Ginger Seed Collection : అల్లం విత్తన సేకరణలో జాగ్రత్తలు

కొంత మంది రైతులు అల్లంలో అధిక దిగుబడి సాధించేందుకు పంటకాలం పూర్తయిన తర్వాత మరో 6 నెలలపాటు భూమిలోనే వుంచుతారు. ఈ విధానంలో దుంప తిరిగి మొలకెత్తి కొత్త చిల్ల దుంపలు వృద్ధితో పంట దిగుబడి 50శాతం వరకు పెరుగుతుంది.

Ginger Seed Collection : అల్లం విత్తన సేకరణలో జాగ్రత్తలు

Ginger Seed Collection

Ginger Seed Collection : సుగంధ ద్రవ్య పంటగా అల్లం సాగుకు ఇటీవల ప్రాధాన్యత పెరుగుతోంది. వాణిజ్య సరళిలో దీని సాగుకు రైతులు ముందడుగు వేస్తున్న నేపధ్యంలో ఏఏడుకాఏడు అల్లం సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. ఈ పంట సాగుకోసం ప్రస్థుతం  విత్తనం సేకరించే సమయం. ఈ దశలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

READ ALSO : Trichoderma viride : ట్రైకోడెర్మా విరిడె తో తెగుళ్ల నివారణ

పచ్చి అల్లాన్ని సుగంధ ద్రవ్యంగా, ఎండబెట్టిన అల్లాన్ని పొడిచేసి వివిధ పధార్ధాలు ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు. అల్లం వినియోగం పెరగటంతో పంట పండించిన రైతుకు కాసుల పంట పండిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో దీని విస్తీర్ణం సుమారు 6 వేల ఎకరాలు మాత్రమే వుండటం కూడా, అల్లానికి మంచి రేటు రావటానికి కారణంగా కన్పిస్తోంది. ఐదేళ్ల క్రితం కిలో అల్లానికి రైతు స్థాయిలో 100 రూపాయిలు పైన ధర పలకటంతో రైతులు మంచి ఫలితాలు సాధించారు.

ఈ ఏడాది ప్రస్థుతం కిలో ధర 40 రూపాయలుగా వుంది. సాధారణంగా అల్లం సాగుకు విత్తనం రేటునుబట్టి, ఎకరాకు లక్షన్నర వరకు ఖర్చవుతుంది. కనీసంగా 100క్వింటాళ్ల దిగుబడిని సాధించవచ్చు. మంచి యాజమాన్య పద్ధతులు పాటించిన రైతాంగం ఎకరాకు 150 నుంచి 250 క్వింటాళ్ల దిగుబడిని నమోదుచేస్తున్నారు. దీంతో కిలోకు 30 రూపాయల ధర సాధించిన ఆర్ధికంగా మంచి ఫలితాలు సాధించే అవకాశం వుంది. తెలంగాణలో మెదక్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో అధికంగా అల్లాన్ని సాగుచేస్తుండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం, కృష్ణా, తూర్పుగోదావరి, జిల్లాల్లో ఎక్కువగా సాగుచేస్తున్నారు.

READ ALSO : Allaneredu : తక్కువ పెట్టుబడి దీర్ఘకాలిక అదాయం… అల్లనేరేడుసాగులో ప్రకాశం రైతు

ఏప్రెల్ మొదటి వారం నుంచి జూన్ మొదటి పక్షం వరకు అల్లం విత్తుకునే అవకాశం వుంటుంది. ప్రాంతాల వారీగా విత్తే సమయంలో పెద్దగా మార్పులుండవు. అల్లం విత్తేందుకు పచ్చి దుంపను వినియోగించాల్సి వుంటుంది. ఎకరాకు 800 నుంచి 1000కిలోల విత్తనపు దుంప అవసరమవుతుంది. ఈ నేపధ్యంలో కొత్తగా అల్లం సాగు చేపట్టే రైతులు విత్తనం సేకరించేందుకు సమాయత్త మవుతున్నారు. సాధారణంగా అల్లం పంటకాలం 7-8 నెలలు వుంటుంది. అంటే జూన్ నెలలో విత్తితే జనవరి కల్లా పంట పూర్తవుతుంది. ఈసమయంలో విత్తనం సేకరించి ఏప్రెల్, మే నెల వరకు పచ్చిదుంపను నిల్వచేయాలంటే చాలా కష్టం.

అయితే కొంత మంది రైతులు అల్లంలో అధిక దిగుబడి సాధించేందుకు పంటకాలం పూర్తయిన తర్వాత మరో 6 నెలలపాటు భూమిలోనే వుంచుతారు. ఈ విధానంలో దుంప తిరిగి మొలకెత్తి కొత్త చిల్ల దుంపలు వృద్ధితో పంట దిగుబడి 50శాతం వరకు పెరుగుతుంది. దీన్ని  మోడెం పంట అంటారు. మెదక్ జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో ఈ విధానం ఆచరణలో వుంది. అయితే అల్లం విత్తన సేకరణలో రైతులు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. నాణ్యమైన విత్తనాన్ని చీడపీడలు సోకని పొలం నుంచి సేకరించాలి. విత్తనాన్ని ఏప్రిల్ నుండి జూన్ మొదటి పక్షంలో నాటతారు కాబట్టి నిల్వలో తగిన మెళకువలు పాటించాలి.

READ ALSO : Bitter Gourd Cultivation : పందిరి కాకర సాగుతో.. అధిక లాభాలు పొందుతున్ననెల్లూరు జిల్లా రైతు

సేకరించిన విత్తన దుంపలను వారం పదిరోజుల పాటు నీడలో ఆరబెట్టాలి. ఆ ఆతర్వాత పరిశుభ్రమైన ప్రదేశంలో నీడలో శంకాకారంలో కుప్పగా పోసి పైన గొనెపట్టాలు కప్పి, నిల్వ వుంచాలి. ఆరుబయట ఎండతగిలే ప్రదేశంలో విత్తనం నిల్వచేయకూడదు. చెట్టు నీడన, కొట్టాల్లో నిల్వచేసే పరిస్థితి వుండాలి. విత్తనంపై వేపాకు లేదా వరిగడ్డి కప్పి,  తరువాత ఎర్రమట్టి, పేడ కలిపిన లేపనాన్ని పైన అలికినట్లయితే  నాణ్యత చెడకుండా నాణ్యమైన విత్తనాన్ని పొందే వీలుంటుంది.

విత్తనం నాటే సమయానికి దుంపల్లోని తేమ పూర్తిగా ఆరిపోయి నెలరోజులకు మొలకలు ప్రారంభమవుతాయి.  రైతుల అనుభవాల ప్రకారం 1000 కిలోల విత్తనం సేకరిస్తే… దుంప  ఆరుదల తర్వాత 650కిలోలకు చేరుకుంటుంది. దీనిలో మొలకలు రాని విత్తనాన్ని గ్రేడింగ్ చేసి ఏరివేయాల్సి వుంటుంది. అందువల్ల రైతులు సాధ్యమైనంత ఎక్కువ విత్తనాన్ని సేకరించి పెట్టుకోవటం అవసరం. విత్తనం నాటే సమయంలో దుంపలో 2 నుంచి 3 మొలకలు వచ్చి 40-50 గ్రాములు బరువు కలిగి వుండాలి. వీటిని ఎత్తైన బెడ్లపై నిర్ధేశించిన యాజమాన్య పద్ధతులు అవలంభించి నాటుకోవాల్సి వుంటుంది.