Priyanka Chaturvedi: బీజేపీ తదుపరి టార్గెట్ అదే.. ఇక మనకి సుప్రీంకోర్టే దిక్కు: ఉద్ధవ్ ఠాక్రే వర్గం నాయకురాలు

Priyanka Chaturvedi: కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుపై శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నాయకురాలు ప్రియాంక చతుర్వేది తీవ్ర ఆరోపణలు చేశారు.

Priyanka Chaturvedi: బీజేపీ తదుపరి టార్గెట్ అదే.. ఇక మనకి సుప్రీంకోర్టే దిక్కు: ఉద్ధవ్ ఠాక్రే వర్గం నాయకురాలు

కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుపై శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నాయకురాలు ప్రియాంక చతుర్వేది తీవ్ర ఆరోపణలు చేశారు. న్యాయవ్యవస్థను బీజేపీ తదుపరి లక్ష్యంగా చేసుకుందని వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత సర్వోన్నత న్యాయస్థానంపై ఉందని వ్యాఖ్యానించారు. శివసేన పార్టీ ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’ ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి చెందుతుందని ఎన్నికల సంఘం తేల్చిచెప్పిన నేపథ్యంలో.. ఉద్ధవ్ ఠాక్రే వర్గం నాయకులు శనివారం ముంబైలోని ‘మాతోశ్రీ’కి క్యూ కట్టారు.

సుప్రీంకోర్టే కాపాడాలి
ఈ సందర్భంగా ప్రియాంక చతుర్వేది మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐలను కమలం పార్టీ ఇప్పటికే ఎన్నికల సాధనంగా మార్చుకుందని ఆరోపించారు. బీజేపీ పాలకుల తదుపరి లక్ష్యం న్యాయవ్యవస్థ అని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే కేంద్ర న్యాయ మంత్రి, రాజ్యసభ ఛైర్మన్ న్యాయవ్యవస్థను సవాలు చేస్తూనే ఉన్నారని ఆవేదన చెందారు. ప్రజాస్వామ్యాన్ని ఇక సుప్రీంకోర్టే కాపాడాలని అభిప్రాయపడ్డారు.


‘విల్లు-బాణం’గుర్తును ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి కట్టబెట్టడాన్ని ప్రియాంక చతుర్వేది తప్పుబట్టారు. ప్రజాస్వామ్యం, చట్టాలను పరిరక్షించడానికి ఏర్పాటు చేసిన ఈసీ వంటి స్వతంత్ర సంస్థలు ఇంతగా దిగజారడం దారుణమన్నారు. రాజకీయ పార్టీకి ద్రోహం చేసిన వారి పక్షం వహించడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం.. పూర్తిగా రాజీపడిన సంస్థగా మారిందని విమర్శించారు. ECI అంటే Entirely Compromised Institution of Indiaగా ఆమె వర్ణించారు.

Also Read: అసలైన పులి షిండేనే.. ఉద్ధవ్ థాకరేకు షాకిస్తూ శివసేనను షిండేకు కేటాయించిన ఈసీ

ఎన్నికల సంఘం నిర్ణయంపై సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ఉద్ధవ్ ఠాక్రే వర్గం భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ‘మాతోశ్రీ’లో ఈరోజు సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం. అయితే ఈసీ కేటాయించిన కొత్త గుర్తును స్వీకరించి ముందుకు సాగాలని ఉద్ధవ్ ఠాక్రేకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ సూచించినట్టు తెలుస్తోంది.