణ చర్యలు , జాగ్రత్తలు పాటిస్తే వంగసాగులో నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు. ముఖ్యంగా వంగలో వచ్చే చీడపీడలు, వాటి నివారణ గురించి రైతులు అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది.

వంగలో చీడపీడలు;

కాయతొలుచు, మొవ్వ తొలచు పురుగు ; వంగ పంటను ఆశించే పురుగుల్లో అతి ముఖ్యమైనది కాయ తొలుచు పురుగు. ఈ పురుగు నాటిన 30-40 రోజుల నుండి పంటను ఆశించి, నుమారుగా 10-80 శాతం వరకు నష్టం కలుగజేస్తుంది. మొక్క పెరిగే దశలో మొవ్వును, తర్వాత దశలో కాయలను తొలిచి వేస్తుంది. కొమ్మల చివర్ల పెరుగుదల ఆగిపోతుంది. కాయలు వంకర్లు తిరుగుతాయి. తల్లి పురుగులు ఆకుల అడుగు భాగంలో గుడ్లు పెడతాయి. గుడ్డ నుంచి బయటకు వచ్చిన పిల్ల పురుగులు కొమ్మలను, పూలను, కాయలను నష్టపరుస్తాయి.

దీని నివారణకు నారుమడి నుంచి నారును ప్రధాన పొలంలో నాటే ముందు మొక్క వేర్లను రైనాక్సిఫైర్‌ 0.5 మి.లీ. లీటరు నీటికి కలిపి 3 గంటలు నానబెట్టి తర్వాత నాటుకోవాలి. పురుగును గుర్తించిన మొదటి దశలోనే ఆశించిన కొమ్మలను తుంచి కాల్చివేయాలి. పొలంలో లింగాకర్షక బుట్టలను ఎకరాకు 10 చొప్పున అమర్చితే మగ పురుగులు, అకర్షితమై, బుట్టలో పడి చనిపోతాయి. ఈ బుట్టల ద్వారా పురుగు యొక్క ఉనికి, ఉధృతి తెలుసుకొని సరైన నమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టుకోవచ్చు. పూతదశలో వేపనూనె 5 మి.లీ. లీటరు నీటికి కలిపి మొక్కలపై పిచికారి చేసుకోవాలి. వేపనూనె తల్లి పురుగులకు వికర్షికంగా పనిచేసి గుడ్లను పెట్టకుండా అరికడుతుంది. వురుగు ఉధృతి గమనించుకొని స్పైనోసాడ్‌ 0.3 మి.లీ.లేదా క్లోరాంట్రనిలిప్రోల్‌ 0.3 మి.లీ.లేదా ఫ్లూబెండియమైడ్‌ 0.2 మి.లీ. లీటరు నీటికి కలిపి పది రోజుల వ్యవధిలో పిచికారి చేసుకోవాలి.

అక్షింతల పురుగు ; పిల్ల పురుగులు గుంపులుగా ఆకుల అడుగు భాగాన చేరి పత్రహరితాన్ని గోకి తినడం వల్ల అకులు జల్లైడలా తయారవుతాయి. ఈ పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకుల ఈనెలు మాత్రమే. మిగిలి మొక్కలు ఎండిపోతాయి. గుడ్లను, పిల్ల పురుగులను ఏరి నాశనం చేయాలి. పురుగు ఆశించిన వెంటనే వేప నూనె 5 మి.లీ. లీటరు నీటికి కలిపి మొక్కలపై పిచికారి చేసుకోవాలి.

ఎర్రనల్లి ; ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వల్ల అకులు పాలిపోయి తెల్లగా మారుతాయి. ఆకులపై సాలెగూడు. వంటి తీగలు ఏర్పడతాయి. వీటి నివారణకు లీటరు నీటికి ౩గ్రా.నీటిలో కరిగే గంధకం లేదా 5 మి.లీ. డైకోఫాల్‌ లేదా ౩ మి.లీ. స్పైరోమెసిఫెన్‌ లేదా 3 మి.లీ ప్రోపర్‌ గైట్‌ కలిపి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసుకోవాలి.

నులి పురుగులు ; ఈ వురుగులు ఆశించిన పంట వేర్లపై వేరు బుడిపెలు కనపడతాయి. ఇవి ఆశించిన మొక్కలు తక్కువగా పెరిగి పేలగా ఉండి, తక్కువ కాయలు కాస్తాయి. వీటి నివారణకు తప్పనిసరిగా ఒక ఏడాది పాటు బంతిపూల వంటతో పంట మార్చిడి చేసుకోవాలి. తట్టుకునే రకాలను మాత్రమే సాగు చేసుకోవాలి.